పోలీసుల అదుపులో సుహాసిని, మృతి చెందిన చిన్నారి
మైలవరం (వైఎస్సార్ కడప): రెండో కాన్పులోనూ ఆడబిడ్డ పుట్టడంతో ఆ తల్లికి అత్తింటి వేధింపులు తీవ్రమయ్యాయి. దీంతో నాలుగు నెలల పసిబిడ్డను కాలువలో పడేసింది. తర్వాత తానూ ఆత్మహత్యకు యత్నించింది. స్థానికులు అడ్డుకోగా.. కడుపు కోతతో ఘొల్లుమంటోంది.. వైఎస్సార్ జిల్లా మైలవరం మండలం గొల్లపల్లె సమీపంలో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా సంజామల మండలం పేరుసోమలకు చెందిన సుహాసినికి బనగానపల్లె మండలం పాతపాడుకు చెందిన నాగేంద్రతో ఏడేళ్ల కిందట వివాహమైంది. ఆ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు.
పెద్ద పాప కీర్తనకు 5 సంవత్సరాలు .. చిన్నపాప జ్యోత్స్నకు 4 నెలలు. పెద్దపాప పుట్టినప్పుడే సుహాసినికి అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. ఆదిలోనే ఆడపిల్ల పుట్టిందంటూ చీదరింపులు ఎదురయ్యాయి. రెండోసారి కూడా ఆడపిల్ల పుడితే సుహాసినిని వదిలించుకోవాలనే నిర్ణయానికి అత్తింటి వారు వచ్చినట్లు తెలిసింది. రెండో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టగా.. అత్తింటి వేధింపులు తాళలేక ఇద్దరు కుమార్తెలతో పుట్టింటికి చేరుకుంది. బిడ్డలలో ఒకరిని వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. మంగళవారం సాయంత్రం ఇద్దరు బిడ్డలతో మైలవరం మండలం గొల్లపల్లె చేరుకుంది. సమీపాన ఉన్న రాళ్లవంక వద్దకు వెళ్లి నీటి ప్రవాహంలో చిన్నకుమార్తె జ్యోత్స ్నను పడేసింది. కళ్లముందే కన్న కూతురు ఊపిరాడక ప్రాణాలు కోల్పోవడం చూసి తల్లడిల్లిపోయింది. పెద్దకూతురితో కలసి తానూ అదే కాలువలో దూకబోతుండగా.. పొలాల్లో ఉన్నవారు పరుగున వచ్చి అడ్డగించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం సుహాసిని పోలీసుల అదుపులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment