నిందితుడు శ్రీనివాసరావుపై ఎన్‌ఐఏ ప్రశ్నల వర్షం | NIA questions on Srinivasa Rao about Murder Attempt on YS Jagan Case | Sakshi
Sakshi News home page

నిందితుడు శ్రీనివాసరావుపై ఎన్‌ఐఏ ప్రశ్నల వర్షం

Published Mon, Jan 14 2019 3:37 AM | Last Updated on Mon, Jan 14 2019 3:37 AM

NIA questions on Srinivasa Rao about Murder Attempt on YS Jagan Case - Sakshi

విశాఖ ఎయిర్‌పోర్టులోకి నిందితుడిని తీసుకెళ్తున్న ఎన్‌ఐఏ అధికారులు

సాక్షి, అమరావతి/విశాఖపట్నం /హైదరాబాద్‌:  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డ జనుపల్లి శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు ఆదివారం విశాఖపట్నంలో విచారించారు. అనంతరం విమానంలో హైదరాబాద్‌లోని తమ కార్యాలయానికి తరలించారు. విజయవాడ కోర్టు అనుమతితో శనివారం ఎన్‌ఐఏ సిబ్బంది శ్రీనివాసరావును తమ కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. విజయవాడ జైలు నుంచి అదేరోజు అర్ధరాత్రి దాటాక విశాఖపట్నం బక్కన్నపాలెంలోని ఏపీఎస్‌పీ బెటాలియన్‌కు తీసుకొచ్చారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు శ్రీనివాసరావును అతడి న్యాయవాది అబ్దుల్‌ సలీం సమక్షంలో విచారించారు. తర్వాత తెల్లచొక్కా, నల్ల ప్యాంటు ధరించిన నిందితుడిని అక్కడి నుంచి 3.45 గంటల సమయంలో ర్యాపిడ్‌ ఇంటర్వెన్షన్‌ వాహనంలో విశాఖపట్నం విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడ అతడికి ముసుగు వేసి ఎయిర్‌పోర్టులోకి తీసుకెళ్లారు. లోపలకు వెళ్లాక ముసుగు తొలగించారు. క్రైం సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగిన వీఐపీ లాంజ్‌లోకి శ్రీనివాసరావును వెంటబెట్టుకుని వెళ్లారు. అక్కడ అతడిని పలు అంశాలపై ప్రశ్నించారు. ఘటన జరిగిన తీరుతెన్నులను ఆరా తీశారు. ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లోని నేరస్థలం, కత్తిని భద్రపరిచిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం శ్రీనివాసరావు పనిచేసిన తెలుగుదేశం పార్టీ నేత హర్షవర్దన్‌ ప్రసాద్‌ చౌదరికి చెందిన ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్‌ఫుడ్స్‌ రెస్టారెంట్‌కు తీసుకెళ్లారు. దాదాపు 20 నిమిషాలపాటు అక్కడ ఉన్నారు. రెస్టారెంట్‌లో నిందితుడు విధులు నిర్వహించిన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ ఏయే పనులు చేసేవాడివని ప్రశ్నించారు. 

వారిద్దరూ అక్కడ లేరు 
నిందితుడు శ్రీనివాసరావును విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో విచారణకు తీసుకొచ్చిన సమయంలో ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ యజమాని, టీడీపీ నేత హర్షవర్దన్‌ ప్రసాద్‌ చౌదరి అక్కడ లేరు. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎయిర్‌పోర్టు చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ వేణుగోపాల్‌ కూడా లేరు. నిందితుడిని ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చే సమయంలోనూ విశాఖపట్నం పోలీసు అధికారులెవరూ వెంట రాలేదు.  
హైదరాబాద్‌కు తరలింపు 
విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో శ్రీనివాసరావును దాదాపు రెండు గంటల పాటు ఎన్‌ఐఏ అధికారులు ప్రశ్నించారు. సాయంత్రం 6 గంటలకు విశాఖ నుంచి హైదరాబాద్‌ మీదుగా దుబాయ్‌ వెళ్లే ఎయిర్‌ ఇండియా విమానంలో నిందితుడిని వెంటబెట్టుకుని హైదరాబాద్‌కు పయనమయ్యారు. శ్రీనివాసరావు వెంట ఎన్‌ఐఏ అధికారులు సాజిద్‌ మహ్మద్, ప్రసాద్, మరో అధికారి ఉన్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి భారీ బందోబస్తు మధ్య శ్రీనివాసరావును మాదాపూర్‌లోని ఎన్‌ఐఏ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. వారంరోజుల పాటు నిందితుడిని కస్టడీకి తీసుకున్న ఎన్‌ఐఏ అధికారులు జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం వెనుకున్న కారణాలు, సూత్రధారుల పాత్రను వెలుగులోకి తీసుకొచ్చేందుకు మాదాపూర్‌ కార్యాలయంలోనే విచారణ జరుపనున్నట్టు తెలిసింది. ముందుగా అనుకున్నట్టు విజయవాడ లేదా విశాఖపట్నంలోనే నిందితుడిని విచారించాలని భావించారు. అయితే, అక్కడి పరిస్థితులు అనుకూలించకపోవడంతో తమ కార్యాలయంలోనే విచారించడం మంచిదని నిర్ణయానికొచ్చినట్లు సమాచారం. అందులో భాగంగా మాదాపూర్‌లోని కార్యాలయంలోనే మిగిలిన విచారణ కొనసాగించాలని యోచిస్తున్నారు.  

నన్ను హైదరాబాద్‌కు రమ్మన్నారు 
శ్రీనివాసరావును హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయంలో విచారిస్తామని, విచారణ సమయంలో అక్కడికి రావాలని అధికారులు తనకు చెప్పారని నిందితుడు శ్రీనివాసరావు తరపు న్యాయవాది అబ్దుల్‌ సలీం పేర్కొన్నారు. తాను సోమవారం ఉదయం హైదరాబాద్‌ పయనమవుతున్నానని తెలిపారు. ఆదివారం విశాఖ ఏపీఎస్‌పీ బెటాలియన్‌లో ఎన్‌ఐఏ అధికారులు తన సమక్షంలో శ్రీనివాసరావును విచారించారని, ప్రతిపక్ష నేత జగన్‌ను హత్యచేయాలని ఎందుకు ప్రయత్నించావు, దీని వెనక ఎవరున్నారని ప్రశ్నించారని అబ్దుల్‌ సలీం చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement