మెట్రో పిల్లర్‌ కాదు.. కిల్లర్‌ | Metro Station Roof Collapse in Ameerpet, woman dead | Sakshi
Sakshi News home page

మెట్రో పిల్లర్‌ కాదు.. కిల్లర్‌

Published Sun, Sep 22 2019 6:05 PM | Last Updated on Mon, Sep 23 2019 10:31 AM

Metro Station Roof Collapse in Ameerpet, woman dead - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌వాసుల కలల మెట్రోస్టేషన్‌ ఓ మహిళ నిండు ప్రాణాన్ని బలిగొంది. కేపీహెచ్‌బీ కాలనీలోని ఎస్‌.ఆర్‌.హోమ్స్‌లో నివసించే హరికాంత్‌ రెడ్డి టీసీఎస్‌లో పనిచేస్తున్నారు. ఆయన భార్య మౌనిక కంతాల(24) గృహిణి. ఆమె తన సమీప బంధువు మున్నీకి అమీర్‌పేట్‌లో హాస్టల్‌ వసతి చూసేందుకు ఆదివారంమధ్యాహ్నం కేపీహెచ్‌బీ మెట్రోస్టేషన్‌లో రైలు ఎక్కి అమీర్‌పేట్‌లో దిగారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మౌనికతోపాటు ఆమె బంధువు మున్నీ సారథి స్టూడియో వైపు మెట్రో స్టేషన్‌ మెట్లు దిగారు. వర్షం పడుతుండటంతో మెట్రోస్టేషన్‌ మెట్ల మార్గం పిల్లర్‌ కింద నిరీక్షిస్తున్నారు. 

ఈ సమయంలో పిల్లర్‌పైన ఉన్న మెట్రో స్టేషన్‌ కాంక్రీటు అంచులు పెచ్చులూడి తొమ్మిది మీటర్ల ఎత్తు నుంచి మౌనిక తలపై పడ్డాయి. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే కుప్పకూలింది. రక్తపు మడుగులో ఉన్న ఆమెను స్థానికులు, మెట్రో సిబ్బంది సమీపంలోని ఆస్పత్రికి ఆటోలో తరలించారు. అయితే మార్గమధ్యలోనే మౌనిక మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు సమాచారం అందడంతో మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలిది కరీంనగర్‌ జిల్లా అని, నూతనంగా వివాహమైందని పోలీసులు తెలిపారు. బాధితురాలి కుటుంబానికి నష్టపరిహారం అందించాలని ఎల్‌అండ్‌టీ మెట్రో అధికారులను ఆదేశించినట్లు హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎనీ్వఎస్‌ రెడ్డి తెలిపారు. కాగా, ప్రమాద స్థలాన్ని నగర బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు సందర్శించారు.  


నిర్మాణ లోపాలే ప్రమాదానికి కారణం... 
స్టేషన్లను సైతం ప్రీకాస్ట్‌ విధానంలో నిర్మించారు. అంటే ముందుగా స్టేషన్‌కు అవసరమైన సెగ్మెంట్ల తయారీని ఉప్పల్, మియాపూర్‌ కాస్టింగ్‌ యార్డులో సిద్ధం చేసి ఆ తర్వాత స్టేషన్లు నిర్మించిన చోట అమర్చారు. పిల్లర్లు, వాటిపై ఏర్పాటు చేసిన వయాడక్ట్‌ సెగ్మెంట్ల మధ్య నున్న ఖాళీ ప్రదేశాన్ని కాంక్రీట్‌ మిశ్రమంతో మూసివేశారు. ఇక్కడే పొరపాట్లు జరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ పనులను హడావుడిగా చేపట్టడంతో మెట్రో రైలు వెళ్లే సమయంలో ప్రకంపనలకు కాంక్రీట్‌ పెచ్చులూడి తరచూ కింద పడుతుందని తేల్చారు.

ఇది మెట్రో ప్రయాణికులు, రహదారి మార్గంలో వెళ్లే వాహనదారుల పాలిట శాపంగా మారుతోందని హెచ్చరిస్తున్నారు. ఆదివారం జరిగిన ఘటనకు సైతం ఇదే కారణమని అభిప్రాయపడుతున్నారు. కాగా, గ్రేటర్‌ సిటీలో మెట్రో ప్రాజెక్టు 2017 నవంబర్‌లో ప్రారంభమైంది. రెండేళ్ల వ్యవధిలోనే ఇలాంటి ఘటన జరగడం మెట్రో ప్రాజెక్టులోని డొల్లతనాన్ని బయటపెడుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement