
రమాదేవి, ఇద్దరు కుమారుల మృతదేహాలు
బుక్కపట్నం: తల్లీకుమారుల అదృశ్యం విషాదాంతంగా ముగిసింది. అనుమానించినట్లుగానే తల్లీకుమారులు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరోజు తర్వాత మృతదేహాలు బయటపడ్డాయి. వివరాలిలా ఉన్నాయి. బుక్కపట్నంలోని ఎస్సీ కాలనీకి చెందిన రమాదేవి (28), పెనుకొండ మండలం శెట్టిపల్లికి చెందిన కృష్ణ దంపతులు. వీరికి బబ్లూ (6), జోసియో (4) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ కుటుంబం బెంగళూరుకు వలస వెళ్లి కూలి పనులు చేసుకుంటూ జీవించేది. ఇటీవల రమాదేవి పిల్లలిద్దరినీ తీసుకుని పుట్టింటికి వచ్చింది. సోమవారం ఉదయం ఏడు గంటలకు బెంగళూరుకు వెళ్లేందుకని ఇంటి నుంచి లగేజీ సర్దుకుని పిల్లలతో కలిసి బయల్దేరింది.
ఇంతలో బుక్కపట్నం చెరువు వద్ద వీరి లగేజీ బ్యాగు, పిల్లల దుస్తులు కనిపించడం, తల్లీకుమారులు అదృశ్యమవడం కలకలం రేపింది. ఎస్‌ఐ రాజేష్, సిబ్బంది చెరువు వద్దకెళ్లి వస్తువులను పరిశీలించి, ఆరా తీశారు. వారి కోసం గాలింపు చేపట్టారు. ఆత్మహత్య చేసుకుని ఉందేమోనన్న అనుమానాన్ని పలువురు వ్యక్తం చేశారు. మంగళవారం చెరువులో తల్లీ కుమారుల మృతదేహాలను గుర్తించారు. ఊరికని బయల్దేరిన కూతురు, మనవళ్లు మృత్యువాత పడ్డారని తెలుసుకున్న రమాదేవి తల్లి గంగమ్మ బోరున విలపించింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ రాజేష్ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment