ముంబై: ఎనిమిదేళ్ల క్రితం నాటి కేసులో ప్రత్యేక పోక్సో న్యాయస్థానం వృద్ధ దంపతులకు శిక్ష ఖరారు చేసింది. పదేళ్ల జైలుశిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. 50 వేల చొప్పున జరిమానా విధించింది. ఈ మేరకు.. పోక్సో కోర్టు న్యాయమూర్తి రేఖా పంఢారే గురువారం తీర్పునిచ్చారు. వివరాలు.. ముంబైలోని గిర్గాన్ ప్రాంతంలో నివసించే భార్యభర్తలు తమ అపార్టుమెంటులో నివసించే నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. సెప్టెంబరు 4, 2013న ఈ అమానుష ఘటనకు ఒడిగట్టారు. పక్కింట్లో ఉన్న తన స్నేహితురాలితో ఆడుకునేందుకు చిన్నారి బయటకు రాగా, ఆమెను తన ఇంట్లోకి తీసుకువెళ్లిన నిందితుడు(87) ఊయలలో కూర్చోబెట్టి కాసేపు ఆడించాడు. ఆ తర్వాత తన భార్య(80)ను పిలిచి, ఇద్దరూ కలిసి చిన్నారి దుస్తులు విప్పి వికృత చేష్టలకు పాల్పడ్డారు. చిన్నారి ఏడుస్తూ వారిని విడిపించుకునేందుకు ప్రయత్నించగా, చెంపలపై కొడుతూ అమానుషంగా ప్రవర్తించారు.
ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించారు. అయితే, రాత్రి నిద్రపోయే సమయంలో చిన్నారి వింతగా ప్రవర్తించడంతో ఆమె తల్లి పరీక్షించి చూడగా, చిన్నారి శరీర భాగాల్లో గాయాలు కనిపించాయి. దీంతో తన భర్తకు విషయం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయగా, అసలు విషయం బయటపడింది. దాదా, దాదీ అంటూ పిలిచే ఆ పసిపాపపై వృద్ధ జంటే అత్యాచారానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో వారిని అరెస్టు చేసిన పోలీసులు, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి తల్లితో పాటు మరికొంత మంది సాక్షులను విచారించిన అనంతరం న్యాయస్థానం గురువారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. బామ్మాతాతయ్యల్లా చిన్నారిని రక్షించాల్సిన వాళ్లే ఈ దురాగతానికి పాల్పడటం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment