
సురేష్
టీ.నగర్: చెన్నైలో రోడ్డుపై వెళ్లే మహిళలను కత్తితో బెదిరించి కారులో అత్యాచారాలు జరుపుతూ వచ్చిన కామాంధుడిని పోలీసులు ఎట్టకేలకూ మంగళవారం అరెస్టు చేశారు. వివరాలు.. చెన్నై, ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఒంటరిగా నడిచి వెళ్లే మహిళలను కిడ్నాప్ చేసి వారిపై అత్యాచారాలు జరుపుతున్నట్లు, అలాగే బంగారు నగలను కాజేస్తున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. పలువురు ఫిర్యాదు చేయడానికి సంశయించడంతో నిందితుడు స్వేచ్ఛగా తిరిగాడు. కానీ ఒక 35 ఏళ్ల మహిళ మాత్రం పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేసింది. దీంతో నీలాంగరై పోలీసు ఇన్‌స్పెక్టర్ నటరాజన్, మహిళా పోలీసులు సదరు మహిళ చెప్పిన విషయాలతో ఆశ్చర్యానికి గురయ్యారు. తనను కారులో తీసుకువెళ్లి నిర్మాణుష్య ప్రదేశంలో కారులోనే తనపై అత్యాచారం చేసినట్లు వెల్లడించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు రెండు వారాలకు పైగా దర్యాప్తు జరిపారు. మహిళ కారు నెంబరు నోట్ చేసుకుని పోలీసులకు అందజేయడంతో వారు ఆ కారును గుర్తించి డ్రైవర్‌ను మంగళవారం అరెస్టు చేశారు. అతని పేరు సురేష్‌గా తెలిసింది. కాల్‌టాక్సీ డ్రైవర్ అయిన ఇతను ఈస్ట్‌కోస్ట్ రోడ్డులోని అడయారు, తిరువాన్మియూరు, నీలాంగరై ప్రాంతాలలో అత్యాచారాలకు పాల్పడినట్లు తెలిసింది.
పోలీసులకు వాంగ్మూలం: వివాహిత స్త్రీలంటే తనకెంతో ఇష్టమని, అందుచేత రోడ్డులో ఒంటరిగా నడిచివెళ్లే మహిళలతో మాటామంతీ కలిపి వారిని కారులో ఎక్కించుకుని నిర్జన ప్రదేశానికి తీసుకువెళతానన్నాడు. తర్వాత కారులో ఏసీని పూర్తిగా ఆన్ చేస్తానని, ఆ సమయంలో ఆమె కేకలు వేస్తే చంపేస్తానని బెదిరిస్తానన్నాడు. తర్వాత కారు కిటికీలు పూర్తిగా మూసివేసి వారిపై అత్యాచారం జరుపుతానన్నాడు. గత ఏడాదిగా ఇలాగే 10 మంది మహిళలపై అత్యాచారం చేసినట్లు తెలిపాడు. అనంతరం వారి వద్ద నున్న నగలను దోచుకుంటానన్నాడు. బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో ఇంతవరకు తప్పించుకున్నట్లు తెలిపాడు. దీంతో కన్నగినగర్‌కు చెందిన సురేష్‌పై అత్యాచారం, దోపిడి, హత్యాబెదిరింపులు వంటి కేసులు నమోదు చేసి పుళల్ జైలులో నిర్బంధించారు. అతన్ని కస్టడీలో తీసుకుని విచారణ జరిపేందుకు నిర్ణయించారు. గత 2014లో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిపిన కేసు సురేష్‌పై ఉంది. అతనిపై ఫిర్యాదు చేసిన మహిళ రోడ్డు పక్క దుకాణం నడుపుతున్నారు. ఇలావుండగా పోలీసులు బాధిత మహిళలు ఫిర్యాదు చేయాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.