బావి నుంచి శాంకుమార్ మృతదేహాన్ని వెలికితీస్తున్న సిబ్బంది
సాక్షి ప్రతినిధి, వరంగల్ : గీసుకొండ మండలం గొర్రెకుంటలోని పాడు పడిన బావిలో సమాధి అయిన వాస్తవాలను వెలికి తీసేందుకు పోలీసులు పరిశోధనలో నిమగ్నమయ్యారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహ్మద్ మక్సూద్ ఆలంతో పాటు భార్య, కుమార్తె, మనవడు గురువారం బావిలో తేలగా ఆయన ఇద్దరు కుమారులతో పాటు మరో ముగ్గురి మృతదేహాలు శుక్రవారం బయటపడ్డాయి. దీంతో తొమ్మిది మంది మరణంపై అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎవరైనా హత్య చేశారా? వారే ఆత్మహత్య చేసుకున్నారా? అన్న చిక్కుముడిని విప్పడం కోసం విచారిస్తున్నారు. వరంగల్ పోలీసులకు సవాల్‌గా మారిన ఈ అంతుచిక్కని మరణాలపై అడిషనల్ డీసీపీ వెంకటలక్ష్మి, ఇద్దరు ఏసీపీల సారథ్యంలో ఏడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ శుక్రవారం రాత్రి 11 గంటల వరకు ప్రత్యేక బృందాలు(సిట్), ఐటీ కోర్, ‘క్లూస్ టీంలతో సమావేశమయ్యారు.(చనిపోయారా.. చంపేశారా?)
నంబర్లు గుట్టు విప్పేనా..
బావిలో తేలిన తొమ్మిది మంది మృతి మిస్టరీ చేధించేందుకు పోలీసులు అన్ని దారుల్లో విచారణ తీవ్రతరం చేశా రు. ఈ కేసులో మహ్మద్ మక్సూద్ ఆలంకు సన్నిహితుడైన డ్రైవర్ షకీల్ అహ్మద్, మక్సూద్ కూతురు బుష్రా ఖాతూన్‌తో వివాహేతర సంబంధం ఉందని తెలుస్తున్న మిద్దెపాక యాకూబ్ కీలకంగా మారారు. అయితే ఈ ఘ టనలో షకీల్ మృతి చెందగా, ఆయన సెల్‌ఫోన్‌పై పోలీ సులు దృష్టి సారించారు. ఈనెల 20 రాత్రి 7.30 గంటలకు షకీల్ భార్య తాహెరా బేగంతో షకీల్ ఫోన్‌లో మాట్లాడాడు. ‘మక్సూద్ అన్న అర్జెంట్‌గా రమ్మంటే వ చ్చిన.. రాత్రి 10 గంటల వరకు వస్తాను’ అని చెప్పిన షకీ ల్ ఆ తర్వాత మరుసటి రోజు వరకు మాట్లాడలేదు. శుక్రవారం తేలిన ఐదు శవాల్లో షకీల్ కూడా శవమై తేలాడు. దీంతో ఆయన సెల్ నంబర్లు 62814 25573, 98754 34986 కాల్‌డేటా సేకరిస్తున్నట్లు తెలిసింది. అలాగే బు ష్రా ఖాతూన్ ప్రియుడిగా అనుమానం ఉన్న మిద్దెపాక యాకూబ్‌ను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఫోన్(99514 88705)ను స్వాధీనం చేసుకుని కాల్‌డేటా సేకరణలో నిమగ్నమయ్యారు. ఇక బీహా ర్‌కే చెందిన దర్భంగా జిల్లా కేవిట్ తాలూకా సిసోనా వాసి, ఇక్కడే పనిచేసే సంజయ్‌కుమార్ యాదవ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఫోన్(76448 36969) నుంచి మృతుల ఫోన్లకు పలుమార్లు ఫోన్ వచ్చాయని తేలడంతో ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసువర్గాల సమాచారం.(గీసుకొండ బావిలో 9 మృత దేహాలు)
వారి సెల్‌ఫోన్లు ఎక్కడ?
గొర్రెకుంట ఘటనలో మృతి చెందిన తొమ్మిది మందిలో ఏడుగురి సెల్‌ఫోన్ల ఆచూకీ దొరకలేదు. మృతుల వివరాలు వెల్లడించిన సందర్భంగా పోలీసులు ఫోన్ నంబర్లు ప్రకటించారు. అయితే మహ్మద్ మక్సూద్ ఆలం (99639 84070), ఆయన భార్య నిషా ఆలం(93470 15241), కూతురు బుషారా కాటూన్(93470 15241), కుమారులు షాబాజ్ ఆలం(62818 23765), సోహిల్ ఆలం(93983 41581), బీహార్‌కు చెందిన శ్రీరాంకుమార్‌షా(83078 96729), శ్యాంకుమార్‌షా(95289 07640) సెల్‌ఫోన్ల ఆచూకీ దొరకలేదు. మృతదేహాలను వెలికి తీసిన తర్వాత సెల్‌ఫోన్ల కోసం బావి నుంచి నీరంతా తోడినా ఫలితం కానరాలేదు. ఈనెల 20న రాత్రి 8గంటల వరకు షకీల్ ఫోన్ మాత్రమే పనిచేయగా, మిగతా వారి ఫోన్లు స్విచ్ఛాప్ అయినట్లు సమాచారం. మిస్టరీగా మారిన ఈ ఘటనలో సెల్‌ఫోన్లు కీలకం కాగా, ఆ దిశలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా మక్సూద్ కూతురు బుషారా కాటూన్ ఫోన్(93470 15241) కాల్‌డేటా సేకరణలో పోలీసులు నిమగ్నం కాగా, త్వరలోనే వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
నీట మునిగాకే తొమ్మిది మంది మృతి
ఎంజీఎంలో తొమ్మిది మృతదేహాలకు శుక్రవారం రాత్రి 9.30 గంటలకు పోస్టుమార్టం ముగిసింది. అందరూ సజీ వంగానే బావిలో మునిగినట్లు.. ఆ తర్వాత మృతి చెందారని ప్రాథమికంగా వైద్యనిపుణులు నిర్ధారించారు. అలాగే, మూడేళ్ల బాబు మినహా ఎనిమిది మంది శరీరా లపై బావిలో పడినప్పుడు గీరుకుపోయినట్లు గాయాలున్నట్లు వెల్లడించారు. ఇక మృతదేహాల నుంచి సేకరించిన శాంపిళ్ల(మిశ్రా)ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్)కి పంపించారు. ఆ నివేదిక వస్తే తప్ప విష ప్రయోగం జరిగిందా లేదా ఎవరైనా కొట్టి నెట్టేశారా లేదా వాళ్లే బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారా అనేది తేలనుంది. ఇదిలా ఉండగా మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయ్యాక వారి బంధువులకు సమాచారం ఇచ్చామని వరంగల్ తహసీల్దార్ ఇక్భాల్ తెలిపారు. షకీల్ భార్య, పిల్లలు వరంగల్‌లోనే ఉండగా, పశ్చిమబెంగాల్, బీహార్‌లోని మిగతా మృతుల బంధువులకు సమాచారం ఇచ్చామని చెప్పారు. తొమ్మిది మృతదేహాలకు వరంగల్‌లో అంత్యక్రియలు జరిపించనున్నట్లు ఇక్బాల్ వెల్లడించారు.
ప్రత్యేక బృందాలు
అనుమానాస్పదంగా మరణించిన తొమ్మిది మందికి సంబంధించి కేసు విచారణకు ప్రత్యేక పోలీస్ బందాలను ఏర్పాటు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ శుక్రవారం ప్రకటించారు. ఎలా మృతి చెందారనే విషయమై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కేసును పరిష్కరించడం కోసం అన్నికోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, ఇందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నట్లు సీపీ వెల్లడించారు.
ఒక్కటొక్కటిగా తేలిన మృతదేహాలు
సాక్షి, వరంగల్ రూరల్ / గీసుకొండ : బావిలో నుంచి ఒక్కో మృతదేహం పైకి తేలుతూ వచ్చింది... దీంతో అసలు ఎన్ని మృతదేహాలు ఉన్నాయనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట సమీపంలోని బావిలో గురువారం నాలుగు మృతదేహాలు బయట పడిన విష యం విదితమే.. వీరు ఎలా మృతి చెందారనే విషయంలో పోలీసులు విచారణ సాగిస్తుండగానే శుక్రవారం మళ్లీ ఐదుగురి మృతదేహాలు తేలడంతో కలకలం రేగింది.
పోలీసుల అదుపులో యాకూబ్
మక్సూద్ కూతురు బుష్రా ఖాతూన్‌కు దగ్గరి మిత్రుడైన మిద్దేపాక యాకుబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీమాబాద్‌లో ఉంటున్న సమయంలో బుష్రా ఖాతూన్‌తో ఆయనకు బాగా పరిచయం ఉండేదని సమాచారం. బుష్రా ఖాతున్ ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు విచారించగా ఎక్కువ ఫోన్లు యాకుబ్‌కు వెళ్లినట్లు గుర్తించినట్లు సమాచారం. దీంతో గురువారం రాత్రే యాకుబ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మక్సూద్ కుటుంబంతో ఇంకా ఎవరెవరికి పరిచయం ఉంది, బంధువులు ఎక్కడ ఉన్నారు.... ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా....అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈనెల 20వ తేదీ మధ్యాహ్నం సాయిదత్తా ట్రేడర్స్‌కు తాను వెళ్లిన సమయంలో అందరూ బాగానే కనిపించారని యాకూబ్ చెప్పాడని తెలిసింది.
ఈనెల 25న మళ్లీ కరీమాబాద్‌కు....
లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో ఇంతకాలం గొర్రెకుంటలో ఉంటున్న మక్సూద్ కుటుంబం తిరిగి పాత నివాసమైన కరీమాబాద్‌కు ఈనెల 25న వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం కరీమాబాద్‌లో అద్దెకు ఉంటున్న నివాస యజమానికి వచ్చి చెప్పడమే కాకుండా గదిని శుభ్రం చేశారని సమాచారం. మక్సూద్ కుమార్తె బుష్రా ఖాతున్ విషయంలో బీహార్ యువకులు శ్రీరాం, శ్యాంకు ఘర్షణ జరుగుతుండడంతో త్వరగా కరీమాబాద్‌కు మకాం మార్చాలని భావించినట్లు తెలుస్తోంది. ఇంతలోనే కుటుంబంలోని అందరూ మృతదేహాలుగా తేలారు.
బృందాలుగా వీడిపోయి విచారణ
పోలీసులు ఏడు బృందాలుగా విడిపోయి ఘటనపై విచారణ చేపడుతున్నారు. ఘటన జరిగిన సమీపంలో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో పరిశీలిస్తూ పుటేజీలు సేకరిస్తున్నారు. ట్రేడర్స్‌కు సమీపంలోనే కాకుండా కరీమాబాద్‌లో మక్సూద్ ఇంటి సమీపంలోని వారి నుంచి వివరాలు ఆరా తీస్తున్నారు. ఇక ఇద్దరు బీహార్ వలస కార్మికులు నివాసముండే గదులతో పాటు మక్సూద్ కుటుంబం నివాసం ఉండే గదుల్లో నిపుణులు వేలిముద్రలను సేకరించారు. అలాగే వండిన భోజనం, తినకుండా ప్లేట్లలో వదిలివేసిన అన్నం, ఆకుకూర పప్పు శాంపిల్స్ కూడా తీసుకున్నారు.
నీటిని తోడిన డీఆర్‌ఎఫ్
సాయిదత్తా ట్రేడర్స్‌కు పక్కనే ఉన్న పాత బావిలో నీరు మొత్తాన్ని మోటార్ల సహాయంతో గ్రేటర్ వరంగల్ డీఆర్‌ఎఫ్ సిబ్బంది బయటకు తోడారు. సుమారు 60ఫీట్ల లోతు ఉన్న బావి లో ఉన్న నీటిని మొత్తం తోడారు. ఏమైనా ఆధారాలు, సెల్ ఫోన్లు లభిస్తాయోమోనని పోలీసులు పరిశీలించారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీ
మృతదేహాలు తేలిన బావిని నగర పోలీస్ కమిషనర్ రవీందర్ పరిశీలించారు. ఈ మేరకు పోలీసు అధికారులతో ఆరా తీశారు. ఇంకా గ్రేటర్ వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్‌రావు, డీసీసీ, బీజేపీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, కొండేటి శ్రీధర్, ఆర్‌డీఓ మహేందర్‌జీతో పాటు నల్లెల్ల రాజయ్య, ల్యాదల్ల బాలు, సుంకరి శివ తదితరులు వివరాలు తెలుసుకోగా స్థానికులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment