పోలీసుల ఎదుట లొంగిపోయిన ఆముదాల మహేందర్ రెడ్డి (ఫైల్) చలసాని వెంకటేశ్వరరావు అలియాస్ పండు
సాక్షి, సిటీబ్యూరో: ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుడు చలసాని వెంకటేశ్వరరావు అలియాస్ పండు హత్య కేసులో విచారణ పూర్తయింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆముదాల మహేందర్‌రెడ్డి అలియాస్ మహిపాల్‌రెడ్డిని దోషిగా నిర్ధారించిన నాంపల్లిలోని మొదటి అదనపు చీఫ్ మెట్రోలిపాటన్ సెషన్స్ జడ్జి సునీత కుంచాల మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.ప్రతాప్‌రెడ్డి వాదనలు వినిపించారు. హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పండును హత్య చేసి పారిపోయిన మహేందర్ గుల్బర్గా వెళ్లి అప్పటి ఎస్పీ ఎదుట లొంగిపోయాడు. విశాఖపట్నంలో తెలుగుదేశం నాయకులు కంభంపాటి రామ్మోహన్‌రావు, గద్దె బాబూరావు, చలసాని పండు ఖరీదు చేసిన స్థలానికి మహేందర్ దళారిగా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో ఇతడికి రావాల్సిన కమీషన్‌ను వారు ఎగ్గొట్టడమే హత్యకు కారణంగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తెలంగాణలోని ములుగు జిల్లా, పస్రాకు (అప్పట్లో ఇది వరంగల్ జిల్లాలో ఉండేది) చెందిన మహేందర్‌రెడ్డి విజయవాడలో మహిపాల్‌రెడ్డి పేరుతో చెలామణి అయ్యాడు.
అక్కడ దేవినేని నెహ్రూ, చలసాని పండులకు ప్రధాన అనుచరుడిగా పని చేశాడు. దాదాపు దశాబ్ధన్నరకు పైగా పండు దగ్గరే ఉన్న మహేందర్ హైదరాబాద్‌కు మాకాం మార్చిన తరవాత రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించాడు. అయినా పండుతో సంబంధాలు కొనసాగిస్తూ కొన్ని స్థలాలకు సంబంధించిన వ్యవహారాలు చేపట్టాడు. ఈ నేపథ్యంలోనే నగరానికి చెందిన గుండేరావుతో కలిసి 2003 డిసెంబర్‌లో విశాఖపట్నంలోని మురళీనగర్‌లో ఉన్న బిర్లా సంస్థకు చెందిన 24 ఎకరాల స్థలాన్ని పండుకు ఇప్పించాడు. విజయవాడకు చెందిన టీడీపీ నేతలు కంభంపాటి రామ్మోహన్‌రావు, గద్దె బాబూరావులతో కలిసి చలసాని పండు ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు. అప్పట్లో ఆ ప్రాంతంలో ఎకరం రూ.కోటి పలుకుతుండగా... మహేందర్, గుండేరావు, బిర్లా సంస్థకు చెందిన ప్రతినిధులు కలిసి రూ.65 లక్షలకు ఖరారు చేశారు. నగదు చెల్లించిన ఈ త్రయం స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించి మహేందర్, గుండేరావులకు పండు కమీషన్ రూపంలో రూ.2.35 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఆ చెల్లింపు జరగలేదు. మహేందర్ తనకు రావాల్సిన కమీషన్‌ను ఇవ్వాల్సిందిగా పండును 2003 నుంచి 2010 వరకు అడుగుతూనే ఉన్నా అతను పట్టించుకోలేదు.
ఓ దశలో రియల్ ఎస్టేట్‌బూమ్
దెబ్బతినడంతో మహేందర్ ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డాడు. దీంతో పండు నుంచి రావాల్సిన డబ్బు కోసం ఆయనపై ఒత్తిడి చేశాడు. మహేందర్‌తో పాటు అతడి భార్య రూప సైతం పండు, అతడి భార్యలను డబ్బు విషయమై అనేకసార్లు ప్రాధేయపడింది. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో మహేందర్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. విజయవాడలో ఉండగా కొన్నేళ్ల పాటు పండుకు సన్నిహితంగా మెలిగిన మహేందర్‌రెడ్డి అతను హైదరాబాద్ వచ్చినప్పుడల్లా అన్నీ సమకూర్చేవాడు. చివరకు పండు గెస్ట్‌హౌస్‌గా వినియోగిస్తున్న మధురానగర్‌లోని అపార్ట్‌మెంట్ ఫ్లాట్ ఖర్చులను సైతం భరించేవాడు. కనీసం కొంతయినా ఇవ్వమని అనేకమార్లు పండును ప్రాధేయపడినా ఫలితం లేకుండా పోయింది.
2010 సెప్టెంబర్ మూడో వారంలో పండు విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చారు. ప్రతి రోజూ అతడి వద్దకు వచ్చి సపర్యలు చేస్తున్న మహేందర్ నగదు అడిగేందుకు అనువైన సమయం కోసం ఎదురుచూశాడు. సమయం చిక్కకపోవడంతో ఎలాగైనా నగదు విషయం మాట్లాడాలని నిర్ణయించుకున్న మహేందర్ 2010 సెప్టెంబర్ 26 రాత్రి మధురానగర్‌లోని పండు ఫ్లాట్‌కు వచ్చాడు. ఇద్దరూ కలిసి మద్యం సేవిస్తుండగా... తనకు రావాల్సిన మొత్తం కాకపోయినా... కనీసం కొంతయినా ఇవ్వాలని మహేందర్ కోరాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలోనే అదే రాత్రి 10.30 గంటల ప్రాంతంలో క్షణికావేశానికి లోనైన మహేందర్ అక్కడే ఉన్న వస్తువులతో పండును హత్య చేశాడు. గుల్బర్గా పారిపోయిన అతను 2010 సెప్టెంబర్ 28న అక్కడి ఎస్పీ ఎదుట లొంగిపోయాడు. ఈ కేసు దర్యాప్తు చేసిన ఎస్సార్‌నగర్ పోలీసు మహేందర్‌పై నాంపల్లి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరఫున వాదించిన ఏపీపీ కె.ప్రతాప్‌రెడ్డి వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం మహేందర్‌కు జీవితఖైదు, రూ.5 వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment