కాలిపోయిన దుకాణం.. చిత్రంలో నంజీలాల్ ఎముకల గూడు
నారాయణపేట రూరల్: గాఢనిద్రలో ఉన్న సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఈ సంఘటన శనివారం రాత్రి పేటలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ కృష్ణయ్య కథనం ప్రకారం.. గుజరాత్ రాష్ట్రానికి చెందిన లాడారాం పటేల్ దాదాపు 50 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం నారాయణపేటకు వలస వచ్చి స్థానిక శాతవాహన కాలనీలో నివాసం ఉండేవాడు. సొంతంగా యాద్గీర్ రోడ్‌లో సామిల్ పెట్టుకుని జీవనం గడుపుతుండగా అదే వ్యాపారాన్ని ఆయన కుమారుడు నంజీలాల్ పటేల్(62) కొనసాగించారు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు ఉండగా వారిలో ఇద్దరికి వివాహం చేయగా చిన్న కూతురుకు గత నెలలో నిశ్చితార్థం చేసి వచ్చే నెలలో పెళ్లి పెట్టుకున్నారు.
ఇక ముగ్గురు కుమారులు పెద్ద వారు కావడంతో మారుతున్న కాలానికి అనుగుణంగా సామిల్‌ను మార్చి గత పదేళ్ల క్రితం హరిఓం ఫ్‌లైవుడ్ సెంటర్ ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల కాలంలో కుటుంబంలో నెలకొన్న సమస్యలతో నంజీలాల్ పటేల్ ప్రతిరోజు రాత్రి ఒంటరిగా వచ్చి దుకాణంలో పడుకునేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి సైతం భోజనం చేసి వచ్చి నిద్రిస్తుండగా అర్ధరాత్రి దాటిన తర్వాత దుకాణంలో షార్ట్‌సర్క్యూట్ జరిగింది. గాఢ నిద్రలో ఉన్న నంజీలాల్ పటేల్‌కు ఒక్కసారిగా పొగ చుట్టుకోవడంతో ఊపిరి తట్టుకోలేక గుండెపోటు వచ్చింది. ఇక లేవలేని స్థితిలో అక్కడే పడి ఉండగా.. మంటలు వ్యాపించి దుకాణం పూర్తిగా దగ్ధమైంది. ఈ క్రమంలో ఆయన దుకాణంలోనే సజీవ దహనమయ్యాడు.
తెల్లవారిన తర్వాత అటుగా వెళ్తున్న వ్యక్తులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వచ్చి దుకాణం తెరిచి చూడగా శరీరమంతా కాలి బూడిద కాగా మృతుడి బొక్కలు మాత్రమే మిగిలి ఉన్నాయి. పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పంచనామా నిర్వహించారు. సుమారు రూ.6 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగురావు నామాజీ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రఘురామయ్యగౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘటనపై నంజీలాల్ పటేల్ కుమారుడు కపిల్ పటేల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment