కాపురంలో చిచ్చుపెట్టాడని.. | Murder Case Revelas Nagole Police in Hyderabad | Sakshi
Sakshi News home page

కాపురంలో చిచ్చుపెట్టాడని..

Published Tue, Dec 4 2018 8:50 AM | Last Updated on Tue, Dec 4 2018 8:50 AM

Murder Case Revelas Nagole Police in Hyderabad - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌

నాగోలు: తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న కోపంతో ఓ వ్యక్తిని మరో నలుగురితో కలిసి హత్య చేయించిన ఆమె భర్తతోపాటు ఇతర నిందితులను మీర్‌పేట పోలీస్‌లు, ఎస్‌ఓటీ పోలీస్‌లు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం ఎల్‌బీనగర్‌ సీపీ క్యాంప్‌ కార్యాలయంలో రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ వివరాలు వెల్లడించారు.. నాగర్‌కర్నూల్‌ జిల్లా, రాచర్లపల్లికి చెందిన జి.శ్రీధర్‌ రెడ్డి, అదే ప్రాంతానికి  చెందిన అశ్వినికి 2009 లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. వారి చదువుల నిమిత్తం 2014లో కల్వకుర్తికి మకాం మార్చారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి తిమ్మరాసిపల్లి గ్రామానికి చెందిన జి.శ్రీనివాస్‌గౌడ్‌ వారి ఇంటి సమీపంలోనే ఉండేవాడు. అశ్వినితో అతడికి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.ఈ విషయం తెలియడంతో శ్రీధర్‌రెడ్డి మరో చోటికి మకాం మార్చాడు. అయినా భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవటంతో తిగి సొంతూరికి వెళ్లిపోయాడు.

అయినా శ్రీధర్‌ రెడ్డి లేని సమయంలో శ్రీనివాస్‌ గౌడ్‌ తరచూ వారి ఇంటికి వచ్చి వెల్లడమేగాక అశ్వినితో దిగిన ఫొటోలు, అసభ్యకర మెసేజ్‌ లను శ్రీధర్‌ రెడ్డికి వాట్సాప్‌ ద్వారా పంపేవాడు. దీంతో శ్రీధర్‌ రెడ్డి రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీనివాస్‌ గౌడ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయమై అశ్విని భర్తతో గొడవపడి  సరూర్‌నగర్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో వేధింపుల కేసు పెట్టింది. దీంతో శ్రీధర్‌ రెడ్డి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. తన కుటుంబంలో చిచ్చురేపిన శ్రీనివాస్‌ గౌడ్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్న శ్రీధర్‌ రెడ్డి అందుకు పథకం పన్నాడు.

గతంలో వరి కోతల మెషిన్‌ నడిపే సమయంలో తన వద్ద పనిచేసిన ఘణపూర్‌ కు చెందిన శ్రీనివాస్, బోయపల్లి కి చెందిన రత్లావత్‌ లాల్‌నాయక్‌ తో రూ.3 లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా బీఎన్‌ రెడ్డి కాలనీ, టీచర్స్‌ కాలనీలోని శ్రీనివాస్‌ గౌడ్‌ ఇంటిపై అంతస్తులో శ్రీను, లాల్‌ నాయక్‌లను అద్దెకు ఉంచాడు. శ్రీనివాస్‌ గౌడ్, అశ్వినితో కలిసి ఉన్నప్పుడు ఇద్దరినీ హత్య చేయాలని పథకం పన్నారు. గత నెల 25న బైక్‌పై బయటికి వెళ్లిన శ్రీనివాస్‌ గౌడ్‌ను శ్రీనివాస్, లాలూ నాయక్‌ కారుతో ఢీకొట్టారు. అతను కిందపడటంతో కత్తులతో దారుణంగా హత్య చేసి పరారయ్యారు. పోలీసులు ఘటనా స్థలాన్ని  సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా నిందితులను గుర్తించారు. శ్రీనివాస్‌ గౌడ్‌పై పాత కేసుల వివరాలు ఆరా తీయగా శ్రీధర్‌ రెడ్డి విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో శ్రీధర్‌ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేయించినట్లు అంగీకరించాడు. నిందితులు శ్రీనివాస్, లాలూ నాయక్, వారికి సహకరించిన లక్ష్మణ్, శ్రీనివాస్‌ రెడ్డి, సూత్రధారి శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్‌ చేసిన పోలీసులు హత్యకు ఉపయోగించిన వేటకొడవళ్లు, కారును స్వాధీనం చేసుకుని  నిందితులను రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఎస్‌ఓటీ అడిషనల్‌ డీసీపీ, మీర్‌పేట పోలీసులు పాల్గొన్నారు. కేసును ఛేదించిన పోలీసులను సీపీ అభినందించారు.

భార్యతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని..: వ్యక్తి దారుణ హత్య ఇద్దరు నిందితుల అరెస్ట్‌
నాగోలు: భార్యతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తమ్ముడి సహాయంతో ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితులను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీపీ మహేష్‌ భగవత్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన ముత్తినేని నాగేశ్వరరరావు ఏడాది క్రితం నగరానికి వలసవచ్చి బీఎన్‌రెడ్డి ప్రాంతంలో మాతృశ్రీ గౌరీ శంకర్‌ మిల్క్‌ పాయింట్‌ నిర్వహిస్తున్నాడు. అందులో నాగేశ్వర్‌రావు భార్య ఉండేంది. వీరి దూరపు బంధువు ప్రసాద్‌రావు తరుచూ మిల్క్‌ పాయింట్‌కు వచ్చి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాడు. దీనిని గుర్తించిన నాగేశ్వర్‌రావు తన సమీప బంధువైన నాగులపాటి నాగేశ్వర్‌రావు దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఇద్దరూ కలిసి పథకం ప్రకారం గత నెల 28న మిల్క్‌పాయింట్‌కు వచ్చిన ప్రసాద్‌రావు మద్యం తాగించి గొంతు నులిపి హత్య చేయడమేగాక అతడి వద్ద ఉన్న గోల్డ్‌ రింగ్, చైన్, నగదు ఎత్తుకెళ్లారు. అర్థరాత్రి అటుగా వెళ్తున్న వ్యక్తులు దీనిని గమనించి వనస్థలిపురం పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందుతులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. వారి నుంచి బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ గాంధీనారాయణ, ఎస్‌ఓటీ సీఐ రవికుమార్, సీఐ వెంకటయ్య, ఎస్‌ఐలు సత్యనారాయణ, రాజు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement