
అహ్మదాబాద్ : గిరిజన బాలికతో ప్రేమ వ్యవహారం యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. బాలికను ప్రేమిస్తున్నాడనే ఆగ్రహంతో 17 ఏళ్ల ముస్లిం యువకుడిని దుండగులు కర్రలు, పైపులతో చితకబాదడంతో బాధితుడు మరణించిన ఘటన గుజరాత్‌లోని బరూచ్ జిల్లా జగదియా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ దాడిలో పది మంది యువకులు పాలుపంచుకోగా నలుగురు నిందితులను అరెస్ట్ చేశామని అంక్లేశ్వర్ డిప్యూటీ ఎస్పీ ఎల్‌ఏ ఝలా తెలిపారు .
బాధితుడు ఫయజ్ తండ్రి రహీం ఖురేషి ఘటన గురించి వివరిస్తూ తమ కుమారుడు ఫయజ్ తన స్నేహితులతో కలిసి అంక్లేశ్వర్ వెళ్లాడని, తమను బొరిద్ర ప్రాంతానికి వచ్చి తనను కలుసుకోవాలని కోరగా, తాను అక్కడికి వెళ్లేసరికి దుండగుల దాడిలో తీవ్ర గాయాలతో ఉన్నాడని చెప్పుకొచ్చారు. సమీప ఆస్పత్రికి తరలించినా తమ కుమారుడి ప్రాణాలు కాపాడుకోలేకపోయామని చెప్పారు. బొరిద్రలో గిరిజన బాలికతో ప్రేమ వ్యవహారం కారణంగానే ఫయజ్‌పై స్ధానికులు దాడికి తెగబడ్డారని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. తమ కుమారుడిని తీవ్రంగా కొట్టిన నిందితులందరిపై కఠిన చర్యలు చేపట్టాలని ఫయజ్ తల్లితండ్రులు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment