kid kidnap
-
9 నెలల చిన్నారి అపహరణ
నెల్లూరు (క్రైమ్): అమ్మమ్మ వద్ద నిద్రిస్తున్న తొమ్మిది నెలల చిన్నారిని దుండగుడు అపహరించుకుని వెళ్లాడు. నెల్లూరు నగరంలోని గుప్తాపార్కు సెంటర్లో సోమవారం జరిగిన ఈ ఘటనపై పోలీసుల కథనం మేరకు వివరాలు.. పొదలకూరు మండలం మహ్మదాపురానికి చెందిన కొమరగిరి శీనయ్య, చెంచమ్మ దంపతుల కుమార్తె ఆదిలక్ష్మికి, కుందుకూరి శీనయ్యతో వివాహమైంది. ఆదిలక్ష్మి 9 నెలల కిందట ఓ పాపకు జన్మనిచ్చి మరణించింది. దీంతో ఆమె భర్త ఎటో వెళ్లిపోయాడు. అప్పటి నుంచి మనుమరాలి సంరక్షణను శీనయ్య దంపతులే చూసుకుంటున్నారు. యాచకవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సంక్రాంతి నేపథ్యంలో భిక్షాటన నిమిత్తం శీనయ్య.. తన భార్య, మనుమరాలు, అత్త పోలమ్మ, బంధువు ఏడుకొండలు, మరికొందరితో కలిసి మూడు రోజుల కిందట నెల్లూరు నగరానికి వచ్చారు. భిక్షాటన చేసుకుంటూ రాత్రి వేళలో గుప్తాపార్కు వద్ద రోడ్డు పక్కన నిద్రిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున 2.26 గంటల సమయంలో దుండగుడు పాపను అపహరించుకుని వెళ్లాడు. కొద్ది సేపటికి నిద్ర నుంచి తేరుకున్న శీనయ్య, చెంచమ్మలు పాప కనిపించకపోవడంతో చుట్టు పక్కల గాలించారు. ఫలితం లేకపోవడంతో సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాప అపహరణ ఘటనపై సంతపేట ఇన్స్పెక్టర్ షేక్ అన్వర్‌బాషా కేసు నమోదు చేశారు. ఘటన స్థలానికి చేరుకుని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. అందులో కిడ్నాప్ దృశ్యాలు, అనంతరం నిందితుడు చిన్నారిని ఆటోలో తరలిస్తున్న దృశ్యాలు రికార్డుకావడంతో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
రిమ్స్‌లో శిశువు అపహరణ
ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో నవజాత శిశువును అపహరించిందో మహిళ. సీసీ కెమెరాలకు చిక్కకుండా ఆస్పత్రి నుంచి బయటపడి.. పక్కా ప్రణాళికతో జిల్లా దాటేందుకు పన్నిన వ్యూహం బెడిసికొట్టింది. ఫిర్యా దు అందిన క్షణాల్లోనే స్పందించిన పోలీసులు.. రెండు గంటల వ్యవధిలోనే శిశువును తల్లి ఒడికి చేర్చారు. ఈ ఘటన మంగళవారం రిమ్స్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఇటీవల హైదరాబాద్ సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ఆస్ప త్రిలో శిశువు కిడ్నాప్ ఘటన మరువకముందే ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో పసికందు అపహరణ కలకలం సృష్టిం చింది. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం చోరపల్లికి చెందిన గణేష్ భార్య మమత ఆరు రోజుల క్రితం రిమ్స్ ఆస్పత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చింది. మంగళవారం డిశ్చార్జి కావాల్సి ఉంది. ఆదిలాబాద్ పట్టణం పిట్టలవాడకు చెందిన సోయం పుష్పలత, నగేష్ దంపతులకు సంతానం లేదు. వీరిద్దరూ గతంలో రిమ్స్ ఆస్పత్రిలో పని చేశారు. పుష్పలత ఏఎన్ఎంగా శిక్షణ పొం దగా.. నగేష్ ఫుడ్ స్టోర్‌లో పని చేశాడు. పిల్లలు లేకపోవడంతో రిమ్స్‌లో శిశువును అపహరించాలని నిర్ణయించారు. వీరికి ఆస్పత్రి పరిసరాలు తెలిసి ఉండటంతో సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వేకువజామున 3 గంటల ప్రాంతంలో శిశువును అపహరించిన పుష్పలత.. రేడియాలజీ విభా గంలోకి వెళ్లి అక్కడ ఉన్న చిన్న గేటు నుంచి ఆస్పత్రి బయటపడింది. అయితే.. మమత స్పృహలోకి వచ్చి శిశువు కనిపించకపోవడంతో తెల్లవారుజామున 3.15కి రిమ్స్ పోలీసు ఔట్ పోస్టు సిబ్బందికి ఫిర్యాదు చేసింది. వేకువజామున చెక్‌పోస్టులు.. తనిఖీలు సమాచారం అందుకున్న ఆదిలాబాద్ డీఎస్పీ నర్సింహారెడ్డి, టూటౌన్ సీఐ స్వామి రిమ్స్‌కు చేరుకుని ఘటన వివరాలను ఎస్పీ విష్ణు ఎస్ వారియర్‌కు తెలిపారు. ఆయన ఆదేశాల మేర కు సరిహద్దు ప్రాంతాలతోపాటు మండలాల్లో ఎస్ఐలు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. నేరడిగొండ చెక్‌పోస్టు వద్ద జీపులో వెళ్తున్న మహిళను అనుమానించిన పోలీసులు ఆమె వివరాలు అడగడంతో అసలు విషయం బయటపడింది. తాను తీసుకెళ్తున్న పసికందును రిమ్స్ నుంచి తెచ్చానని చెప్పడంతో పోలీసులు పుష్పలత, నగేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. శిశువుపై ఉన్న చిన్న గుడ్డ ఆధారంగా గుర్తుపట్టిన తల్లి తన బిడ్డేనని చెప్పడంతో ఆమెకు అప్పగించారు. నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. -
తల్లడిల్లిన తల్లి గుండె!
సాక్షి, హైదరాబాద్/నాగర్‌కర్నూల్/కల్వకుర్తి: కిడ్నాపైన తమ కొడుకు క్షేమంగా తిరిగొస్తాడని భావించిన ఆ తల్లిదండ్రులు.. చివరికి మృతదేహంగా కళ్లముందు మిగిలే సరికి తల్లడిల్లిపోయారు. పొత్తిళ్లలో వేసి లాలించకముందే తిరిగిరానంత దూరం వెళ్లిపోయాడంటూ కన్నీరుమున్నీరుగా రోదించారు. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బండోనిపల్లిలో బుధవారం కనిపించిన బాధాకర దృశ్యమిది. సత్తూరి మంజుల అనే మహిళ హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రి నుంచి ఆదివారం మగశిశువును అపహరించడం, ఆ శిశువు ఆరోగ్యం బాగాలేక మృతి చెందడంతో బండోనిపల్లిలో పూడ్చిపెట్టిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై వేగంగా స్పందించిన పోలీసులు.. నిందితురాలిని బుధవారం అరెస్టు చేశారు. ఆమెను, శిశువు తల్లిదండ్రులను బుధవారం బండోనిపల్లికి తీసుకెళ్లి.. పూడ్చిపెట్టిన శిశువు మృతదేహాన్ని వెలికి తీశారు. అక్కడే పోస్టుమార్టం కూడా నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ సమయంలో శిశువు తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఇక మృతదేహం నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించిన ఫోరెన్సిక్ వైద్యులు.. వాటిని తల్లిదండ్రుల డీఎన్ఏతో పోల్చేందుకు లేబోరేటరీకి పంపాలని నిర్ణయించారు. శిశువు మరణానికి అనారోగ్యమే కారణమా లేక మరేదైనా ఇతర అంశం ఉందా అన్నది పోస్టుమార్టం నివేదికలో తెలుస్తుందని పేర్కొన్నారు. భర్తను ఏమార్చేందుకు.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రానికి చెందిన మంజుల, బండోనిపల్లికి చెందిన కుమార్‌గౌడ్‌లు హైదరాబాద్‌లోని కాటేదాన్‌లో ఉన్న ఓ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో పనిచేస్తున్నారు. అప్పటికే వివాహమై భార్యకు దూరంగా ఉంటున్న కుమార్ మూడేళ్ల కింద మంజులను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో తొలుత గర్భం దాల్చిన మంజులకు మూడో నెలలోనే గర్భస్రావమైంది. ఈ ఏడాది రెండోసారి గర్భం దాల్చగా.. ఐదున్నర నెలలకు అబార్షన్ అయింది. ఈ విషయాన్ని భర్తకు, కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచిన మంజుల.. గర్భంతోనే ఉన్నట్లు నటించింది. గత శనివారం ప్రసవం కోసం వెళ్తున్నానని భర్తకు చెప్పి.. పేట్లబురుజు ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ఎవరైనా శిశువులను ఇస్తారేమోనని ప్రయత్నించి విఫలమైంది. దాంతో ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన నిర్మల, ఆమె బంధువులతో పరిచయం పెంచుకుని.. వారి మగశిశువును నిలోఫర్ ఆస్పత్రి నుంచి ఎత్తుకెళ్లింది. ఆ బిడ్డ తమ బిడ్డేనని చెప్పి భర్తతో కలసి బండోనిపల్లిలోని అత్తవారింటికి వెళ్లింది. అయితే అప్పటికే అనారోగ్యంతో ఉన్న శిశువు సోమవారమే మరణించాడు. దాంతో కుమార్‌గౌడ్, ఆయన తల్లి బాలమ్మ కలసి గ్రామ సమీపంలోని ముళ్ల పొదల మధ్య శిశువును పూడ్చిపెట్టారు. అనంతరం భార్యాభర్తలు హైదరాబాద్‌లోని కాటేదాన్‌కు తిరిగి వచ్చేశారు. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి మంగళవారం రాత్రి నిందితులను గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. -
ఆ అమ్మకు కన్నీరే మిగిలింది
-
ఆ అమ్మకు కన్నీరే మిగిలింది
సాక్షి, హైదరాబాద్/వెల్దండ: కన్నకొడుకును కళ్లారా చూసుకోకముందే ఆ అమ్మకు కన్నీరు మిగిలింది.. పుట్టిన మూడు రోజులకే దూరమైన బిడ్డ చివరిచూపు కూడా దక్కకుండానే శాశ్వతంగా దూరమైపోయాడు.. ఆదివారం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రి వద్ద కిడ్నాపైన శిశువు ఉదంతం విషాదాంతమైంది. సోమవారం ఉదయమే ఆ శిశువు మరణించాడని.. కిడ్నాపర్ నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండి మండలం బండరోనిపల్లి గ్రామంలో మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు తేలింది. కిడ్నాపర్‌ను సత్తూరి మంజులగా గుర్తించిన పోలీసులు.. మంగళవారం ఆమెను, ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆయాగా పరిచయం చేసుకుని.. హైదరాబాద్‌లోని ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన పాండు భార్య నిర్మల శుక్రవారం పేట్లబురుజు ఆస్పత్రిలో మగశిశువుకు జన్మనిచ్చింది. ఆ పసికందు ఆరోగ్యం బాగా లేకపోవడంతో నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి తీసుకువస్తున్నారు. ఇక వరంగల్ జిల్లా కేసముద్రానికి చెందిన మంజుల, నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండి మండలం బండరోనిపల్లికి చెందిన కుమార్‌గౌడ్ కొన్నేళ్ల కింద హైదరాబాద్‌లోని కాటేదాన్ పారిశ్రామికవాడకు వలస వచ్చారు. అక్కడ వారికి పరిచయం ఏర్పడి మూడేళ్ల కింద వివాహం చేసుకున్నారు. మంజుల పలు గర్భం దాల్చినా వరుసగా అబార్షన్లు కావడంతో తమకు పిల్లలు పుట్టే అవకాశం లేదని భావించింది. రెండు నెలల కింద ఆరు నెలల గర్భం కూడా పోయింది. అయినా భర్తకు చెప్పకుండా దాచిన ఆమె.. ప్రసవం కోసమంటూ ఓ మహిళతో కలసి పేట్లబురుజు ఆస్పత్రికి వచ్చింది. అక్కడ ఎవరైనా తనకు శిశువును ఇస్తే.. తమ బిడ్డగా భర్తకు చూపాలని భావించింది. శనివారం రోజంతా ఆస్పత్రిలోనే ఉండి.. ఆయాగా చెప్పుకుంటూ తిరిగింది. చివరికి ఆస్పత్రిలో నిర్మల కుమారుడిని కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకుని.. వారితో పరిచయం పెంచుకుంది. ఆదివారం శిశువును నీలోఫర్ ఆస్పత్రికి తీసుకెళుతుండగా తాను సహాయంగా ఉంటానంటూ మంజుల కూడా వెళ్లింది. నీలోఫర్ ఆస్పత్రిలో స్కానింగ్ తీసిన అనంతరం శిశువు బంధువులు ఏమరుపాటుగా ఉన్న సమయం చూసి.. శిశువును ఎత్తుకుని పరారైంది. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా.. నీలోఫర్ ఆస్పత్రి వద్ద శిశువును కిడ్నాప్ చేసిన మంజుల.. అక్కడి నుంచి లక్డీకాపూల్ వరకు ఆటోలో, తర్వాత బస్సులో పేట్లబురుజు ఆస్పత్రి వద్దకు వెళ్లినట్లు పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా గుర్తించారు. అనంతరం తనను డిశ్చార్జి చేశారని, బిడ్డను తీసుకుని వెళదామని భర్తను ఆస్పత్రి వద్దకు పిలిపించుకుంది. అక్కడి నుంచి శిశువుతో సహా భార్యాభర్తలు బైక్‌పై తమ స్వగ్రామం బండరోనిపల్లికి చేరుకున్నారు. అయితే అప్పటికే శిశువు అనారోగ్యంతో ఉండగా.. పరిస్థితి విషమించి సోమవారం ఉదయం కన్నుమూశాడు. దీంతో శిశువును గ్రామంలోనే పూడ్చిపెట్టారు. అయితే శిశువును తీసుకెళుతున్న మహిళ బస్సులో ప్రయాణించిన విషయం తెలుసుకున్న పోలీసులు... మంగళవారం వెల్దండ వెళ్లి విచారించారు. కిడ్నాపర్ చిత్రాలు చూపించగా సత్తూరి మంజులగా స్థానికులు గుర్తించారు. దీంతో ఆ గ్రామానికి వెళ్లిన పోలీసులు మంజులను, ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పోలీసులు బుధవారం శిశువు మృతదేహాన్ని వెలికితీసి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ’నీలోఫర్’ శిశువు కిడ్నాప్ ఘటన విషాదాంతం -
‘నిలోఫర్’ నుంచి శిశువు అపహరణ
హైదరాబాద్: కన్నబిడ్డను ఆ తల్లి కడుపారా చూసుకోక ముందే అపహరించారు. ఆయాగా వచ్చిన మహిళ.. శిశువు అమ్మమ్మ కళ్లు గప్పి ఈ దారుణానికి పాల్పడింది. ఆదివారం హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఉప్పుగూడకు చెందిన పాండూ భార్య నిర్మల శుక్రవారం పాతబస్తీలోని పేట్ల బురుజు ప్రసూతి ఆసుపత్రిలో చేరింది. అదే రోజు ఆసుపత్రిలో నిర్మల పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డకు నిమోనియా ఉండటంతో శిశువును నిలోఫర్‌కు తీసుకెళ్లాలంటూ వైద్యులు సలహా ఇచ్చారు. వైద్యుల సలహా మేరకు బాలింతను పేట్ల బురుజు ఆసుపత్రిలోనే ఉంచారు. అదే సమయంలో ఓ గుర్తు తెలియని మహిళ తాను ఆయానంటూ నిర్మల, ఆమె తల్లి కల్పనకు పరిచయమయింది. శిశువును తీసుకుని ఆయాతో సహా కల్పన నిలోఫర్ ఆసుపత్రికి చేరుకుంది. అత్యవసర కేసు కావడం తో తొలుత శిశువుకు ఎక్స్‌రే తీశారు. ఆదివారం సెలవు దినం కావడంతో వెంటనే శిశువును చూసే వైద్యులు అందుబాటులో లేరు. ఎక్స్‌రేను వైద్యులకు చూపించాల్సి ఉండటంతో అక్కడే కూర్చున్నారు. ఉదయం నుంచి కల్పన ఏమీ తినకపోవడంతో శిశువును ఆయా వద్ద ఉంచి టీ తాగి వస్తానని బయటికి వచ్చింది. ఆసుపత్రి బయటి గేటు వద్దకు వచ్చి టీ తాగి వెళ్లి చూడగా శిశువు, ఆయా కనిపించలేదు. ఆసుపత్రి ప్రాంగణమంతా కలియతిరిగినా ఆయా కానరాలేదు. దీంతో బాధితురాలు నాంపల్లి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ ఆర్.సంజయ్ కుమార్ ఇతర పోలీసులతో సంఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. చికిత్స కోసం నిలోఫర్‌కు వెళ్లిన తన బిడ్డను ఎవరో కిడ్నాప్ చేశారన్న విషయం తెలుసుకున్న నిర్మల తీవ్ర ఆందోళనకు గురైంది. రాత్రి పొద్దుపోయే వరకు కూడా శిశువు ఆచూకీ లభించలేదు. -
కుమారుడిని కిడ్నాప్ చేసిన హీరో!
సాక్షి, న్యూఢిల్లీ : సినీహీరో మహ్మద్ షాహిద్ తన కుమారుడి కోసం ఆడిన నాటకం బట్టబయలైంది. దీంతో చివరకు కటకటాల పాలయ్యాడు. ఆ వివరాలిలా ఉన్నాయి.. భోజ్‌పురి నటుడు మహ్మద్ షాహిద్ పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. కానీ అతడికి తన రెండేళ్ల కొడుకు ఆలనాపాలనా చూసుకోవాలని ఉంది. భార్య నుంచి విడాకులు తీసుకోవడంతో ఆ ఫ్యామిలీ బాబును అప్పగించేందుకు అభ్యంతరాలు చెప్పారు. విడాకులు తీసుకునే సమయంలో ఆ బాలుడి బాధ్యతలను కోర్టు తల్లికి అప్పగించింది. భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత షాహిద్ మరో అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు. కానీ కుమారుడిని తనకి అప్పగించని భార్య, ఆమె కుటుంబంపై ఆయన కక్షగట్టాడు. బాబుని కిడ్నాప్ చేసి అయినా తన వద్దకు రప్పించుకోవాలని భావించాడు. ప్లాన్ ప్రకారం.. గత జూన్ లో కుమారుడిని కిడ్నాప్ చేశాడు షాహిద్. ఈ క్రమంలో తన మనవడిని ఎవరో కిడ్నాప్ చేశారంటూ జైపూర్ వాసి ముంతాజ్ దక్షిణఢిల్లీలోని జమియా నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్ లోని బరేలీలోనూ పోలీసులు తనిఖీలు చేశారు. నటుడు మహ్మద్ షాహిద్‌పై నిఘాపెట్టిన పోలీసులు మంగళవారం పశ్చిమఢిల్లీలోని వినోద్ నగర్లో ఆయనతో పాటు సహజీవనం చేస్తున్న మహిళను అరెస్ట్ చేసినట్లు డీసీపీ రామిల్ బనియా తెలిపారు. షాపింగ్ కోసం మాజీ భార్య కుటుంబాన్ని పిలిపించి.. ప్లాన్ ప్రకారమే బాబును కిడ్నాప్ చేసి తన ప్రియురాలికి ఇచ్చినట్లు పోలీసుల విచారణలో నటుడు అంగీకరించాడు. ఆమె సాయంతో బాబును ఢిల్లీలోని పలు ఏరియాల్లో దాచిపెట్టినట్లు వివరించాడు.