
ఎన్క్లోజర్లోకి దూకిన వ్యక్తిని బయటకు లాక్కొస్తున్న జూసిబ్బంది
తిరువనంతపురం : కేరళలోని తిరువనంతపురం జూలో బుధవారం కాసేపు భయోత్పాత వాతావరణం నెలకొంది. ఉన్నట్టుండి ఓ వ్యక్తి సింహపు ఎన్‌క్లోజర్లోకి దూకి సింహం వైపు దూసుకెళ్లాడు. పొద్దున్నే ఎవరి ముఖం చూశాడో గానీ సింహం అతనిని గమనించకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. వ్యక్తి ఎన్‌క్లోజర్‌లో దూకడం గమనించిన వాచ్‌మన్ అలారం మోగించడంతో జూసిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకున్నారు. వెంటనే జూ సిబ్బంది చాకచక్యంగా సింహాన్ని ఎన్‌క్లోజర్‌లో ఉన్న గదిలోకి పంపించడంతో ప్రాణాపాయం తప్పింది.
సిబ్బంది వెంటనే ఎన్‌క్లోజర్‌లోకి దిగి అతనిని పట్టుకున్నారు. ఎన్‌క్లోజర్‌లోకి దూకిన వ్యక్తి ఒట్టుప్పాలానికి చెందిన మురుగన్(45)గా గుర్తించారు. వెంటనే అతనిని చికిత్స నిమత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే మురుగన్ ఎందుకు ఎన్‌క్లోజర్‌లోకి దూకాడనే వివరాలు మాత్రం తెలియాల్సిఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మతిస్థిమితం సరిగా లేక ఎన్‌క్లోజర్‌లోకి దూకాడా లేక ఆత్మహత్య చేసుకోవడానికే ఎన్‌క్లోజర్‌లోకి దిగాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment