సాక్షి, సిటీబ్యూరో: తెలుగమ్మాయిలను పెళ్లిచేసుకునేందుకు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లలో వివరాలు నిక్షిప్తం చేసే విదేశీ వరులను వివాహం చేసుకుంటానంటూ నమ్మించి లక్షల్లో డబ్బులు తీసుకొని మోసగిస్తున్న ఓ కిలేడీని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ తెలిపిన మేరకు.. నెల్లూరు ఇనమాడుగుకు చెందిన అర్చన ఎస్‌వీ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. 2016లో నెల్లూరులోని ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న కొరమ్ దుర్గా ప్రవీణ్‌ను వివాహం చేసుకుంది. ఆర్థికంగా బాగా సంపాదించాలనే ఉద్దేశంతో మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ను అర్చన వేదికగా చేసుకుంది. గూగుల్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన అందమైన యువతులను ఫొటోలతో తెలుగు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో వివరాలు నిక్షిప్తం చేసింది. కేవలం విదేశీ వరులను మాత్రమే పెళ్లి చేసుకుంటానన్న అప్షన్ కూడా పొందుపరిచింది. అయితే విదేశాల్లో పనిచేస్తున్న తమ కుమారులకు తెలుగమ్మాయితో పెళ్లి జరిపించాలనే తల్లిదండ్రులు వారి వివరాలతో మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో రిజిష్టర్ చేసుకునేవారు.
అనంతరం విదేశీ వరులను మాత్రమే చేసుకుంటానని నకిలీ ఐడీ పుష్‌తాయి పేరుతో నమోదుచేసుకున్న అర్చన ఇచ్చిన విదేశీ ఫోన్‌నంబర్‌లో సంప్రదించారు. ఈ సమయంలో వరుడి తల్లిదండ్రులతో నిందితురాలు అర్చన గూగుల్ యాప్‌లలో అందుబాటులో ఉన్న మొబైల్ అప్లికేషన్‌ల ద్వారా వివిధ రకాల వాయిస్‌లతో మాట్లాడేది. ఒక్కసారిగా తన మాటలకు వరుడు, లేదంటే వారి తల్లిదండ్రులు విశ్వసనీస్తున్నారని తెలుసుకోగానే పెళ్లి చేసుకునేందుకు అభ్యంతరం లేదని చెప్పేది. కొన్నిరోజులు మాట్లాడాక వరుడికి ఫొటోలు పంపించేది. ఆ తర్వాత ఎంగేంజ్‌మెంట్ రింగ్‌లు కావాలని, బంగారం కావాలని, ప్లాటినమ్ కావాలని లక్షల్లో డబ్బులు దండుకునేది. ఈ విధంగానే అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తన కుమారుడి నుంచి రూ.1,50,000లు వివిధ బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేయించుకుని తర్వాత ఫోన్‌కాల్ రిసీవ్ చేసుకోవడం ఆపేసిందని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వరుడి తల్లిదండ్రులు మే 18న సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఫిర్యాదుచేశారు. ఈ మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు టెక్నికల్ డాటా ఆధారంగా నిందితులు అర్చనను నగరంలోనే బుధవారం అరెస్టు చేశారు. గతంలోనే ఇవే మోసం కేసుల్లో నగర సైబర్‌క్రైమ్ పోలీసులు అర్చనను అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలిస్తే 2018 డిసెంబర్‌లో ఓ అడ్వకేట్ సహాయంతో బయటకు వచ్చిందని సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు తెలిపారు. అర్చనను న్యాయస్థానంలో హజరుపరిచి చర్లపల్లి జైలుకు తరలించినట్టు చెప్పారు.
జైలుకెళ్లొచ్చినా మారని కిలేడీ
Published Thu, Jun 13 2019 7:58 AM | Last Updated on Thu, Jun 13 2019 7:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment