
అల్లవరం (అమలాపురం)/దెందులూరు/అగనంపూడి (గాజువాక): 30 ఏళ్ల మానసిక వికలాంగురాలిపై సొంత బాబాయి కుమారుడు, వరుసకు తమ్ముడైన 19 ఏళ్ల మానవ మృగం గత కొంతకాలంగా లైంగిక దాడి చేస్తూ గర్భవతిని చేశాడు. ఈ దారుణం తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం రెల్లుగడ్డ గ్రామ శివారు ఎలువుల్లంకలో చోటు చేసుకుంది. పరువు పోతుందనుకున్న తల్లిదండ్రులు పెద్దలను ఆశ్రయించగా బాధితురాలికి రూ.2 లక్షలు చెల్లించాలని చెప్పి న్యాయానికి సమాధి కట్టారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. గత కొన్ని రోజులుగా కుమార్తె శరీరంలో మార్పులు గమనించిన కుటుంబీకులు ఆమెను నిలదీయగా అతికష్టం మీద వరుసకు తమ్ముడైనవాడు ఈ పని చేశాడని చెప్పింది.
తన కుమార్తెకు న్యాయం చేయాలని బాధితురాలి తండ్రి అల్లవరం పోలీస్‌స్టేషన్‌లో మూడు రోజులు క్రితమే ఫిర్యాదు చేశాడు. అయితే ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని పెద్దలు ఓ రాజకీయ నాయకుడి నివాసంలో పంచాయతీ పెట్టారు. అత్యాచారం చేసిన మానవ మృగానికి ఇచ్చి ఆ బాధితురాలికి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. అందుకు తప్పు చేసిన యువకుడు కూడా ఒప్పుకున్నాడు. అంతలోనే వరుసకు అక్క.. అదీ ఒకే ఇంటి పేరుతో ఉన్నవారికి పెళ్లి ఎలా చేస్తారని, ఇలా అయితే ఇరు కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడతామని పెద్దల ఎదుట తెగేసి చెప్పడంతో పెళ్లి ఆలోచనకు స్వస్తి పలికారు. దీంతో చేసిన తప్పునకు రూ.2 లక్షలు వెలకట్టి వదిలేశారు. యువతి గర్భం దాల్చి ఏడు నెలలు మించిపోవడంతో ప్రసవం చేయించేందుకు కుటుంబీకులు సిద్ధమవుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగేళ్ల బధిర బాలికపై అత్యాచారం
అభంశుభం తెలియని నాలుగేళ్ల బధిర బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. దారుణమైన ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సోమవరప్పాడులో మంగళవారం సాయంత్రం జరిగింది. బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. ఈ చిన్నారి మాట్లాడలేదు. బాలిక తల్లిదండ్రులు బ్యాంకు పనిపై మంగళవారం గోపన్నపాలెం వెళ్లారు. వీరి ఇంట్లో ఒక గదిలో అద్దెకు ఉంటున్న బూరాడా రాంబాబు అనే వ్యక్తి చిన్నారిని సమీపంలోని పొలంలోకి తీసుకువెళ్లి అఘాయిత్యం చేశాడు.
ఇంటికి తిరిగి వచ్చిన చిన్నారి ఏడుస్తూ ఉండటం, రక్తస్రావం కావడం గమనించి స్థానికులు ప్రశ్నించగా జరిగిన అకృత్యాన్ని సైగల ద్వారా తెలియజేసింది. దీంతో గ్రామస్తులు రాంబాబును చితకబాది చిన్నారిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దెందులూరు ఏఎస్‌ఐ పి. కుమారస్వామి సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
విశాఖపట్నం జిల్లాలో బాలికపై లైంగికదాడి
విశాఖపట్నం జిల్లా దువ్వాడ పోలీస్‌స్టేషన్ పరిధిలో 16 ఏళ్ల అమ్మాయిపై ఇద్దరు పిల్లల గల వ్యక్తి అఘాయిత్యం చేసిన సంఘటనలో స్థానికులు నిందితున్ని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దువ్వాడ సీఐ కిషోర్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. 57వ వార్డు మంగళపాలెం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో నివాసముంటున్న ఓ మహిళ తన భర్త చనిపోవడంతో తన 16 ఏళ్ల కుమార్తెతో కలిసి నివాసముంటోంది. కాగా, మహిళ పింఛన్ తీసుకోవడానికి సోమవారం సీలేరు వెళ్లింది.
తనకు పరిచయం ఉన్న అగనంపూడి దిబ్బపాలేనికి చెందిన బలిరెడ్డి నాగేంద్రకుమార్‌కు ఫోన్ చేసి తన కుమార్తె ఒంటరిగా ఉందని, వెళ్లి చూసి రావాలని చెప్పడంతో అతడు రాత్రి 9 గంటల సమయంలో మహిళ ఇంటికి వెళ్లి బాలిక నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడు. బాలిక ఏడుస్తూ, కేకలు వేసుకుంటూ రోడ్డుమీదికి పరుగులు తీయడంతో స్థానికులు పారిపోతున్న నిందితున్ని పట్టుకొని దేహశుద్ధి చేసి, ఇంట్లో గదిలో బంధించి పోలీసులకు అప్పగించారు. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకొని ఫోక్సా చట్టం, అత్యాచార చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా, నాగేంద్రకుమార్ స్నేహితులమంటూ ఐదుగురు వ్యక్తులు కాలనీలోకి వచ్చి బెదిరించడంతోపాటు వీరంగం సృష్టించడంతో స్థానికులు చేరుకొనేసరికి పరుగులు తీశారు. పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.