ఆస్పత్రి ఎదుట మృతుడి భార్య, పిల్లల రోదన
సిద్దిపేటటౌన్: రోడ్డు ప్రమాదంలో కాలు విరగడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన వ్యక్తి వైద్యులు లేక, సిబ్బంది పట్టించుకోక మృతి చెందాడు. ఈ ఘటన శనివారం రాత్రి సిద్దిపేట జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అడవిదాచారం గ్రామానికి చెందిన మిందె కనకయ్య(35) శనివారం రాత్రి జిల్లెల్ల క్రాస్ రోడ్డు నుంచి దాచారం బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో చిన్నలింగాపూర్ శివారులో జవహర్‌నగర్‌కు చెందిన గౌరవేని మహేశ్ బైకు ఇతని బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో కనకయ్య కాలు విరిగింది. దీంతో కనకయ్యను బంధువులు సిరిసిల్ల ఆస్పత్రికి తరలించారు. అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో దగ్గరలోని సిద్దార్ధ ఆస్పత్రికి రాత్రి 11 గంటల సమయంలో తీసుకువచ్చారు. పరీక్షించిన సిబ్బంది ఎక్స్‌రే, ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించి ఉదయం డాక్టర్ రాగానే చికిత్స చేస్తారని చెప్పి ఇంజక్షన్ ఇచ్చి వెళ్లారు.
ఆ తర్వాత కనకయ్యకు ఇబ్బంది పడుతుండడంతో ఆస్పత్రి సిబ్బందిని కుటుంబ సభ్యులు ఎన్ని సార్లు పిలిచినా పట్టించుకోలేదు. ఉదయం వరకు చికిత్స అందించలేమని నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రాత్రి కనకయ్య పొట్ట బాగా ఉబ్బడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఆస్పత్రి సిబ్బందిని మరోసారి పిలిచారు. అప్పుడు బలవంతంగా వచ్చిన సిబ్బంది పేషెంట్ కండీషన్ సీరియస్‌గా ఉందని వెంటనే ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. రాత్రి 3 గంటల సమయంలో ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే కనకయ్య మృతిచెందినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కనకయ్య కుటుంబ సభ్యులు సిద్దార్ధ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే కనకయ్య మృతి చెందాడని ఆరోపించారు. ఉదయం ఆస్పత్రికి వచ్చిన డాక్టర్ పరిహారంగా రూ. 4 లక్షలు ఇస్తామని చెప్పారని, ఆ తర్వాత డబ్బులు ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ Ððవెళ్లిపోయాడని బంధువులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై సిద్దిపేట వన్ టౌన్ పోలీసులను వివరణ కోరగా రోడ్డు ప్రమాదం జరిగిన విషయంపై ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యిందని చెప్పారు. దీనిపై విచారణ చేసి అక్కడి పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment