
లక్నో : ముస్లిం యువకుడిని ప్రేమించిందన్న కారణంగా ఓ యువతిపై దాడి చేశారు మీరట్ పోలీసులు. ‘ఆ మతం వాడు తప్ప ఎవరూ దొరకలేదా’ అంటూ ఆమెను తీవ్ర పదజాలంతో దూషించారు. వివరాలు.. మీరట్‌కు చెందిన ఓ హిందూ యువతి, ముస్లిం యువకుడు ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో అతడిని కలిసేందుకు సదరు యువతి మీరట్‌లోని మెడికల్ ఏరియాకు వచ్చింది. వారిద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో కొంతమంది విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. వీరిద్దరు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అమ్మాయిని పోలీసు స్టేషనుకు తీసుకువచ్చి కౌన్సిలింగ్ చేశారు.
ఈ క్రమంలో అమ్మాయి పక్కన కూర్చున్న మహిళా కానిస్టేబుల్ ఆవేశంతో ఊగిపోతూ.. అసభ్య పదజాలంతో దూషించింది. అంతటితో ఆగకుండా తలపై పదే పదే కొడుతూ దాడి చేసింది. ఇందుకు అమ్మాయికి మరోవైపు కూర్చున్న మరో పోలీసు ఆఫీసర్ కూడా వంతపాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వీడియోలో ఉన్న ముగ్గురు పోలీసులను, మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. కాగా సదరు ముస్లిం యువకుడిపై ఫిర్యాదు చేయాల్సిందిగా వీహెచ్‌పీ సభ్యులు అమ్మాయి తండ్రిపై ఒత్తిడి తీసుకువచ్చారు. కానీ అందుకు ఆయన అంగీకరించకపోవడంతో ఆయనపై కూడా అసహనం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment