సాక్షి, ముంబై: క్యాబ్ ప్రయాణంలో ఓ జర్నలిస్ట్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. తోటి ప్రయాణికురాలు బూతులు తిడుతూ భౌతిక దాడికి పాల్పడింది. ఈ ఘటన పోలీసులకు ఫిర్యాదు చేయగా, సదరు క్యాబ్ సంస్థ దర్యాప్తునకు సహకరించకపోవటంపై బాధితురాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు దాడి చేసిన ఘటనను వివరిస్తూ ఆమె సోషల్ మీడియాలో పోస్టులు ఉంచారు.
ముంబైకి చెందిన ఉష్నోటా జూన్ పౌల్ అనే జర్నలిస్ట్ ఉబెర్ పూల్ ప్రయాణం బుక్ చేసుకున్నారు. ఈ క్రమంలో క్యాబ్ ఉరిమి ఎస్టేట్ వద్దకు చేరుకోగానే క్యాబ్‌లో ఉన్న ఓ ప్రయాణికురాలు డ్రైవర్‌తో గొడవ పడింది. ‘తాను ఎక్కువ చెల్లించినప్పటికీ.. చివర్లో దించటమేంటని?’ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగింది. ఇంతలో ఉష్నోటా జోక్యం చేసుకుని డ్రైవర్‌కు మద్ధతుగా నిలిచారు. దీంతో సదరు మహిళకు చిర్రెత్తుకొచ్చింది. ఉష్నోటాపై పిడి గుద్దులు గుప్పిస్తూ.. పిచ్చి బూతులు తిడుతూ దాడికి పాల్పడింది. వెంటనే ఉష్నోటా ఫోటోలు తీసేందుకు యత్నించగా, సదరు మహిళ ఫోన్ లాక్కుని పగలగొడతానని బెదిరించింది. ఈ వ్యవహారాన్నంతా డ్రైవర్ మౌనంగా ఊస్తూ ఉండిపోయాడే తప్ప, అడ్డుకోడానికి యత్నించలేదని ఆరోపణ.
అంతలో స్థానికులు పెద్ద ఎత్తున్న గుమిగూడగా, అక్కడే ఉన్న ఓ సెక్యూరిటీ గార్డు ఉష్నోటాను రక్షించాడు. ఈ ఘటన తర్వాత దాడికి పాల్పడ్డ మహిళ అక్కడి నుంచి జారుకుంది. స్థానికుల సాయంతో ఉష్నోటా దగ్గర్లోని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో స్పందించేందుకు ఉబెర్ సంస్థ నిరాకరించటంతో అసంతృప్తి వెల్లగక్కుతూ ఉష్నోటా ఫేస్‌బుక్, ట్విటర్‌లో వరుస పోస్టులు చేశారు. గాయాలు, క్యాబ్‌లోపల ఆమె జట్టు పడి ఉన్న చిత్రాలను కూడా పోస్ట్ చేశారు. ఆమెకు మద్ధతుగా వందలాది రీ-పోస్టులు వెలియటంతో ఎట్టకేలకు ఉబెర్ యాజమాన్యం స్పందించింది. ‘ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఈ వ్యవహారంలో బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని, దర్యాప్తునకు తప్పకుండా సహకరిస్తామని’ ఉబెర్ సంస్థ ప్రతినిధి ఒకరు ఆమె పోస్టుపై స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment