
సీసీ కెమెరా దృశ్యాలు
నెల్లూరు (క్రైమ్): అమ్మమ్మ వద్ద నిద్రిస్తున్న తొమ్మిది నెలల చిన్నారిని దుండగుడు అపహరించుకుని వెళ్లాడు. నెల్లూరు నగరంలోని గుప్తాపార్కు సెంటర్‌లో సోమవారం జరిగిన ఈ ఘటనపై పోలీసుల కథనం మేరకు వివరాలు.. పొదలకూరు మండలం మహ్మదాపురానికి చెందిన కొమరగిరి శీనయ్య, చెంచమ్మ దంపతుల కుమార్తె ఆదిలక్ష్మికి, కుందుకూరి శీనయ్యతో వివాహమైంది. ఆదిలక్ష్మి 9 నెలల కిందట ఓ పాపకు జన్మనిచ్చి మరణించింది. దీంతో ఆమె భర్త ఎటో వెళ్లిపోయాడు. అప్పటి నుంచి మనుమరాలి సంరక్షణను శీనయ్య దంపతులే చూసుకుంటున్నారు. యాచకవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
సంక్రాంతి నేపథ్యంలో భిక్షాటన నిమిత్తం శీనయ్య.. తన భార్య, మనుమరాలు, అత్త పోలమ్మ, బంధువు ఏడుకొండలు, మరికొందరితో కలిసి మూడు రోజుల కిందట నెల్లూరు నగరానికి వచ్చారు. భిక్షాటన చేసుకుంటూ రాత్రి వేళలో గుప్తాపార్కు వద్ద రోడ్డు పక్కన నిద్రిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున 2.26 గంటల సమయంలో దుండగుడు పాపను అపహరించుకుని వెళ్లాడు.
కొద్ది సేపటికి నిద్ర నుంచి తేరుకున్న శీనయ్య, చెంచమ్మలు పాప కనిపించకపోవడంతో చుట్టు పక్కల గాలించారు. ఫలితం లేకపోవడంతో సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాప అపహరణ ఘటనపై సంతపేట ఇన్‌స్పెక్టర్ షేక్ అన్వర్‌బాషా కేసు నమోదు చేశారు. ఘటన స్థలానికి చేరుకుని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. అందులో కిడ్నాప్ దృశ్యాలు, అనంతరం నిందితుడు చిన్నారిని ఆటోలో తరలిస్తున్న దృశ్యాలు రికార్డుకావడంతో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment