కర్నూలు, ఆదోని: ఓ బాలికను కిడ్నాప్ చేయడంతోపాటు బలవంతంగా పెళ్లి చేసుకుని.. మూడు నెలల పాటు లైంగికంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కామాంధుడి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు(15ఏళ్లు) పోలీసులను ఆశ్రయించింది. విలేకరులతో తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొని విలపించింది. వివరాలు బాలిక మాటల్లోనే.. ‘‘ మాది ఎమ్మిగనూరు పట్టణం గాంధీనగర్.. మా అమ్మ 2015లో హెచ్‌ఐవీతో మృతి చెందింది. అమ్మ నుంచి నాకు కూడా వ్యాధి సోకింది. విషయం తెలియడంతో నాన్న ఎంతో కుమిలిపోయారు. ఏం చేయాలో దిక్కుతోచలేదు. ఆదోని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు నాన్నను సంప్రదించి.. హెచ్‌ఐవీకి చికిత్స అందిస్తూ చదివిస్తామన్నారు.
దీంతో నేను ఆదోని పట్టణంలోని ఓ పాఠశాలలో 8వ తరగతిలో చేరాను. నాన్న ఆరోగ్యం దెబ్బతిన్న విషయం తెలిసి ఎమ్మిగనూరుకు వచ్చాను. మా వీధిలోనే ఉన్న శంకర్ అనే యువకుడు నన్ను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. నాకు హెచ్‌ఐవీ ఉందని చెప్పినా వినలేదు. మూడు నెలల క్రితం రాత్రి 7.30గంటల సమయంలో నేను పాలప్యాకెట్టు కోసం బయటకు రాగానే మధు, యువరాజ్‌తో వచ్చిన శంకర్ నన్ను సైకిల్‌మోటార్‌పై బలవంతంగా ఆదోనికి తీసుకొచ్చాడు. ఓ ఇంట్లో బంధించి బలవంతంగా పెళ్లిచేసుకున్నాడు. నాకు హెచ్‌ఐవీ ఉందని చెప్పినా వినలేదు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పారిపోయి వచ్చి నాన్నకు కబురు పెట్టారు. నా జీవితాన్ని సర్వ నాశనం చేసిన శంకర్, మధు, యువరాజ్, బంధువు ఆంజనేయపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని బాలిక డిమాండ్ చేశారు. బాధిత బాలికను షీటీం పోలీసులు విచారించారు. ఏం జరిగిందో విచారించి కేసు నమోదు చేస్తామని ఆదోని త్రీ టౌన్ సీఐ శ్రీరాములు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment