న్యూఢిల్లీ: టెక్నాలజీ పెరిగింది.. సామాజిక మాధ్యమాలు అవగాహన కూడా కల్పిస్తున్నాయి.. అయినా చిన్నారుల అపహరణలు ఆగడంలేదు. పైగా మరింతగా పెరుగుతున్నాయి. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. కేంద్రం విడుదల చేసిన రిపోర్టు ప్రకారం.. 2016లో ఏకంగా 54,723 మంది చిన్నారులు కిడ్నాప్ అయ్యారు. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 30 శాతం అధికం. ఇంత భారీస్థాయిలో అపహరణలు జరిగినా.. దాఖలైన కేసులు(ఎఫ్‌ఐఆర్) కేవలం 40.4 శాతమే. ఈ కేసులకు సంబంధించి విచారణ ఎదుర్కొని, శిక్షపడిన కేసులు కేవలం 22.7 శాతమే. 2015లో 41,893 కేసులు నమోదు కాగా 2014లో 37,854
కేసులు నమోదయ్యాయి.
సోషల్ మీడియాతో గందరగోళం..: ‘చిన్నారుల కిడ్నాప్‌లకు సంబంధించి చాలా కేసులు తొందరపాటు, సమాచారం లేకపోవడం వల్లే నమోదయ్యాయి. ఇందుకు సామాజిక మాధ్యమాలే కారణం. పిల్లల్ని అపహరించుకుపోయేవారు తిరుగుతున్నారని, అవయవాల కోసం కిడ్నాప్ చేస్తున్నారంటూ రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. వీటిని వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో చూసిన తల్లిదండ్రులు.. తమ పిల్లలు ఇంటికి రావడం ఏమాత్రం ఆలస్యమైనా వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తున్నారు. అప్రమత్తంగా ఉండడం అవసరమే అయినప్పటికీ నిజానిజాలను ముందుగా నిర్ధారించుకోవాల’ని హోంశాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment