విమ్స్ మార్చురీ వద్ద విలపిస్తున్న సంబంధీకులు, దివ్య(ఫైల్)
కర్ణాటక, బళ్లారి రూరల్ : ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం ఫెయిల్ అయినందుకు వైద్యవిద్యార్థిని ఆత్మహత్య చేసుకొన్న ఘటన నగరంలోని విద్యానగర్‌లో గురువారం వెలుగు చూసింది. సంబంధీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగర శివారు ప్రాంతంలోని కృష్ణానగర్ క్యాంపునకు చెందిన శ్రీనివాసరావు, గీత దంపతుల కుమార్తె ఎ.దివ్య(20) విమ్స్ వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతోంది. విద్యానగర్‌లో ఉంటున్న తమ తల్లిదండ్రుల వద్ద నుంచి ప్రతిరోజూ కళాశాలకు వెళ్లివస్తుండేది. ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసింది. బుధవారం రాత్రి 11 గంటలకు ఫలితాలు వెలువడ్డాయి. ఈ పరీక్షల్లో దివ్య ఫెయిల్ అయింది.
ఇదే సమయంలో బెంగుళూరులో ఉన్న తమ్ముడు ఫోన్ చేసి ఫలితాలు వచ్చాయి కదా, ఏమైందని అడిగాడు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని చెప్పింది. మళ్లీ కొంతసేపటికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది, నిద్ర పోయి ఉంటుందని అనుకొన్నాడు. అయితే తాను ఫెయిల్ అయ్యానన్న విషయం అందరికీ తెలిసిందని మనస్తాపంతో దివ్య తన గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఉదయం తల్లిదండ్రులు గమనించి విమ్స్‌కు తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై కౌల్‌బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణస్వామి, డాక్టర్ దత్తాత్రేయరెడ్డి, వైద్యవిద్యార్థులు దివ్య మృతదేహాన్ని పరామర్శించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న ఎంఎల్‌ఏ శ్రీరాములు విమ్స్ మార్చురీకి చేరుకొని తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. విద్యార్థులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment