గొర్రెల కాపరి యల్లప్ప మృతదేహాన్ని పరిశీలిస్తున్న దృశ్యం
అనంతపురం సెంట్రల్: గొర్రెల విక్రయంలో భేదాభిప్రాయాలు వచ్చి క్షణికావేశంలో కాపరిని వ్యాపారి హత్య చేశాడు. ఈ ఘటన అనంతపురం మార్కెట్‌యార్డులోని గొర్రెల సంతలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. త్రీటౌన్ సీఐ మురళీకృష్ణ, స్థానికులు తెలిపిన వివరాల మేరకు... బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని హైస్కూల్ కొట్టాలలో నివాసముంటున్న రాగే యల్లప్ప కుమారుడు యల్లప్ప (28) గొర్రెల పెంపకంతో జీవనం సాగించేవాడు. శనివారం పశువుల సంత కావడంతో గొర్రెలను విక్రయించేందుకు అనంతపురం మార్కెట్‌యార్డుకు వచ్చాడు. మొత్తం 22 జీవాలను విక్రయించేందుకు బేరం బెట్టాడు. బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం గ్రామానికి చెందిన గొర్రెల వ్యాపారులు మందలోని రెండు గొర్రెలను అడగ్గా.. రూ. 12,500 అని చెప్పాడు. దీంతో రోటరీపురానికి చెందిన సూరప్ప రూ. 10వేలకు అడిగాడు. ‘అంత తక్కువ ధరకు ఎలా ఇస్తాం. దొంగతనం చేసి తెచ్చామనుకుంటున్నారా? అని యల్లప్ప కోపంగా మాట్లాడాడు. తన మామను ఇష్టానుసారం మాట్లాడుతావా అంటూ సూరప్ప బంధువు అయిన నార్పల మండలం కేశేపల్లికి చెందిన వెంకటరమణ గొడవకు దిగాడు. మాటామాటా పెరిగి తోసుకున్నారు. ఇంతలో అక్కడున్న వారంతా సర్దిచెప్పి వారిని విడిపించారు.
యార్డులో కలకలం
గొడవ జరిగిన గంట సేపటికి యల్లప్ప దగ్గర్లో ఉన్న హోటల్‌లో నీళ్లు తాగేందుకు వెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న వెంకటరమణ మళ్లీ గొడవకు దిగాడు. చేతిలో కత్తి (గొర్రెలకు మార్కింగ్ వేసేందుకు ఉపయోగించే కత్తి) తీసుకొని పొడిచాడు. గుండె కిందిభాగంలో పొడవడంతో యల్లప్ప ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అనూహ్యంగా జరిగిన ఈఘటనతో మార్కెట్‌యార్డులో కలకలం రేగింది. వెంటనే స్థానికులు అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే యల్లప్ప మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. యల్లప్పకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉదయం సంతకు వెళ్లిన వ్యక్తి తిరిగిరానిలోకాలకు వెళతాడని ఊహించని ఆ కుటుంబసభ్యులు బోరున విలపించారు. త్రీటౌన్‌పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment