సంఘటనా స్థలం వద్ద శిశువు తల్లిదండ్రులు
సాక్షి, హైదరాబాద్/నాగర్‌కర్నూల్/కల్వకుర్తి: కిడ్నాపైన తమ కొడుకు క్షేమంగా తిరిగొస్తాడని భావించిన ఆ తల్లిదండ్రులు.. చివరికి మృతదేహంగా కళ్లముందు మిగిలే సరికి తల్లడిల్లిపోయారు. పొత్తిళ్లలో వేసి లాలించకముందే తిరిగిరానంత దూరం వెళ్లిపోయాడంటూ కన్నీరుమున్నీరుగా రోదించారు. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బండోనిపల్లిలో బుధవారం కనిపించిన బాధాకర దృశ్యమిది. సత్తూరి మంజుల అనే మహిళ హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రి నుంచి ఆదివారం మగశిశువును అపహరించడం, ఆ శిశువు ఆరోగ్యం బాగాలేక మృతి చెందడంతో బండోనిపల్లిలో పూడ్చిపెట్టిన విషయం తెలిసిందే.
ఆ ఘటనపై వేగంగా స్పందించిన పోలీసులు.. నిందితురాలిని బుధవారం అరెస్టు చేశారు. ఆమెను, శిశువు తల్లిదండ్రులను బుధవారం బండోనిపల్లికి తీసుకెళ్లి.. పూడ్చిపెట్టిన శిశువు మృతదేహాన్ని వెలికి తీశారు. అక్కడే పోస్టుమార్టం కూడా నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ సమయంలో శిశువు తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఇక మృతదేహం నుంచి డీఎన్‌ఏ నమూనాలు సేకరించిన ఫోరెన్సిక్ వైద్యులు.. వాటిని తల్లిదండ్రుల డీఎన్‌ఏతో పోల్చేందుకు లేబోరేటరీకి పంపాలని నిర్ణయించారు. శిశువు మరణానికి అనారోగ్యమే కారణమా లేక మరేదైనా ఇతర అంశం ఉందా అన్నది పోస్టుమార్టం నివేదికలో తెలుస్తుందని పేర్కొన్నారు.
భర్తను ఏమార్చేందుకు..
మహబూబాబాద్ జిల్లా కేసముద్రానికి చెందిన మంజుల, బండోనిపల్లికి చెందిన కుమార్‌గౌడ్‌లు హైదరాబాద్‌లోని కాటేదాన్‌లో ఉన్న ఓ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో పనిచేస్తున్నారు. అప్పటికే వివాహమై భార్యకు దూరంగా ఉంటున్న కుమార్ మూడేళ్ల కింద మంజులను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో తొలుత గర్భం దాల్చిన మంజులకు మూడో నెలలోనే గర్భస్రావమైంది. ఈ ఏడాది రెండోసారి గర్భం దాల్చగా.. ఐదున్నర నెలలకు అబార్షన్ అయింది. ఈ విషయాన్ని భర్తకు, కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచిన మంజుల.. గర్భంతోనే ఉన్నట్లు నటించింది.
గత శనివారం ప్రసవం కోసం వెళ్తున్నానని భర్తకు చెప్పి.. పేట్లబురుజు ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ఎవరైనా శిశువులను ఇస్తారేమోనని ప్రయత్నించి విఫలమైంది. దాంతో ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన నిర్మల, ఆమె బంధువులతో పరిచయం పెంచుకుని.. వారి మగశిశువును నిలోఫర్ ఆస్పత్రి నుంచి ఎత్తుకెళ్లింది. ఆ బిడ్డ తమ బిడ్డేనని చెప్పి భర్తతో కలసి బండోనిపల్లిలోని అత్తవారింటికి వెళ్లింది. అయితే అప్పటికే అనారోగ్యంతో ఉన్న శిశువు సోమవారమే మరణించాడు. దాంతో కుమార్‌గౌడ్, ఆయన తల్లి బాలమ్మ కలసి గ్రామ సమీపంలోని ముళ్ల పొదల మధ్య శిశువును పూడ్చిపెట్టారు. అనంతరం భార్యాభర్తలు హైదరాబాద్‌లోని కాటేదాన్‌కు తిరిగి వచ్చేశారు. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి మంగళవారం రాత్రి నిందితులను గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment