
సాక్షి, తిరువనంతపురం : లైంగిక వేధింపులకు పాల్పడేవాళ్లు కూడా తెలివి మీరారు. ప్రత్యక్షంగా వేధింపులకు అవకాశం దొరకడం లేదని పరోక్ష వేధింపులకు ప్లాన్ చేసుకుంటున్నారు. టెక్నాలజీ సాయంతో వారు మహిళలను టార్గెట్ చేస్తున్నారు. సీక్రెట్ కెమెరాలను ఆశ్రయిస్తూ వాటితో మహిళలను అసభ్యకరంగా చిత్రీకరిస్తున్నారు. కేరళలో ఓ వ్యక్తి మహిళల స్కర్ట్స్ వీడియోలను చిత్రీకరించాలనే దుర్బుద్ధితో ఏకంగా తన చెప్పులకు రంధ్రాలు చేసి అందులో మినీ వీడియో కెమెరా పెట్టి రికార్డింగ్ చేస్తూ పోలీసుల చేతికి చిక్కాడు. వివరాల్లోకి వెళితే..
బైజు అనే వ్యక్తి త్రిశూర్ జిల్లాలోని కాలోల్సావం అనే ప్రాంతంలో ఓ వేడుకకు హాజరయ్యాడు. ఎవరికీ అనుమానం రాకుండా తన చెప్పులకు రంధ్రం చేసి అందులో కెమెరా పెట్టి ఆ వేడుక మొత్తం కలియ తిరగడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా స్కర్ట్స్ వేసుకున్నవారి వద్దకు వెళడం అక్కడ కొద్ది సేపు ఉండటం తర్వాత మరొకరి దగ్గరకు వెళుతుండటం చేశాడు. దాంతోపాటు ఎక్కువమంది ఉన్నచోటుకు వెళ్లి వారి మధ్యలో ఎవరికీ అనుమానం రాకుండా కెమెరా ఉన్న చెప్పును పెట్టడం దూరంగా వెళ్లి గమనించడం చేశాడు. అయితే, అదే వేడుకలో ప్రత్యేక నిఘాతో ఉన్న పోలీసులు అతడిని గమనించి అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా అతడి చెప్పులో కెమెరా ఉన్నట్లు తెలిసింది. దాంతో అతడిని అరెస్టు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు ఇలాంటి వ్యక్తిని, చర్యను తాము ఇప్పటి వరకు చూడలేదని అన్నారు.