సూర్యతేజ(ఫైల్)
రామకృష్ణాపూర్(చెన్నూర్) : ఉన్నత చదువులు చదివాడు. నాలుగున్నరేళ్లు అమెరికాలో ఉన్నాడు. ఇటీవలే స్వగ్రామానికి వచ్చాడు. మరో పది రోజుల్లో తిరిగి అమెరికాకు పయనమవుదామనుకున్నాడు. అంతలోనే అతడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. రామకృష్ణాపూర్‌కు చెందిన సూర్యతేజ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
పట్టణంలోని సీ–2 క్వార్టర్స్‌లో నివాసముండే సింగరేణి ఉద్యోగి ప్రభాకర్‌శర్మ–భాస్కర్‌లక్ష్మి పెద్ద కుమారుడు సూర్యతేజ(27) బీటెక్ పూర్తి చేశాడు. నాలుగున్నరేళ్ల క్రితం ఉన్నత చదువులతో పాటు అక్కడ స్థిర పడదామని అమెరికా వెళ్లాడు. జూన్ 23న అమెరికా నుంచి తిరిగి వచ్చాడు.
నాలుగున్నరేళ్లకు ఓసారి వీసాపై స్టాంపింగ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ పని మీదే సూర్యతేజ ఇంటికి వచ్చాడు. హైదరాబాద్ వెళ్లి ఆ పని చేయించుకున్నాడు. తిరుగు ప్రయాణం కోసమని ఫ్లైట్ టిక్కెట్ బుకింగ్ పూర్తి చేసుకున్నాడు. ఆగస్టు 5న తిరిగి అమెరికా వెళ్లాల్సి ఉంది.
కామారెడ్డి నుంచి తిరిగివస్తుండగా..
రామకృష్ణాపూర్‌కు చెందిన సూర్యతేజ తన మిత్రుడైన సందీప్‌తో కలిసి హైదరాబాద్ నుంచి కామారెడిక్డి వెళ్లాడు. కామారెడ్డి నుంచి వీరిద్దరూ క్యాబ్ అద్దెకు తీసుకుని హైదరాబాద్‌కని ఆదివారం రాత్రి బయలుదేరి వెళ్లారు. మార్గమధ్యంలో రామాయంపేట వద్ద వీరు ప్రయాణిస్తున్న క్యాబ్ కార్ డివైడర్‌కు ఢీకొట్టి ప్రమాదానికి గురైంది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సూర్యతేజతో పాటు అతడి మిత్రుడు సందీప్ ఇద్దరూ మృత్యువాత పడ్డారు. క్యాబ్ డ్రైవర్ కూడా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా కొన్ని రోజుల్లో అమెరికా వెళ్లాల్సిన సూర్యతేజ మృతి ఘటన స్థానికంగా విషాదం నింపింది. సోమవారం సూర్యతేజ మృతదేహాన్ని స్థానిక సీ–2 క్వార్టర్స్‌కు తీసుకువచ్చారు. తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
Comments
Please login to add a commentAdd a comment