సాక్షి, గుంటూరు : జిల్లాలో వరుసగా జరిగిన మూడు హత్యలు కలకలం రేపుతున్నాయి. వివాహేత సంబంధాలతో వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడనే కోపంతో బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన ఏడుకొండలు (35) అనే వ్యక్తిని నాగయ్య అనే మరోవ్యక్తి దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వెల్లటూరుకు చెందిన అంకె ఏడుకొండలు పశువుల కాపరి. శుక్రవారం ఉదయం గేదెలను తోలుకొని సమీపంలో అడవికి వెళ్లాడు.శనివారం వరకు ఇంటికి చేరకపోయేసరికి బంధువులు పోలీసులకు సమాచారమిచ్చారు. స్థానికుల సహాయంతో పోలీసులు అడవిలో గాలించగా ఓ ప్రదేశంలో గోనె సంచిలో ఓ మృతదేహం కనిపించింది. తల నరికి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టగా ఏడుకొండలు భార్యతో నాగయ్య అనే వ్యక్తికి గత కొంతకాలంగా వివేహేతర సంబంధం ఉందని, ఈ విషయమై వీరివురి మధ్య గొడవలు ఉన్నట్లు గుర్తించారు. నాగయ్య శుక్రవారం సాయంత్రం అడవికి వెళ్లి అతనితో ఘర్షణ పడి ఏడుకొండలను గొడ్డలితో నరికి చంపి సంచిలో మూటకట్టి అక్కడే పడేసి పరారైనట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
అనుమానంతో గొంతు నులిమి..
దుగ్గిరాలలో మరో దారుణం జరిగింది. పద్మావతి అనే మహిళను సుబ్బారెడ్డి అనే వ్యక్తి హతమార్చాడు. గాంధీనగర్‌కి చెందిన సుబ్బారెడ్డి.. చెన్నకేశవ్‌నగర్‌కి చెందిన పద్మావతి కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. అనుమానం నేపథ్యంలో పద్మావతిని సుబ్బారెడ్డి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. సుబ్బారెడ్డికి స్థానికులు దేహశుద్ధి చేశారు. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి.
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం పిడుగురాళ్ల పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని శ్రీనివాస కాలనీకి చెందిన మీసాల మధు (21) హెచ్‌పీ గ్యాస్ గిడ్డంగి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద మృతి చెందాడు. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ సురేంద్రబాబు, తన సిబ్బందితో సంఘటనా స్థలానికి వచ్చారు. సంఘటనపై ఆరా తీశారు. గురువారం రాత్రి మధు తన స్నేహితులతో కలిసి మద్యం తాగాడని, ఆ సమయంలో వారి మధ్య ఘర్షణ జరిగిందని తెలుసుకున్నారు. మధు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, కావాలనే హత్య చేశారని బంధువులు ఆరోపించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, పలువురు అనుమానితులను స్టేషన్‌కు తీసుకువచ్చి విచారిస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment