చాదర్‌ఘాట్, మలక్‌పేట్ రూట్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు(ఫైల్)
సాక్షి, సిటీబ్యూరో: నగర ట్రాఫిక్ కమిషనరేట్‌లో గురువారం భేటీ అయిన రహదారి భద్రత కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించిన వాటిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కొన్ని కొత్త ప్రతిపాదనలు రూపొందించే అంశాలు ఉన్నాయి. అయితే ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వాటిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది.
కీలక ప్రాంతాల్లో అవసరమైన ప్రత్యామ్నాయాల అన్వేషణ, ఉన్న రోడ్లలోనే స్వల్ప మార్పులు చేయడం, వాడుకలో లేని వాటిని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ చెప్పడానికి ప్రయత్నాలు చేయాల్సి ఉంది. ముం దుకు సాగని ప్రతిపాదనల్లో కీలకమైనవి ఇవీ...
మలక్‌పేటలో ‘మూడో మార్గం’...
నగరంలోని అత్యంత కీలకమైన, క్లిష్టమైన మార్గాల్లో దిల్‌సుఖ్‌నగర్–చాదర్‌ఘాట్ ఒకటి. ఈ రూట్‌లో మలక్‌పేట రైల్వే స్టేషన్ వద్ద ఉన్న (ఆర్యూబీ) అనునిత్యం ట్రాఫిక్ జామ్స్‌కు కారణంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అక్కడ ఉన్న రెండు మార్గాలకు తోడుగా కనీసం మరోటి నిర్మించాలని దాదాపు నాలుగేళ్ల క్రితం నుంచి ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.
అనేకసార్లు భేటీ అయిన రైల్వే, ట్రాఫిక్, మెట్రో రైల్ అధికారులు ఎప్పటికప్పుడు త్వరలో పని మొదలంటూ ప్రకటిస్తూ వచ్చారు. అయితే ఇన్నే ళ్లు గడిచినా ఇప్పటి వరకు అక్కడ కనీసం శంకుస్థాపన కూడా జరగలేదు. ఫలితంగా రద్దీ వేళల్లో ఈ మార్గంలో ప్రయాణించాలంటూ వాహనచోదకులు నరకం చవిచూస్తున్నారు. మహాత్మాగాంధీ బస్ స్టేషన్ సైతం దీనికి సమీపంలోనే ఉండటంతో పండుగల సీజన్‌లో బాధలు వర్ణనాతీతం.
విమానాశ్రయం ‘మీదుగా’ రహదారి...
బేగంపేట నుంచి బోయిన్‌పల్లికి వెళ్లాలంటే ప్రస్తుతం సికింద్రాబాద్ మీదుగా వెళ్లాల్సిందే. దాదాపు 18 ఏళ్ల క్రితం బేగంపేట నుంచి బోయిన్‌పల్లికి ఓ షార్ట్‌కట్ రూట్ ఉండేది. బేగంపేట పోలీసుస్టేషన్ దాటిన ఎడమవైపు తిరిగి ఎయిర్ ఇండియా ఆఫీస్ మీదుగా వెళ్లే ఈ దారి దాదాపు 80 అడుగుల వెడల్పు ఉండేది. ఆపై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఈ మార్గాన్ని స్వాధీనం చేసుకుంది. బేగంపేట–సికింద్రాబాద్ మార్గం నిత్యం రద్దీతో నరకాన్ని చూపిస్తుంటుంది.
విమానాశ్రయం శంషాబాద్‌కు తరలిపోవడంతో పాత మార్గాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నించాలని దాదాపు ఐదేళ్ల క్రితం ట్రాఫిక్ అధికారులు భావించారు. అప్పట్లోనే రెండు దఫాలుగా స్థానిక అధికారులతో కలిసి సర్వే నిర్వహించారు. ప్రాథమిక దశలోనే ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇది సాకారమైతే బేగంపేట నుంచి బోయిన్‌పల్లి వైపు వెళ్లే వారి ప్రయాణ దూరం దాదాపు 6 కిమీ మేర తగ్గడంతో పాటు ట్రాఫిక్ జామ్స్ అధిగమించవచ్చు.
సికింద్రాబాద్ స్టేషన్ వద్ద స్కైవాక్...
కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2011లో ‘ప్రాజెక్ట్ 100 డేస్’ ప్రకటించారు. అందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో సమస్యల పరిష్కారానికి రైల్వేస్టేషన్ వద్ద స్కైవాక్ నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. కీలకమైన కో–ఆర్డినేషన్ కమిటీ ఆయా ప్రాంతాల్లో పర్యటించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కేంద్రంగా రెండు వైపులా ఉన్న బస్టాండ్ల వరకు స్కైవాక్ నిర్మించాలని క్షేత్రస్థాయి పర్యటన తర్వాత నిర్ణయించింది.
వీటి నిర్మాణం వల్ల రోడ్డుకు అడ్డంగా పాదచారులు నడవటం, ఎక్కడపడితే అక్కడ రోడ్డు దాటడం, చిరు వ్యాపారుల ఆక్రమణలు తదితర సమస్యలు శాశ్వతంగా తొలగుతాయని యోచించారు. కనీసం సమీపంలోని ఈ మూడు ప్రాంతాల మధ్య తొలివిడతగా స్కైవాక్‌లు ఏర్పాటు చేయాలని భావించారు. ఇప్పటికీ ఈ ప్రతిపాదనలు ఫైళ్లల్లోనే మగ్గుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment