సవతి కూతురును తాత వరసైన వ్యక్తికి ఎర.. | Pregnented Girl Suspicuis Death in Meerpet Hyderabad | Sakshi
Sakshi News home page

సవతి తల్లి ఘాతుకం!

Published Thu, May 9 2019 8:09 AM | Last Updated on Thu, May 9 2019 8:09 AM

Pregnented Girl Suspicuis Death in Meerpet Hyderabad - Sakshi

మృతురాలు బాలిక (ఫైల్‌) సవతి తల్లి దుర్గ

మీర్‌పేట: సవతి కూతురును తాత వరసైన తన మేనమామకు ఎరగా వేసింది. ఆరు నెలల పాటు ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడేలా చేసింది. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చడంతో నష్ట పరిహారం చెల్లించాలని పెద్దల సమక్షంలో జరిగింది. మేనమామ నుంచి పరిహారం వసూలు చేసి ఆ డబ్బులను కాజేసేందుకు పక్కా ప్లాన్‌ వేసింది. ఈ క్రమంలోనే బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బుధవారం మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణం ప్రియదర్శిని కాలనీకి చెందిన గోగుల మొగులయ్య, పున్నమ్మ దంపతులకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. మొగులయ్య ఉపాధి కోసం 18 ఏళ్ల క్రితం కుటుంబ సభ్యులతో నగరానికి వచ్చాడు. గ్రానైట్‌ రాళ్లు కొట్టే వృత్తితో మీర్‌పేట లెనిన్‌నగర్‌ ప్రాంతంలోని ప్రశాంత్‌నగర్‌లో నివసిస్తున్నాడు. ఆయన భార్య పున్నమ్మ ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో వరంగల్‌కు చెందిన దుర్గను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు మహేశ్వరి, విజయలక్ష్మి సంతానం. ఈ క్రమంలో భర్తను వదిలేసిన తన చెల్లెలు నాగమణిని, తన తల్లిని దుర్గ వరంగల్‌ నుంచి తీసుకొచ్చి  తన వద్ద ఆశ్రయం కల్పించింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన సిర్సు మల్లేష్‌ (34) దుర్గకు మేనమామ అవుతాడు. మల్లేష్‌ తరచూ ప్రశాంత్‌నగర్‌లోని దుర్గ నివాసానికి వస్తుండేవాడు.

మొగులయ్య మొదటి భార్య సంతానమైన ముగ్గురు కుమార్తెలను దుర్గ నిత్యం శారీరక, మానసిక హింసలకు గురిచేస్తుండేది. రెండేళ్ల క్రితం సవతి కూతురు లింగమ్మను స్థానికంగా ఉండే వ్యక్తితో వివాహం జరిపించారు. రెండో కూతురుకు అధిక ఖర్చుతో పెళ్లి చేయాల్సి వస్తుందేమోనన్న దుర్బుద్ధి పుట్టింది. దీంతో తరచూ ఇంటికి వచ్చే తాత వరస అయ్యే మల్లేష్‌తో ఆ బాలికను ఇంట్లో ఒంటరిగా వదిలి బయటకు వెళ్లేది. ఇదే అదనుగా భావించిన అతడు బాలికకు మాయమాటలు చెప్పి ఐస్‌క్రీంలో మత్తు మందు కలిపి అపస్మారక స్థితికి చేరిన తర్వాత ఆమెపై లైంగిక దాడికి పాల్పడేవాడు. దీంతో బాలిక గర్భవతి అయింది. విషయం తెలుసుకున్న తండ్రి మొగులయ్య మల్లేష్‌ను నిలదీశాడు. ఈ క్రమంలో మల్లేష్‌ ఈ విషయం బయటకు రాకుండా పది రోజుల క్రితం మిర్యాలగూడలోని తన నివాసంలో కుల పెద్దల సమక్షంలో గర్భస్రావం చేయించేందుకు నష్ట పరిహారం కింద రూ.1.50 లక్షలు మొగులయ్యకు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా నష్టపరిహారం తీసుకునేందుకు మంగళవారం ఉదయం మొగులయ్య, దుర్గ మిర్యాలగూడ వెళ్లి మొదటి దఫాగా ఇచ్చే రూ.50వేలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే చిన్న కూతురు లీల మొగులయ్యకు ఫోన్‌ చేసి అక్క ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని తండ్రికి ఫోన్‌ చేసి చెప్పింది.  

ఆత్మహత్యపై అనుమానాలు..
మల్లేష్‌ ఇచ్చే రూ.50 వేల కోసం మిర్యాలగూడకు వెళ్లిన మొగులయ్య, దుర్గ వాటిని తీసుకుని ఇంటికి వస్తున్నారు. మొగులయ్య లేనప్పుడు దుర్గ ప్రశాంత్‌నగర్‌లో ఉండే తన చెల్లెలు నాగమణికి ఫోన్‌ చేసి నష్టపరిహారం మొత్తం తామే తీసుకుందామని, బాలిక పెళ్లి ఖర్చు బాధ ఉండదు.. అబార్షన్‌ ఖర్చు ఉండదని, మేం ఇంటికి చేరేలోపే బాలికను కడతేర్చు అని చెప్పినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో నాగమణి ఇంటి తలుపులు మూసివేసి నిండు గర్భిణిగా ఉన్న బాలికను చున్నీతో ఉరి వేసి చంపిందని వారు చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దుర్గను, ఆమె చెల్లెలు నాగమణిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

పిన్ని నిత్యం నరకం చూపిస్తుండేది..
మారు తల్లి దుర్గ నిత్యం భౌతిక దాడులతో మానసిక చిత్రహింసలతో నరకం చూపిస్తుండేదని మొగులయ్య చిన్న కూతురు రోదిస్తూ తెలిపింది. ఎప్పుడూ డబ్బులు ఇవ్వని పిన్ని నాగమణి మాకు పైసలు ఇచ్చి ఇంటినుంచి బలవంతంగా బయటకు పంపించింది. నాకు అనుమానం వచ్చి ఇంటి పరిసరాల్లోనే దాక్కున్నా. ఇంట్లో నుంచి అక్క ఏడ్పులు వినిపించాయి. పిన్ని నాగమణి గట్టిగా అరుస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్న కేకలు వినిపించాయి. కొంత సేపటికి  నిశ్శబ్దమైంది. భయంవేసి పక్కింటి వాళ్లకు చెప్పాను. వారు వచ్చి చూసేసరికి మా అక్క నేలపై మోకాళ్లపై కూర్చొని ఉంది. అక్క చావుకు కారణమైన మారు తల్లి దుర్గ, ఆమె చెల్లెలు నాగమణిలను కఠినంగా శిక్షించాలని బాలిక ఏడుస్తూ చెప్పింది. 

దుర్గ చెల్లెలు నాగమణి ,సంఘటనా స్థలాన్నిపరిశీలిస్తున్న పోలీసులు

సీఐ వివరణ..
కాగా.. ప్రాథమిక నేర పరిశోధన మాత్రం బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నామని మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ సీఐ నర్సింగ్‌ యాదయ్య తెలిపారు. బాలికది హత్యా.. ఆత్మహత్యా అనేది పూర్తి స్థాయిలో విచారణ జరిగిన అనంతరమే నిర్ధారణ అవుతుందన్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నామని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement