
సంఘటన స్థలంలో శివానంద, కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న శివానంద భార్య స్వాతి
వారిద్దరూ రెండేళ్లు గాఢంగా ప్రేమించుకున్నారు. పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. ఎదిరించి మూడు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఈ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. బస్సు రూపంలో వచ్చిన మృత్యు వు భర్తను కబళించింది. ప్రాణప్రదంగా ప్రేమించి కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటు న్న భర్త కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ నవవధువు బాధ వర్ణణాతీతం. ఈ హృదయ విదారక సంఘటన మదనపల్లె మండలంలో సోమవారం జరిగింది.
చిత్తూరు, మదనపల్లె క్రైం: ప్రైవేట్ కళాశాలకు చెందిన బస్సు ఢీకొని యువకుడు మృతిచెందారు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. మదనపల్లె మండలం వలసపల్లె పంచాయతీ యర్రబల్లికాలనీకి చెందిన చారాల రమణ కుమారుడు శివానంద (23) భవన నిర్మాణ పనులు చేస్తున్నాడు. దగ్గర బంధువైన వాల్మీకిపురం మండలం చింతపర్తి సమీపంలో ఉన్న బోయపల్లెకు చెందిన స్వాతిని రెండేళ్లుగా ప్రేమిం చాడు. పెద్దలను ఎదిరించి మూడు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు. సోమవారం ఉదయం తన ద్విచక్రవాహనంలో మదనపల్లెలో భవన నిర్మాణ పనులు చేయడానికి వలసపల్లె పంచాయతీలోని బొగ్గిటివారిపల్లెకు చెందిన మరో భవన నిర్మాణ కార్మికుడు సుధాకర్ కుమారుడు షాదీప్ (20)తో కలిసి బయలుదేరాడు.
ఉదయం 8 గంటల ప్రాంతంలో ముంబయి– చెన్నై జాతీయ రహదారిలో ఉన్న కృష్ణాపురం జ్యూస్ ఫ్యాక్టరీ ఎదుట మదనపల్లె నుంచి పుంగనూరు వైపు వేగంగా వెళుతున్న ఓ కళాశాల బస్సు ఢీకొంది. ఈ సంఘటనలో శివా నంద, షాదీప్ తీవ్రంగా గాయపడ్డారు. రక్తపుమడుగులో కొన ఊపిరితో ఉన్న క్షతగాత్రులను స్థాని కులు గుర్తించి ఓ ప్రైవేటు వాహనంలో హుటాహుటిన స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. కుటుంబ సభ్యులు బాధితులను మెరుగైన వైద్యం కోసం ఓ అంబులెన్స్‌లో తిరుపతికి తరలిస్తుండగా శివానంద మార్గమధ్యంలో మృతి చెందాడు. షాదీప్ కొన ఊపిరితో కొట్టుమెట్టాడుతున్నాడు. శివానంద మరణవార్త తెలియగానే యర్రబల్లి గ్రామస్తులు పెద్ద ఎత్తున ప్రభుత్వాస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. శివానంద భార్య స్వాతిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment