వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ ఏఆర్.శ్రీనివాస్
బంజారాహిల్స్:కిరాయి హంతకులతో సొంత బాబాయ్‌ను అంతమొందించేందుకు యత్నించిన ఘటనలో ప్రధాన నిందితురాలితో పాటు మరో నలుగురిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్. శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు, బంజారాహిల్స్ ఏసీపీ కే.ఎస్‌రావు వివరాలు వెల్లడించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 72లోని ప్రశాసన్‌నగర్‌కు చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి పొన్నెకంటి దయాచారి తన అన్న ప్రేమాచారి కూతురు మంజులతో కలిసి కొన్నిచోట్ల స్థలాలు కొనుగోలు చేయడమే కాకుండా గుంటూరులో రూ.15 కోట్ల వ్యయంతో ఓ ఆస్పత్రిని కూడా నిర్మించారు. 2009లో గుంటూరులో రూ. 30 కోట్ల విలువ చేసే ఓ ప్లాట్‌ను ఇద్దరి భాగస్వామ్యంతో కొనుగోలు చేశారు. ఘట్‌కేసర్‌లో ఇద్దరూ కలిసి 25 ఎకరాల స్థలం కొనుగోలు చేయగా ఆ స్థలాన్ని దయాచారి తన అత్త పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు.
ఆమె చనిపోయిన తర్వాత మంజులకు తెలియకుండా తన పేరున బదలాయించుకున్నాడు. సింగపూర్‌లో వ్యాపార నిమిత్తం మంజుల తల్లి నుంచి రూ. 60 లక్షల వరకు తీసుకున్నాడు. అయితే తీసుకున్న డబ్బులు ఇవ్వకపోగా భాగస్వామ్యంలో పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా చేశాడు. దీనిపై మంజుల ఎన్నిసార్లు అడిగినా ససేమీరా అన్నాడు. వారం క్రితం మంజుల తన కుమారుడు, అన్న కొడుకుతో కలిసి దయాచారి ఇంటికి వెళ్లి ప్రాధేయపడగా, ఇంట్లోకి కూడా రానివ్వలేదు. దీంతో విసుగు చెందిన మంజుల బాబాయ్ అడ్డు తొలగించుకుంటేనే భాగస్వామ్యంలో ఉన్న ఆస్తులు తనకు దక్కుతాయని పథకం వేసింది. ఈ నేపథ్యంలో తన వ్యాపార భాగస్వామి వెంకటేశ్వరరావుకు విషయం చెప్పడంతో ఆయన విజయవాడకు చెందిన నరేష్‌కు ఈ బాధ్యత అప్పగించాడు.
నరేష్ తనకు తెలిసిన నలుగురు కిరాయి హంతకులు ఉన్నారని వారు బెదిరిస్తారని చెప్పడంతో రూ.15 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చింది. ఈ నెల 3న కిరాయి హంతకులు అశోక్, సాగర్, అయ్యప్ప, రాజేష్, కొండాపూర్‌లో బసచేసి ఈ నెల 4న ఉదయం వాకింగ్ చేస్తున్న దయాచారిని తమతో పాటు తెచ్చుకున్న క్రికెట్ వికెట్‌తో తలపై బలంగా మోదడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అదే రోజు జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. జూబ్లీహిల్స్ సీఐ చంద్రశేఖర్, డీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ నరేష్ ఆధ్వర్యంలో నలుగురి నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వివరాల ఆధారంగా మంజుల, ఆమె సోదరుడు కరుణాకర్, నరేష్, అశోక్, సాగర్‌లను అరెస్ట్ చేశారు. వెంకటేశ్వరరావు, అయ్యప్ప, రాజేష్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment