చిచ్చు పెట్టిన ‘వివాహేతర బంధం’ తీర్పు | Man Says Supreme Court Has Allowed Adultery, Wife Ends Life | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 1 2018 1:39 PM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

Man Says Supreme Court Has Allowed Adultery, Wife Ends Life - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చెన్నై: భర్త వివాహేతర సంబంధం ఓ వివాహిత ప్రాణాలు తీసింది. తాళి కట్టిన భర్త తనను నిర్లక్ష్యం చేసి మరో మహిళతో సంబంధం​ పెట్టుకోవడం భరించలేని ఆ ఇల్లాలు చివరకు బలవంతంగా తన ప్రాణాలు తీసుకుంది. భర్తను నిలువరించేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వివాహేతర సంబంధం నేరం కాదని సాక్షాత్తూ సుప్రీంకోర్టే చెప్పిందని, తనను ఆపేవారే లేరంటూ భర్త చెలరేగిపోవడంతో చేసేదిలేక ఆ నిస్సహాయురాలు తన నిండు ప్రాణాన్ని తీసుకుంది. ఈ సంఘటన చెన్నైలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.

చెన్నై ఎంజీఆర్‌నగర్, నెసపాక్కం భారతీనగర్‌ రామదాస్‌ వీధికి చెందిన పుష్పలత (24). ఈమె భర్త జాన్‌ ఫ్రాంక్లిన్‌.. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ పార్కులో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ పెద్దలను అభీష్టానికి వ్యతిరేకంగా రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒకటిన్నర ఏడాది పాప ఉంది. పుష్పలత క్షయ వ్యాధి బారిన పడటంతో జాన్‌ తన భార్యను పట్టించుకోవడం మానేశాడు. తనతో కలిసి పనిచేసే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

ఈ విషయం పుష్పలతకు తెలియడంతో ఆమె శనివారం భర్తను నిలదీసింది. పోలీసు కేసు పెడతానని కూడా బెదిరించింది. అయితే తనను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని, వివాహేతర సంబంధం నేరం కాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందంటూ వాదించాడు. దీంతో మనస్తాపానికి గురైన పుష్పలత శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. విషయం తెలిసి ఎంజీఆర్‌ నగర్‌ పోలీసులు సంఘటన స్థలం చేరుకుని విచారణ జరిపారు. పుష్పలత మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు విచారణ జరుపుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement