ప్రతీకాత్మకచిత్రం
న్యూఢిల్లీ : భార్య ఫోటోలను అభ్యంతరకరంగా మార్ఫింగ్ చేసి ఆన్‌లైన్ ఫోటో యాప్‌లో అప్‌లోడ్ చేసిన ఓ నేవీ కమాండర్‌పై పూణే పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో పనిచేస్తున్న తన భర్త పోర్నోగ్రఫీకి బానిసయ్యాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఖండ్వా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మహదేవ్ కుంభర్ తెలిపారు. భర్త అశ్లీల సైట్‌లకు అలవాటుపడి ఎంతకీ వాటిని వదిలేయకపోవడంతో తాను పిల్లలను తీసుకుని పుట్టింటికి వచ్చేశానని గతంలో సైనిక అధికారిగా పనిచేసిన బాధితురాలు వెల్లడించారు. తాను, కుటుంబ సభ్యులు పలుమార్లు చెప్పినా ఆయన మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విసిగిన మహిళ పూణేకు తిరిగివచ్చి ఇక్కడి ఫ్యామిలీ కోర్టులో గత నెలలో విడాకుల కేసును దాఖలు చేసినట్టు పోలీసు అధికారి మహదేవ్ వెల్లడించారు. ఆమె భర్త బాధితురాలి ఫోటోలను అప్‌లోడ్ చేయడంతో పాటు, తన కొలీగ్ భార్య, మరికొందరు ఇతర మహిళల అభ్యంతరకర ఫోటోలను ఆ యాప్‌లో అప్‌లోడ్ చేశాడని తెలిపారు.
ఈమెయిల్ ఖాతా ద్వారా నిందితుడు ఫోటో యాప్‌లో తన భార్య చిత్రాలను అప్‌లోడ్ చేశాడని వెల్లడించారు. నిందితుడికి తన కొలీగ్ భార్యతో వివాహేతర సంబంధం కూడా ఉందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారని చెప్పారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. కేసులో నిందితుడిని ప్రశ్నించేందుకు అనుమతి కోసం నేవీ అధికారులకు లేఖ రాస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment