గొర్రెకుంట మృతుల కేసులో కొత్త ట్విస్ట్..  | New twist to Geesukonda Migrants Case, Two Biharis picked up for questioning | Sakshi
Sakshi News home page

ఏడు మృతదేహాల్లో పాయిజన్‌ ఆనవాళ్లు! 

Published Sun, May 24 2020 10:42 AM | Last Updated on Sun, May 24 2020 11:19 AM

New twist to Geesukonda Migrants Case, Two Biharis picked up for questioning - Sakshi

సాక్షి, వరంగల్‌ : రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన తొమ్మిది మంది వలస కార్మికులది హత్యా.. ఆత్మహత్యా.. ఒకవేళ హత్యకు గురైతే చంపిందెవరు.. ఆత్మహత్యకు పాల్పడితే అందుకు కారణమేమిటి.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు, ఇద్దరు బీహార్‌ కార్మికులు, ఓ డ్రైవర్‌ సహా మొత్తం తొమ్మిది మంది మృతి వెనుక అసలు విషయమేమిటి... ఇలా అనేక సందేహాలకు ఇంకా సమాధానాలు దొరకలేదు. అయితే బావిలో నీరు ఊపిరితిత్తుల్లో చేరడం వల్లే వీరంతా మృతి చెందినట్లు ఫోరెన్సిక్‌ వైద్యులు తేల్చారు. ఏడు మృతదేహాల్లో పాయిజన్‌ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో విష ప్రయోగం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. (పోలీసుల అదుపులో యాకూబ్.. సెల్ఫోన్లు ఎక్కడ?)

కాగా వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలోని ఓ పాడుపడిన బావిలో తొమ్మిది మంది మృతి చెందిన దుర్ఘటనపై విచారణ ఇంకా కొలిక్కి రాని విషయం తెలిసిందే. పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించిన విధంగా సంచలనం కలిగించిన ఈ ఘటనపై ఏడు ప్రత్యేక పోలీసు దర్యాప్తు బృందాల(సిట్‌) పరిశోధన ఇంకా కొనసాగుతోంది. రాష్ట్రంలో సంచలనం కలిగించిన ఈ ఘటన వరంగల్‌ పోలీసులకు సవాల్‌గా మారగా, త్వరలోనే ఆ తొమ్మిది మంది కార్మికుల మృతిపై మిస్టరీ వీడనుందని అంటున్నారు. 

పోలీసుల అదుపులో కీలక వ్యక్తులు
అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు కొద్దిపాటి పురోగతి సాధించారు. ఇప్పటికే  మహ్మద్‌ మక్సూద్‌ ఆలం కూతురు బుష్రా ఖాటూన్‌ ప్రియుడు యాకూబ్‌తో పాటు బీహార్‌కు చెందిన కార్మికులు సంజయ్‌ కుమార్‌ యాదవ్, మంకుషా లను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వరంగల్‌కు చెందిన మరో ఇద్దరిని శనివారం పట్టుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. వరంగల్‌కు చెందిన ఆ ఇద్దరి వద్ద నుంచే మృతులలో ఇద్దరికి చెందిన సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఆ రెండు సెల్‌ఫోన్‌లు తొమ్మది మంది మృతి చెందిన బావి సమీపంలో దొరికినట్లు ఆ ఇద్దరు వెల్లడించినట్లు తెలిసింది. సెల్‌ఫోన్‌లు చేజిక్కించుకున్న పోలీసులు ఆ ఇద్దరిని కూడా విచారిస్తున్నట్లు సమాచారం.  (చనిపోయారా.. చంపేశారా?)

కాగా ఆ రెండు సెల్‌ఫోన్‌లలో ఒకటి మక్సూద్‌ ఆలంకు చెందినది కాగా, మరోటి ఆయన కూతురు బుష్రా ఖాతూన్‌గా ప్రచారం ఉంది. ఆ రెండు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్న ‘సిట్‌’, అవుట్‌ గోయింగ్, ఇన్‌కమింగ్‌ ఫోన్‌కాల్స్‌ వివరాలను పోలీసులు సేకరిస్తున్నట్లు తెలిసింది. బుధవారం రాత్రి 6 గంటల తరువాత  మక్సూద్‌ వీరితో ఫోన్‌లో మాట్లాడాడు. పోలీసులు బీహారీ యువకులను సంఘటనా స్థలానికి తీసుకువచ్చి మరోసారి విచారణ చేపట్టారు. దీంతో ఈ కేసులో మంకుషా వాంగ్మూలం కీలకంగా మారింది.

ఫోరెన్సిక్, నిఘావర్గాల ఆరా... 
గీసుకొండ మండలం గొర్రెకుంట సంఘటనపై ఫోరెన్సిక్, కేంద్ర, రాష్ట్ర ఇంటలిజెన్స్‌ వర్గాలు ఆరా తీశారు. తొమ్మిది మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన ఫోరెన్సిక్‌ నిపుణులు డాక్టర్‌ రజామాలిక్‌ బృందం, వారి మృతికి కారణమైన బావిని పరిశీలించింది. బార్‌దాన్‌ సంచుల గోదాము, ఆ గోదాం ఆవరణలో వారు నివాసం ఉండే క్వార్టర్లను కూడా వారు పరిశీలించారు. పాడు పడిన వ్యవసాయ బావిలో తొమ్మిది మంది మృతదేహాలు తేలిన ఘటనపై నివేదిక పంపేందుకు కేంద్ర, రాష్ట్ర నిఘావర్గాల అధికారులు సైతం సందర్శించారు. (గొర్రెకుంట: ప్రాణాలతో వుండగానే బావిలో...)

సెంట్రల్‌ ఇంటలిజెన్స్‌ ఎస్పీ, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వ రీజనల్‌ ఇంటలిజెన్స్‌ అధికారులు వేర్వేరుగా పరిశీలించి వివరాలపై ఆరా తీశారు. ఇదిలా వుండగా ఈ ఘటనపై కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకుని రెండు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్న ‘సిట్‌’ పోలీసులు విచారణ జరుపుతున్నారు. అందులో ఇద్దరినీ శనివారం ఉదయం గొర్రెకుంటలోని 9 మంది మృతి చెందిన బావి వద్దకు తీసుకు వచ్చి పలు కోణాల్లో పరిశోధన జరిపారు. సంజయ్‌కుమార్‌ యాదవ్, మంకుషాలను సంఘటన వద్దకు తీసుకు వచ్చిన పోలీసులు ‘సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌’  తరహాలో ఆరా తీశారు. కాగా పోలీసుల ఇన్‌వెస్టిగేషన్‌కు సెల్‌ఫోన్‌ సంభాషణలు, కాల్‌డేటా కీలకంగా మారాయి. ఫోన్‌ కాల్స్‌ వివరాలు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో  మహ్మద్‌ మక్సూద్‌ తనయ బుష్రా ఖాతూన్, ఆమెతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తోన్న యాకూబ్‌ ఫోన్‌ కాల్స్‌తోపాటు ఇతరులతో మక్సూద్‌ ఏం మాట్లాడనే విషయాలపై పోలీసులు ఫోకస్‌ పెట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement