ఉరికొయ్యకు వేలాడుతున్న అక్కాచెల్లెళ్లు మేఘన(6), యశస్విని(4), (ఇన్‌సెట్లో) తల్లి కల్పన(25)
సమాజమా.. ఏమి సమాధానం చెప్తావు! ఉరికొయ్యకు వేలాడుతున్న చిన్నారుల ఆత్మను ఎలా శాంతపరుస్తావు.. ఆ..వేదనకు ఎవరు కారణమంటావు.. అత్తగా మారిన తల్లికిఆడపిల్ల గిట్టదెందుకు..
అమ్మ కడుపునపుట్టిన కొడుక్కి బిడ్డ నచ్చదెందుకు..తనలో ఉన్నదీ అమ్మ రక్తమేననిగ్రహించరెందుకు..ఆమె చేతుల్లో ఏమీ లేదని తెలిసినా..ఈ వేధింపులెందుకు..నవమాసాలు మోసీ.. తండ్రిని చేసీ.. మగాడిగా నిలబెట్టినందుకాఈ ఛీత్కారం?రెక్కలొచ్చి కొడుకులెగిరిపోతే.. కాటికిపోయే దాకా కన్నీరు కార్చేది కూతురే కదా!అలసిన మనసుకు ఊరటఆమె నవ్వులు కాదా?అమ్మ కావాలి.. అక్కాచెల్లి కావాలి..
భార్య కావాలి..మరి కూతురెందుకు వద్దు..రాజ్యాలేలినా.. అంతరిక్షంలోకాలుమోపినా ఆడ..పిల్లగానే చూస్తారెందుకు!ఎందుకిలా.. ఎన్నాళ్లిలా?
ఆడపిల్లలు నట్టింట్లో తిరుగాడుతుంటే దేవతలు సంచరిస్తున్నంత కళ. అలాంటి చిట్టితల్లులు కళ్లెదుట కనపడుతుంటే ఓర్వలేకపోయాడో కసాయి తండ్రి. ఆడపిల్లలను కన్నతల్లిలా చూసుకోవాల్సిందిపోయి అనుక్షణం ఇల్లాలిని మగపిల్లలు లేరంటూ వేధిస్తుండటంతో ఆ తల్లి నరకయాతన అనుభవించసాగింది. అవమానాలు దిగమింగుతూ బతుకీడ్చేకంటే దేవుడి దగ్గరకు వెళ్లిపోవడమే శరణ్యమని ఇద్దరు చిన్నారులకు ఉరితాడు బిగించి తానూ ఉరేసుకుంది.
హిందూపురం అర్బన్: భర్త వేధింపులు తాళలేక ఇద్దరు పిల్లలకు ఉరివేసి అనంతరం తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అనంతపురం జిల్లా నాయనపల్లిలో మంగళవారం జరిగింది. మృతురాలి తల్లిదండ్రులు, ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపిన వివరాలివీ.. సోమందేపల్లి మండలం తుంగోడుకు చెందిన రత్నమ్మ, శివాచారి దంపతుల కుమారై కల్పనకు లేపాక్షి మండలంలోని నాయనపల్లికి చెందిన వీరభద్రాచారితో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మేఘన (6), యశస్విని (4) సంతానం. దంపతులిద్దరూ హిందూపురంలోని గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం భర్త విధులకు వెళ్లిన సమయంలో కల్పన (25) తన ఇద్దరు కుమార్తెలకు ఇంట్లోనే ఉరిపోసి తానూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సర్పంచ్ సదాశివరెడ్డి ఇనుప సమ్మెట అవసరమై కల్పన ఇంటి తలుపు తట్టగా ఎవరూ స్పందించ లేదు. అనుమానం వచ్చి కిటికీలో చూడగా పిల్లలతో పాటు తల్లి ఉరేసుకుని ఉండటాన్ని చూసి వీరభద్రాచారికి విషయం తెలిపాడు. ఇంటికి చేరుకున్న ఆయన తలుపులు తీసి పోలీసులకు సమాచారమిచ్చాడు.
ఆడపిల్లలు పుట్టారని తరచూ వేధింపులు..
ఆడపిల్లలు పుట్టారనే విషయమై దంపతులు మధ్య తరచుగా గొడవ జరుగుతుండేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మూడురోజుల క్రితం కూడా ఇదే విషయమై భార్యాభర్తలు ఘర్షణ పడినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా కల్పన ఫ్యాక్టరీకి వెళ్లకుండా ఇంట్లోనే పిల్లలతో ఉంటోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కల్పన క్షణికావేశంలో ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, అల్లుడే ఈ ఘోరానికి పాల్పడి ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వీరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment