
సాక్షి, కర్నూలు: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన వారం రోజులు కూడా గడవక ముందే తన వైవాహిక జీవితానికి ఓ నవ వధువు స్వస్తి పలకాలనుకుంది. అత్తవారి ఇంటికి వచ్చిన భార్య.. భర్తకు విషం ఇచ్చిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన లింగమయ్యకు వారం రోజుల క్రితం మదనంతపురం గ్రామానికి చెందిన నాగమణితో వివాహం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు ఇష‍్టం లేకున్నా కూడా బలవంతంగా లింగమయ్యతో నాగమణి పెళ్లి చేశారు.
ఈ క్రమంలో తనకు ఇష్టం లేని పెళ్లి చేశారనే కోపంతో అత్తవారింటికి వచ్చిన నాగమణి భర్తకు మజ్జిగలో విషం కలిపి ఇచ్చింది. వీటిని తాగిన లింగమయ్య అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో అతడిని కుటుంబ సభ్యులు హుటాహుటిన గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన గుత్తి పోలీసులు ఈ కేసును దర్యాప్తులో భాగంగా జొన్నగిరి పోలీసు స్టేషన్‌కు బదలాయించారు.