సాక్షి, సిటీబ్యూరో: ‘నువ్వు ముషీరాబాద్‌లో క్లినిక్ నడుపుతుంటావు. నీ భార్య కూడా నీతో కలిసే ప్రాక్టీస్ చేస్తుంటుంది. నీ కొడుకు రాయచూర్‌లో వైద్యుడిగా పని చేస్తున్నాడు. నాకు అన్నీ తెలుసు.. ఇప్పుడు నువ్వు రూ.కోటి ఇవ్వకుంటే నీతో పాటు కుటుంబాన్నీ లేపేస్తా’ ఈ పంథాలో నగరానికి చెందిన ఓ వైద్యుడిని బెదిరించిన కేసులో ఓ మెడికల్ రిప్రజెంటేటివ్‌ను మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గతంలో ఎలాంటి నేరచరిత్ర లేని ఇతగాడు ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనే ఈ నేరం చేసినట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు మంగళవారం వెల్లడించారు.
విదేశాలకు వెళ్లినా ఫలితం లేక...
న్యూ మలక్‌పేటలోని కాలాడేరాకు చెందిన మహ్మద్ అజర్ మెహ్దీ బీకాం మొదటి సంవత్సరంతో చదువుకు స్వస్తి చెప్పాడు. కొన్నేళ్ల పాటు సౌదీ అరేబియా, కెనడాలకు వెళ్లి వచ్చినా... ఎక్కడా ఉద్యోగాల్లో నిలదొక్కుకోలేకపోయాడు. దీంతో తిరిగి వచ్చిన ఇతను హిమాయత్‌నగర్‌లోని ఓ హెల్త్ కేర్ సంస్థలో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా చేరాడు. తన వృత్తిలో భాగంగా నిత్యం అనేక హాస్పిటళ్లు, క్లినిక్‌లకు వెళ్తూ వైద్యులను కలిసేవాడు. వారి ఫోన్ నెంబర్లు సైతం సేకరించి తన వద్ద భద్రపరిచే వాడు. గత కొద్దిరోజులుగా అజర్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు తల్లి అనారోగ్యం పాలైంది. దీంతో డబ్బు అవసరం ఎక్కువ కావడంతో తన వద్ద ఉన్న డాక్టర్ల చిట్టా తిరగేశాడు. ముషీరాబాద్‌లోని దయారా మార్కెట్‌లో భార్యతో కలిసి క్లినిక్ నిర్వహించే డాక్టర్‌పై ఇతడి కన్నుపడింది. సదరు వైద్యుడి కుమారుడు రాయచూర్‌లో డాక్టర్‌గా ఉన్నట్లు తెలియడంతో బెదిరించడం తెలికనే ఉద్దేశంతో అతడిని టార్గెట్‌గా చేసుకున్నాడు.
స్నేహితుడి ప్రియురాలి పేరుపై సిమ్...
ఇందుకుగాను అజర్ పక్కాగా పథకం వేశాడు. తన ఫోన్ నుంచి కాల్స్ చేస్తే దొరుకుతామనే ఉద్దేశంతో అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు. రోడ్డు పక్కన ఉండే దుకాణం నుంచి గత నెల 26న సెకండ్ హ్యాండ్ ఫోన్ ఖరీదు చేశాడు. ముంబైలో ఉంటున్న తన స్నేహితుడి ప్రియురాలి వ్యక్తిగత కారణాలు చెప్పిన అజర్ స్నేహితుడి నుంచి ఆమె వివరాలు, గుర్తింపులు సేకరించాడు. వీటి ఆధారంగా సిమ్‌కార్డు ఖరీదు చేసి పాత ఫోన్‌లో వేసుకుని తాను టార్గెట్ చేసిన వైద్యుడు భార్య సెల్ నెంబర్‌కు బెదిరింపు సందేశాలు, ఫోన్లు చేయడం మొదలెట్టాడు. తనకు భారీ బ్యాక్ గ్రౌండ్ ఉందంటూ రూ.కోటి డిమాండ్ చేశాడు. అంత డబ్బు తన వద్ద లేదని డాక్టర్ చెప్పడంతో కనీసం రూ.50 లక్షలైనా ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. గత నెల 27 నుంచి వస్తున్న ఈ బెదిరింపులను సీరియస్‌గా తీసుకున్న ఆ వైద్యుడు ముషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీంతో రంగంలోకి దిగిన సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సైలు బి.కాంతరెడ్డి, జి.తిమ్మప్ప వలపన్ని మంగళవారం అజర్‌ను పట్టుకున్నారు. అతడి నుంచి సెల్, సిమ్ తదితరాలు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం ముషీరాబాద్ పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment