కొడుకు ప్రేమ్‌కుమార్ చేతిలో బలైన తల్లి జ్యోతి
చిన్నాన్నతో వివాహేతర సంబంధానికి స్వస్తి పలకాలని కోరినా తల్లి తన తీరు మార్చుకోలేదని ఓ కుమారుడు ఆగ్రహించాడు. పైగా, తానే వివాహేతర సంబంధం కోసం యత్నిస్తున్నానంటూ సాక్షాత్తు కన్న తల్లే తనపై నిందలు మోపడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. చిన్నాన్నతో తల్లి కలిసి ఉండటం చూసి రగిలిపోయాడు. వారిద్దరిపై కత్తితో దాడి చేశాడు. గొంతు కోసి తల్లిని హతమార్చాడు. కత్తిపోట్లకు గురైన అతడి చిన్నాన్న గ్రామస్తుల సాయంతో తప్పించుకున్నాడు.
సాక్షి, గుడిపాల : మండలంలోని రెట్టగుంట దళితవాడకు చెందిన జ్యోతి(43)కి ఇదే గ్రామంలోని డేవిడ్‌రాజా(48) 25 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిరికి కుమార్తె సౌందర్య(24), ప్రేమ్‌కుమార్(22) సంతానం. పదేళ్ల క్రితం డేవిడ్ అనారోగ్యం బారిన పడి కొంత మతిస్థిమితం కోల్పోయాడు. ఈ నేపథ్యంలో అవివాహితుడైన డేవిడ్ సోదరుడు సుందర్‌రాజ్‌తో జ్యోతి కొన్నేళ్ల క్రితం వివాహేతర సంబంధం పెట్టుకుంది. సుందర్‌రాజ్ చిత్తూరులోని జెడ్పీ ఆఫీసులో పనిచేస్తున్నాడు. తన తల్లి, చిన్నాన్నకు వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరునెలల క్రితం ప్రేమ్‌కుమార్ తెలుసుకోవడంతో తల్లిని మందలించాడు. తీరు మార్చుకోవాలని హితవు పలికాడు. అయినా ఆమె ప్రవర్తన మారకపోవడంతో ప్రేమ్‌కుమార్ గొడవ పడేవాడు. దీనిపై కోపం పెంచుకున్న జ్యోతి కొడుకుపై నిందలు మోపింది. తన కొడుకే తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని పిలుస్తున్నాడంటూ ఇరుగు పొరుగు వారికి చెప్పసాగింది. ఇది ప్రేమ్‌కుమార్ చెవిన పడడంతో అతడు జీర్ణించుకోలేకపోయాడు. గురువారం రాత్రి మద్యం సేవించి ఇంటిలో తన తల్లి జ్యోతితో గొడవకు దిగాడు. తనపైనే దారుణమైన నిందలు మోపుతావా? అని ఆమె నిలదీశాడు.
దీంతో ఆమె రాత్రి 11.30 గంటలకు గుడిపాల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు తన కుమారుడు మద్యం తాగి కొట్టడానికి వస్తున్నాడని చెప్పింది. పోలీసులు ఆ సమయంలో వారింటికి వెళ్లి ప్రేమ్‌కుమార్‌కు నచ్చజెప్పారు. పోలీసులు వెళ్లిన వెంటనే ఇంటిలో ఉన్న బట్టలను సర్దుకుని ప్రేమ్‌కుమార్ ఇంటి నుంచి బయటకి వచ్చేశాడు. ఆ తర్వాత శుక్రవారం తెల్లవారుజామున 2గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో తన చిన్నాన్న సుందర్‌రాజ్, తల్లి జ్యోతి ఇద్దరూ కలిసి ఉండటం చూసి ఆవేశంతో రగిలిపోయాడు. వారిపై కత్తితో దాడి చేశాడు. గొంతుకోసి తల్లిని హతమార్చాడు. ప్రేమ్‌కుమార్ దాడిలో కత్తిపోట్లకు గురైన సుందర్‌రాజ్ చావు కేకలు పెట్టాడు. అతడి అరుపులకు చుట్టుపక్కల వారందరూ అక్కడికి చేరుకున్నారు. వారి సాయంతో అతను తప్పించుకున్నాడు.
తల్లిని కడతేర్చిన ప్రేమ్‌కుమార్ గుడిపాల పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. స్థానికంగా ఇది కలకలం సృష్టిం చింది. సంఘటన స్థలాన్ని సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డి, గుడిపాల ఎస్‌ఐ షేక్‌షావలి పరిశీలించారు. కత్తిపోట్లకు గురైన సుందర్‌రాజ్‌ను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి నిమిత్తం తరలించారు. చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం జ్యోతి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇదే రోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. తల్లి పేరును కూడా ఉచ్ఛరించడానికి ఇష్టపడని ప్రేమ్‌కుమార్ ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేయలేదని పోలీసులు చెప్పారు. గుడిపాల ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment