అహ్మదాబాద్ : విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా (65) అదృశ్యం అయ్యారన్న వార్త ఒక్కసారిగా కలకలం రేపింది. సోమవారం ఉదయం నుంచి ఆయన కనిపించకుండా పోయే సరికి కార్యర్తలు ఆందోళన చేపట్టారు. ఆయన ఎక్కడున్నారో చెప్పాలంటూ అహ్మదాబాద్‌లోని సోల పోలీస్ స్టేషన్ ఎదుట వీహెచ్‌పీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
తొగాడియాపై ఉన్న ఓ పాత కేసు విషయంలో రాజస్థాన్ పోలీసులు తమను సంప్రదించారని, అయితే ఆయన నివాసంలో కనిపించకపోవడంతో వారు వెనుదిరిగారని సోల పోలీసులు వివరించారు. దీంతో తొగాడియా ఎక్కడున్నారో తెలియక కార్యకర్తలు ఆందోళన చెందారు. ఆయనను పోలీసులే అదుపులోకి తీసుకుని ఉంటారని భావించిన కార్యకర్తలు ఆయన ఆచూకీ చెప్పాలంటూ పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. ఈ క్రమంలో సర్కెజ్-గాంధీనగర్ హైవేను దిగ్బంధం చేశారు. కానీ, పోలీసులు మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చారు.
అయితే చివరికి తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన అహ్మదాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో ప్రత్యక్షమవడంతో వీహెచ్‌పీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఓ పార్క్‌లో గ్లూకోజ్ లెవల్స్ పడిపోయి స్పృహ కోల్పోయిన ఆయనను చంద్రామణి ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment