మృతదేహం లభించిన బావి ,చరణ్ మృతదేహం ,విలపిస్తున్న తల్లి పార్వతి
అమ్మ ఆశలు ఫలించలేదు. ఆ తల్లిదండ్రుల ప్రార్థనలు దేవుడు వినలేదు. శుక్రవారం అదృశ్యమైన బాలుడు చరణ్ ఎవరూ ఊహించని విధంగా ఆదివారం గ్రామంలోని బావిలో శవమై తేలాడు. పండగ సమయంలో ఈ విషాద వార్త వినాల్సి రావడంతో లొద్దపద్ర మూగబోయింది. బాలుడిని తలచుకుని ఊరుఊరంతా రోదించింది. ఈ మరణం వెనుక బోలెడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం దొరికిన మృతదేహం ఇంకా తాజాగా ఉండడంతో ‘హత్య’ అనుమానాలు బలపడుతున్నాయి
కాశీబుగ్గ : సంక్రాంతి నవ్వులు మాయమైపోయాయి. పండగ కాంతి కారుచీకట్లలో కలిసిపోయింది. శుక్రవారం అదృశ్యమైన బాలుడు మళ్లీ చిరునవ్వుతో తిరిగి వస్తాడని ఆ అమ్మ భావించింది. ఎటో తప్పిపోయి ఉంటాడని, మళ్లీ తమ దగ్గరికే వచ్చేస్తాడని కుటుం బ సభ్యులంతా అనుకున్నారు. కానీ వీరందరి ఎదురు చూపులకు ఫలితం లేకుండా ఆ బాలుడు చనిపోయాడు. ఎవరూ ఊహించని రీతిలో గ్రామంలోనే ఓ బావిలో ఆదివారం శవమై తేలాడు. ఈ దిగ్భ్రాంతికర సంఘటనతో పలాస మండలం లొద్దపద్ర విలవిలలాడిపోయింది. గ్రామంలోని కొండవీధికి చెందిన జినగ దాతచరణ్ (7) ఆదివారం గ్రామం మధ్యలో ఉన్న బావిలో శవమై తేలడంతో ఆ ప్రాంతీయులంతా నిర్ఘాంతపోయారు.
ఎలా జరిగింది..?
బాలుడు శుక్రవారం తమ్ముడు సాత్విక్, గ్రామంలోని పిల్లలతో ఆడుకుంటూ ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు. ఆ సమయంలో చరణ్ తమ్ముడు సాత్విక్ అక్కడే ఉన్నా ఏం జరిగిందో సరిగ్గా చెప్పలేకపోతున్నాడు. ఎవరో చెయ్యి పట్టుకుని లాక్కుని వెళ్లి నట్లు సాత్విక్ చెబుతున్నాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. అయితే ఆదివారం బావిలో కనిపించిన మృతదేహం తాజాగా ఉండడంతో ‘హత్య’ అనుమానాలు బలపడుతున్నాయి. శుక్రవారమే చంపేసి బావిలో పడేసి ఉంటే శవం పాడైపోయి ఉండేదని, ఆదివారం వేకువజామునే బావిలో పడేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
‘ఇది హత్యే..?’
తన కుమారుడిది ముమ్మాటికీ హత్యేనని బాలుడి తల్లి పార్వతి ఆరోపిస్తున్నారు. రెండు రోజులు దాచి పెట్టి మూడో రోజు చంపేశారని అంటున్నారు. అదృశ్యమైన రోజే పోలీసులు అనుమానితులను అరెస్టు చేసి తనిఖీ చర్యలు చేపట్టి ఉంటే భయపడైనా తన కుమారుడిని విడిచిపెట్టేవారని ఆమె చెబుతున్నారు. బాలుడు అదృశ్యమైన సంగతి పోలీసులకు చెప్పగా గ్రామానికి వచ్చి పరిశీలించి వెళ్లిపోయారని, ఇంకాస్త లోతుగా చర్యలు చేపట్టి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదని అన్నారు. తన కొడుకు తనకు కావాలని ఆమె రోదిస్తూ ఉంటే ఆపడం ఎవరి తరం కాలేదు. కాశీబుగ్గ సీఐ కె.అశోక్‌కుమార్ మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీయించారు. పోస్టుమార్టం జరిపి వైద్యులు ఇచ్చిన సమాచారం మేరకు మృతికి గల కారణాలు వెల్లడిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment