భర్తతో మృతురాలు లలిత
సాక్షి, డోన్ : మండల పరిధిలోని బొంతిరాళ్ల గ్రామానికి చెందిన ఓ వివాహిత పొలానికి వెళ్లే దారిలో అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా పడివుంది. భర్త గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా తలపై గాయాలు ఉండటంతో అల్లుడే తమ కూతురిని హత్య చేశాడని మృతురాలి తల్లి, బంధువులు ఆరోపించారు. ఘటన వివరాలు.. మండలంలోని ధర్మవరం గ్రామానికి చెందిన హరిజన నడిపి ఎల్లయ్య, మారెమ్మ కుమార్తెను లలిత అలియాస్ పెద్ద మద్దక్క(29)ను పదేళ్ల క్రితం బొంతిరాళ్ల గ్రామానికి చెందిన హరిజన మారెప్ప, మంగమ్మల కుమారుడు అర్జున్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి సూర్యకళ (8), రాకేష్ (6), అక్షర (4) సంతానం. కాన్పు సమయంలో లలితకు ఆరోగ్యం దెబ్బతిని వినికిడి సమస్య ఏర్పడింది.
బుధవారం ఉదయం భార్య, భర్త పొలానికి వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో తన భార్య పొలం దారిలో మృతిచెంది ఉందని మృతదేహం తీసుకొని అర్జున్ ఇంటికి వచ్చాడు. కాగా తలపై రక్త గాయాలు ఉండటంతో మృతురాలి తల్లితో పాటు బంధువులు భర్తే హత్య చేశాడని ఆరోపించారు. గ్రామస్తులు కూడా మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. రూరల్ సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్‌ఐ మధుసూదన్‌రావ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భర్త అర్జున్‌తో పాటు అతని సోదరున్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. లలితను భర్తే పథకం ప్రకారం హత్య చేశాడా? సరిపోని వ్యక్తులెవరైనా హతమార్చారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment