రాజశేఖర్‌రెడ్డి మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్సై రవీందర్
సాక్షి, లింగాలఘణపురం(వరంగల్) : అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలోని నాగారంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజశేఖర్‌రెడ్డి(30) సోమవారం తన సోదరుడైన దుంబాల భాస్కర్‌రెడ్డి వ్యవసాయ బావి వద్ద నాటు వేస్తుండగా అక్కడికి వెళ్లి సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి అనంతరం రాత్రి చీకటి పడే సమయంలో తన స్వంత వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి పనులు చూసుకొని ఇంటికి చేరుకున్నాడు.
తల్లిని భోజనం పెట్టాలని కోరగా ఇంకా వంట చేస్తున్నానని తాను సమాధానం చెప్పింది. ఈలోగా రాజశేఖర్‌రెడ్డి ఇంటి వెనుకాల నుంచే బయటకు వెళ్లాడు. రాత్రి ఇంటికి రాలేదు. ఉదయం అటు వైపుగా వెళ్తున్న గ్రామస్తులు రోడ్డుపై పడిపోయి ఉన్న రాజశేఖర్‌రెడ్డిని చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. దీంతో గ్రామస్తులు ఎస్సై రవీందర్‌కు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై మృతదేహాన్ని పరిశీలించి ముక్కులోంచి రక్తం, నోటినుంచి నురగలు వచ్చినట్లుగా గుర్తించారు.
పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినాడా.. లేదా ఏదైనా విష పురుగు కరిచి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై రవీందర్ తెలిపారు.
గ్రామంలో విషాదం
గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే యువకుడు రాజశేఖర్‌రెడ్డి మృతి చెందడంతో గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. రాజశేఖర్‌రెడ్డి తల్లి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో కొడుకు చనిపోయాడనే ధ్యాస కూడ లేకపోవడం, తండ్రి ఇంటి వద్ద ఉండకుండా హైదరాబాద్, జనగామల్లో హోటల్‌లో పని చేస్తుండడంతో కొడుకు చనిపోయిన విషయాన్ని తెలియజేసేందుకు అతడి కోసం వెతికారు. రాజశేఖర్‌రెడ్డి కుటుంబ పరిస్థితి ఇలా ఉండడంతో గ్రామస్తులంతా విచారం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment