తల్లీబిడ్డల మృతదేహాలు , రోదిస్తున్న బంధువులు
చిత్తూరు, శాంతిపురం: కర్ణాటక పరిధిలోని బుల్లంపల్లి వద్ద ప్రమాదవశాత్తు నీటిలో పడిన కొడుకును కాపాడే ప్రయత్నంలో బిడ్డతో సహా తల్లి మృతి చెందింది. కేజీఎఫ్‌లోని ఆండర్‌సన్‌పేట్ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ హరీష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శాంతిపురానికి చెందిన ఎమ్మార్పీఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు దేవరాజులు మాదిగ బుల్లంపల్లికి చెందిన శోభ(28)ని పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి 6, 8 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు, నాలుగేళ్ల కొడుకు ఉన్నారు.
శోభ మంగళవారం పిల్లలతో పుట్టింటికి వచ్చింది. బుధవారం మద్యాహ్నం ఇంటి బయట ఆడుకొంటున్న కొడుకు రఘు(4) కనిపించక పోవడంతో వెతుకుతూ వెళ్లింది. గ్రా మ సమీపంలోని ఇంకుడు గుంతలోపడి ఉన్న కొడుకును చూసి కాపాడే ప్రయత్నంలో తానూ నీటిలోకి పడిపోయింది. దీంతో తల్లి, బిడ్డలు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. తల్లీబిడ్డలు ఎంతకూ రాకపోవటంతో వెతికిన కుటుంబ సభ్యులు ఇంకుడు గుంతలో మృతదేహాలను గమనించి బయటకు తీశారు. గంట క్రితం వరకూ ఆడుతూ కనిపించిన పిల్లాడు, అందరితో మంచి గా ఉండే శోభ ఒక్కసారిగా శవాలుగా మారటంతో బాధిత కుటుంబం ఆక్రందనలు చూపరులను కంటతడి పెట్టించాయి. మృతదేహాలను కేజీఎఫ్ సివిల్ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment