సాక్షి, న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాలను మంచి అవసరాలకు వినియోగించాలని కానీ ఇతరుల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉద్దేశపూర్వక పోస్టులు చేయడం చట్ట రీత్యా నేరమని నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడిని అరెస్ట్ చేశారని చెప్పారు. వారు చేసిన తప్పులకు పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పేందుకే తాను కేసు పెట్టానని వెల్లడించారు. తనను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎంపీ ప్రసంగాన్ని వక్రీకరించిన వ్యక్తి అరెస్ట్
భీమవరం టౌన్: పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు పార్లమెంట్‌లో జూన్ 28వ తేదీన చేసిన ప్రసంగాన్ని వక్రీకరించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి, షేర్ చేసిన కేసులో నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు టూటౌన్ సీఐ ఆర్.విజయకుమార్ తెలిపారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తాడేపల్లిగూడెంకు చెందిన నిందితుడు మద్దుకూరి సురేష్‌కుమార్‌ను అరెస్ట్ చేశామన్నారు. ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలను దుర్వినియోగపరిచి అనుచితంగా ప్రవర్తించే వారిపై కేసులు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment