baby kidnap
-
బహదూర్‌పురా: 18 నెలల చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతం
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో 18 నెలల చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. బహుదూర్‌పురా పీఎస్ పరిధిలోని కిషన్‌బాగ్‌లో సోమవారం ఏడాదిన్నర వయసున్న చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. పాపను ఓ మహిళ అపహరించి తీసుకెళ్లుతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. సీసీటీవీ ఆధారంగా 24 గంటల వ్యవధిలోనే పసికందు ఆచూకీని బహదూర్‌పురా పోలీసులు కనుగొన్నారు. ఫిర్యాదు ఇచ్చిన నాలుగు గంటల్లోనే కిడ్నాప్ కేసును చేధించారు. కిడ్నాప్ చేసిన మహిళను అరెస్ట్ చేశారు. చిన్నారిని తల్లిదండ్రులకు పోలీసుల అప్పగించారు. తన కొడుకుకి 8 ఏళ్లుగా పిల్లలు పుట్టకపోవడంతో మహిళ.. పాపను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
42 ఏళ్లకు అమ్మను చూశాడు!
వాషింగ్టన్: దక్షిణ అమెరికా దేశం చిలీలో నెలలు నిండకుండానే జన్మించిన ఓ శిశువు అపహరణకు గురయ్యాడు. కిడ్నాపర్లు ఆ శిశువును అమెరికాకు చెందిన దంపతులకు దత్తతకిచ్చేశారు. ఇది జరిగి 42 ఏళ్లయింది. ప్రస్తుతం అతడి పేరు జిమ్మీ లిపర్ట్ థైడెన్. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం ఆష్‌బర్న్‌లో ఉంటూ లాయర్‌గా పనిచేస్తున్నాడు. కాగా, 1970, 80ల్లో నియంత ఫినోచెట్ హయాంలో చిలీలో వందలాదిగా శిశువులు అపహరణకు గురయ్యారు. ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో వారిలో కొందరు తిరిగి కన్నవారి చెంతకు చేరుతున్నారనే వార్తను మొన్న ఏప్రిల్‌లో థైడెన్ చూశాడు. ఆ సంస్థను సంప్రదించి తన డీఎన్ఏ వివరాల సాయంతో కన్న తల్లి జాడ కనుక్కున్నాడు. తోబుట్టువులు కూడా ఉన్నట్లు తెలిసింది. ఇంకేముంది? భార్య, ఇద్దరు పిల్లలను తీసుకుని చిలీలోని వల్దీవియాలో ఉండే తల్లి మరియా అంజెలికా గొంజాలెజ్ వద్దకు వెళ్లాడు. ‘హాస్పిటల్ సిబ్బంది నెలలు నిండని నా కొడుకు చనిపోయాడని చెప్పగా విని, గుండెలవిసేలా రోదించాను. నా చిన్నారి ఎక్కడున్నా సుఖంగా ఉండాలని దేవుణ్ని కోరుకున్నా. నా ప్రార్థన ఫలించింది’అంటూ ఆమె కొడుకును హత్తుకుంది. తల్లి, కొడుకు కలుసుకున్న వేళ ఆ ఊరంతా పండగ చేసుకుంది. -
9 నెలల చిన్నారి అపహరణ
నెల్లూరు (క్రైమ్): అమ్మమ్మ వద్ద నిద్రిస్తున్న తొమ్మిది నెలల చిన్నారిని దుండగుడు అపహరించుకుని వెళ్లాడు. నెల్లూరు నగరంలోని గుప్తాపార్కు సెంటర్లో సోమవారం జరిగిన ఈ ఘటనపై పోలీసుల కథనం మేరకు వివరాలు.. పొదలకూరు మండలం మహ్మదాపురానికి చెందిన కొమరగిరి శీనయ్య, చెంచమ్మ దంపతుల కుమార్తె ఆదిలక్ష్మికి, కుందుకూరి శీనయ్యతో వివాహమైంది. ఆదిలక్ష్మి 9 నెలల కిందట ఓ పాపకు జన్మనిచ్చి మరణించింది. దీంతో ఆమె భర్త ఎటో వెళ్లిపోయాడు. అప్పటి నుంచి మనుమరాలి సంరక్షణను శీనయ్య దంపతులే చూసుకుంటున్నారు. యాచకవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సంక్రాంతి నేపథ్యంలో భిక్షాటన నిమిత్తం శీనయ్య.. తన భార్య, మనుమరాలు, అత్త పోలమ్మ, బంధువు ఏడుకొండలు, మరికొందరితో కలిసి మూడు రోజుల కిందట నెల్లూరు నగరానికి వచ్చారు. భిక్షాటన చేసుకుంటూ రాత్రి వేళలో గుప్తాపార్కు వద్ద రోడ్డు పక్కన నిద్రిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున 2.26 గంటల సమయంలో దుండగుడు పాపను అపహరించుకుని వెళ్లాడు. కొద్ది సేపటికి నిద్ర నుంచి తేరుకున్న శీనయ్య, చెంచమ్మలు పాప కనిపించకపోవడంతో చుట్టు పక్కల గాలించారు. ఫలితం లేకపోవడంతో సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాప అపహరణ ఘటనపై సంతపేట ఇన్స్పెక్టర్ షేక్ అన్వర్‌బాషా కేసు నమోదు చేశారు. ఘటన స్థలానికి చేరుకుని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. అందులో కిడ్నాప్ దృశ్యాలు, అనంతరం నిందితుడు చిన్నారిని ఆటోలో తరలిస్తున్న దృశ్యాలు రికార్డుకావడంతో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
పసికందును ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని మహిళ
సాక్షి, ప్రకాశం: జిల్లాలోని మార్కాపురం ఏరియా వైద్యశాలలో దారుణం జరిగింది. నాలుగు రోజుల పసికందును గుర్తు తెలియని మహిళ ఎత్తుకెళ్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వివరాలు.. గుంటూరు జిల్లా కారంపూడి సమీపంలోని బట్టువారిపల్లి కి చెందిన శ్రీ రాములు నాలుగు రోజుల క్రితం తన భార్యను కాన్పు కోసం ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో శనివారం డిశ్చార్జి కావలసి ఉండగా అబ్జర్వేషన్ లో ఉంచాలంటూ పాపను ఆస్పత్రి సిబ్బంది ఓ గదిలోకి తీసుకు వెళ్లారు. అనంతరం శ్రీ రాములును భోజనం తెమ్మని చెప్పారు. అయితే, అతడు తిరిగి రాగా పాప కనిపించడం లేదంటూ వైద్య సిబ్బంది తెలపడంతో నిర్ఘాంతపోయాడు. వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు ఆధారంగా పోలీసులు, పాపను ఎత్తుకెళ్లిన మహిళ కోసం గాలిస్తున్నారు. చదవండి: సారు పేరులోనే ‘లక్ష్మీ’ కళ.. వసూళ్లలో డిఫరెంట్ స్టైల్ -
15 రోజుల పాపను ఎత్తుకెళ్లిపోయారు
సాక్షి, ఆర్మూర్‌టౌన్ (నిజామాబాద్): పాప పుట్టి నెల రోజులైనా కాలేదు. తనని కళ్లారా చూసుకుంది లేదు... తనివితీరా ముద్దాడింది లేదు. అంతలోనే ఎవరో దుండగులు తల్లి నుంచి బిడ్డని వేరు చేశారు. తల్లి ఆదమరచి నిద్రిస్తున్న సమయం లో పాపను శిశువును ఎత్తుకుపోయారు. ఆర్మూర్ మండలం పెర్కిట్‌లో గల క్లాసిక్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై విజయ్ నారాయణ్ కథనం ప్రకారం.. పెర్కిట్‌కు చెందిన సుమలత 15 రోజుల క్రితం పండంటి ఆడబిడ్డను ప్రసవించింది. శనివారం రాత్రి ఉక్కపోతగా ఉండడంతో పసిబిడ్డతో కలిసి ఇంటి ఎదుట నిద్రకు ఉపక్రమించింది. తెల్లారి లేచి చూసే సరికి శిశువు కనిపించలేదు. అన్ని చోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో బాధితురాలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిడ్నాప్ కేసు నమోదుచేసిన పోలీసులు శిశువు కోసం గాలిస్తున్నారు. -
సంగారెడ్డిలో అపహరణ: ఎల్లారెడ్డిలో ప్రత్యక్షం
ఎల్లారెడ్డి: సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం నుంచి అపహరణకు గురైన ఓ పాప ఎల్లారెడ్డి మండలంలోని శివానగర్‌లో ప్రత్య క్షమైంది. అపహరణకు గురైన పాప ఆచూకీ లభించడంతో చిన్నారి తల్లితండ్రులు ఆనందంలో ము నిగారు. సంగారెడ్డి జిల్లా కల్పగూర్‌కు చెందిన హన్మోజిగారి మల్లేశం తన భార్య మాధవిని ప్రస వం నిమిత్తం గత నెల 30న సంగారెడ్డిలోని మా తాశిశు ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. సాధారణ ప్రసవంలో మాధవి పాపకు జన్మనిచ్చింది. అనంతరం ఇంటికి వెళ్లిన రెండు రోజులకు పాపకు కామెర్లు కావడంతో తిరిగి సంగారెడ్డి ఆరోగ్య కేంద్రానికి రాగా వైద్యులు పాపను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఈనెల 7న ఆస్పత్రిలో కాంట్రాక్టు ఆయాగా పని చేస్తున్న వనిత కామెర్ల వ్యాధితో చికిత్స పొందిన శిశువును వారి తల్లిదండ్రులకు అప్పగించకుండా ఇతరులకు అప్పగించింది. తమ శిశువును ఎత్తుకు పోయారన్న విషయాన్ని తెలుసుకున్న మాధవి, మల్లేషం వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆస్పత్రి ఎదుట ఆందోళనకు ది గారు. విషయం తెలుసుకున్న కలెక్టర్, ఎస్పీ, జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు ఆస్పత్రికి వచ్చి శిశువు ను వెతికి అప్పగిస్తామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. అనంతరం జిల్లా ఎస్పీ ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి వేర్వేరు ప్రాంతాలకు పంపిచారు. చిన్నారి ఎల్లారెడ్డి మండలం శివానగర్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ప్రత్యేక బృందం గురువారం ఎల్లారెడ్డికి వచ్చి స్థానిక పోలీసుల సహకారంతో చిన్నారిని స్వాధీనం చేసుకున్నారు. పాపను హరించిన బంగారు సంతోష్, శోభ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు శిశువుల మృతితో అపహరణ.. శివానగర్‌కు చెందిన బంగారు సంతోష్, శోభా దంపతులు తమ కూతురు కరుణను తన బావ కుమారుడు రవికి ఇచ్చి మేనరిక వివాహం చేశా రు. వారు గతేడాది మగబిడ్డకు జన్మనివ్వగా అత డు అనారోగ్యంతో మృతి చెందాడు. మళ్లీ 15 రో జుల క్రితం ఆడపిల్ల జన్మించగా అనారోగ్యానికి గురై నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృ తి చెందింది. దీంతో ఏమి చేయాలో దిక్కు తోచని సంతోష్ పాప మృతి చెందితే తన కూతురు తట్టుకోలేదని సంగారెడ్డిలోని ఆరోగ్య కేంద్రం నుంచి పాపను అపహరించారు. సదరు పాప ఆచూకీని కనుగొన్న పోలీసులు పాపను స్వాధీనం చేసుకుని నిందితులను సంగారెడ్డికి తీసుకుని వెళ్ళారు. -
శిశువు తరలింపు యత్నం..
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో శిశువు కిడ్నాప్ వదంతులు కలకలం రేపాయి. శిశువు పుట్టిన వెంటనే తనను డిశ్చార్జ్ చేయమంటే వైద్యులు అంగీకరించక పోవడంతో ఆమె తన బంధువులతో కలసి పాపను దొంగతనంగా తరలించేందుకు యత్నించడం కొంతసేపు ఆస్పత్రిలో గందరగోళం సృష్టించింది. మౌలాలీకి చెందిన జ్యోతి(23) నాలుగు రోజుల క్రితం ప్రసవం కోసం గాంధీ ఆస్పత్రిలో చేరింది. ఈనెల 18న ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆస్పత్రిలో సేవలు చేసేందుకు ఎవరూ లేరని, సాధారణ ప్రసవం కావడంతో తనను డిశ్చార్జ్ చేయమని జ్యోతి వైద్యులను కోరింది. శిశువు ఆరోగ్యపరిస్థితి దృష్ట్యా వైద్యులు నిరాకరించారు. దీంతో సిబ్బందికి తెలీకుండా వార్డు నుంచి శిశువును ఇంటికి తరలించేందుకు తోటికోడలు సరోజ, బంధువు అంజలిల సాయం కోరింది. వారు శనివారం ఉదయం 11 గంటల సమయంలో వార్డులోకి వచ్చి శిశువుతో బయట పడే ప్రయత్నం చేశారు. కొద్దిసమయం తర్వాత జ్యోతి ఆస్పత్రి బయటకు వెళ్లింది. అయితే శిశువును సెల్లార్ ద్వారం నుంచి బయటకు తీసుకెళ్లేందుకు జ్యోతి బంధువులు చేసిన ప్రయత్నం గుర్తించిన సెక్యూరిటీసిబ్బంది అనుమానంతో ఆమెను అడ్డగించారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకుని పోలీస్ అవుట్‌పోస్టుకు తీసుకువచ్చారు. పోలీసులు, ఆస్పత్రి అధికారులు గట్టిగా నిలదీయడంతో జరిగిన విషయం వారు వివరించారు. ఆస్పత్రి బయట ఉన్న బాలింత జ్యోతిని వార్డులోకి రప్పించి ఆరా తీయడంతో తన ఇంటివద్ద పరిస్థితుల కారణంగా డిశ్చార్జ్ కోరానని వైద్యులు నిరాకరించడంతో శిశువును దొంగతనంగా ఇంటికి తరలించేందుకు యత్నించామని తెలిపింది. పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు శిశువుతోపాటు జ్యోతిని వార్డు సిబ్బందికి అప్పగించారు. సరోజ, అంజలిలను గట్టిగా హెచ్చరించి పంపేశారు. అయితే ఇదంతా శిశువు కిడ్నాప్ ఉదంతంగా ప్రచారం అవ్వడంతో ఆస్పత్రిలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. చివరికి వదంతులకు తెరపడింది. -
రెండు గంటల్లో తల్లి ఒడికి..
ఆదిలాబాద్: మగశిశువు జన్మించడం ఆ దంపతుల్లో ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఆరు రోజులు గడిచాయి.. మంగళవారం డిశ్చార్జి కావాల్సి ఉంది. వేకువజామున తల్లి ఒడిలో వెచ్చగా నిద్రిస్తున్న శిశువు ఒక్కసారిగా మాయమైంది. స్పృహలోకి వచ్చి చూసిన తల్లిదండ్రుల గుండెల్లో పిడుగు పడినట్లయింది. తమ కుమారుడు కిడ్నాప్‌కు గురి కావడం వారిని ఆందోళ నకు గురి చేసింది. ఈ విషయమై ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు క్షణాల్లో స్పందించారు. రెండు గంటల వ్యవధిలో కిడ్నాప్‌కు గురైన శిశువును తల్లి ఒడికి చేర్చారు. నిందితులను కటకటాల వెనక్కి పంపారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఉమ్మడి జిల్లాలో కలకలం సృష్టించింది. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం చోరపల్లి గ్రామానికి చెందిన దిరబసి గణేష్ భార్య మమత ఆరు రోజుల క్రితం రిమ్స్ ఆస్పత్రిలోని కేసీఆర్ కిట్ వార్డులో మగశిశువుకు జన్మనిచ్చింది. మంగళవారం ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావాల్సి ఉండగా.. వేకువజామున శిశువు కిడ్నాప్‌కు గురైంది. తల్లి స్పృహలోకి రాగా రిమ్స్ అధికారులకు సమాచారం అందించింది. వారి సమాచారం మేరకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. చిన్నగుడ్డతో నిందితురాలిని గుర్తించిన పోలీసులు.. ∙ మంగళవారం వేకువజామున 3గంటల సమయంలో శిశువు కిడ్నాప్‌కు గురైనట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ∙ 3.15 గంటలకు రిమ్స్ సిబ్బంది ఔట్‌పోస్టు పోలీసులకు సమాచారం అందించారు. వారు 3.20 గంటలకు పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్‌చేసి విషయం తెలియజేశారు. ∙ 3.45 గంటలకు ఆదిలాబాద్ డీఎస్పీ నర్సింహారెడ్డి, టూటౌన్ సీఐ స్వామి రిమ్స్‌కు చేరుకున్నారు. సంఘటన వివరాలను 3.55 గంటలకు ఎస్పీ విష్ణు ఎస్ వారియర్‌కు తెలియజేశారు. ∙ ఎస్పీ వెంటనే కంట్రోల్‌రూం అధికారులతో మాట్లాడి జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఆయా మండలాల ఎస్సైలను అలర్ట్ చేయాలని, వాహనాల తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ∙ 4.10 గంటలకు నేరడిగొండ, బోథ్, ఉట్నూర్, బోరజ్, తలమడుగు మండలాల పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ∙ 5 గంటల సమయంలో నేరడిగొండ టోల్‌ప్లాజా వద్ద ఎస్సై జి.హరిశేఖర్ తనిఖీలు చేస్తుండగా బొలేరో వాహనంలో శిశువును ఎత్తుకుని ఉన్న పుష్పలతను గమనించి వివరాలు అడిగారు. ఆమె తడబడడం, రిమ్స్ నుంచి తెచ్చానంటూ చెప్పడంతో ఎస్సై ఆదిలాబాద్ డీఎస్పీ నర్సింహారెడ్డికి సమాచారం అందించారు. ఆమె వద్ద ఉన్న శిశువు ఫొటోలు తీసి వాట్సప్ ద్వారా పంపించారు. ∙ 5.10 గంటలకు ఆ ఫొటోలను డీఎస్పీ బాధిత తల్లిదండ్రులకు చూపించగా శిశువుపై ఉన్న గుడ్డ ఆధారంగాతమ కొడుకుగా గుర్తించారు. వెంటనే శిశువుతో పాటు సదరు మహిళను ఎస్సై రిమ్స్‌కు తరలించారు. పుష్పలత వాహనం వెనుకాల మరో వాహనంలో వస్తున్న ఆమె భర్త నగేష్ సైతం నేరడిగొండలో పుష్పలత వద్దకు రావడంతో ఇద్దరినీ అరెస్టు చేశారు. ∙ 5.30 గంటలకు శిశువును రిమ్స్‌కు తీసుకొచ్చారు. 6.30 గంటలకు జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ శిశువును తల్లిదండ్రులకు అందజేశారు. ∙ నిందితులను ఆదిలాబాద్ పట్టణంలోని పిట్టలవాడకు చెందిన పుష్పలత, సోయం నగేష్లుగా గుర్తించినట్లు ఆదిలాబాద్ ఏఎస్పీ సాదు మోహన్‌రెడ్డి, డీఎస్పీ నర్సింహారెడ్డి వెల్లడించారు. ∙ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి శిశువు కిడ్నాప్ కేసును గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసు యంత్రాంగాన్ని ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ అభినందించారు. రిమ్స్‌లో అంతా తెలియడంతోనే కిడ్నాప్ ఈజీ.. పసికందును కిడ్నాప్ చేసిన దంపతులు అంతకుముందు రిమ్స్ ఆస్పత్రిలో పనిచేశారు. గతంలో పుష్పలత రిమ్స్‌లో ఏఎన్ఎం శిక్షణ పొందగా.. ఆమె భర్త నగేష్ ఫుడ్‌స్టోర్‌లో వర్కర్‌గా పనిచేశాడు. దీంతో రిమ్స్‌లో ఏ మూలన ఏం ఉంటుందనేది వీరికి స్పష్టంగా తెలియడంతో పసికందును కిడ్నాప్ చాకచక్యంగా చేశారు. రిమ్స్‌లోని రెండు ప్రధాన ద్వారాల వద్ద సీసీ కెమెరాలు ఉండడంతో అటుగా వెళ్లకుండా దొడ్డిదారిన తీసుకెళ్లారు. డెలివరీ వార్డులో ఎవరికి అనుమానం రాకుండా పసికందును బయటకు తీసుకొచ్చి సీసీ కెమెరాలు లేని వార్డు నుంచి రేడియాలజీ విభాగం లోపలికి వెళ్లారు. అక్కడ ఉన్న చిన్న గేట్ తెరిచి ఉండడంతో ఆ గేట్ వెనుకాల నుంచి ఆస్పత్రి బయటకు వచ్చారు. నేరుగా పాత ఆస్పత్రి ముందు నుంచి బస్టాండ్‌కు వెళ్లి అక్కడి నుంచి బొలెరో వాహనంలో బయల్దేరారు. నేరడిగొండ ప్రాంతంలో అప్పటికే పోలీసులు తనిఖీలు చేపట్టడంతో వారికి చిక్కారు. వీరిది ఆదిలాబాద్ కాగా.. నిర్మల్ వైపు తీసుకెళ్లడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సదరు మహిళ తనకు పిల్లలు లేరని అందుకే తీసుకెళ్లానని చెబుతున్నా.. నమ్మశక్యంగా లేదు. శిశును ఇతర ప్రాంతానికి తీసుకెళ్లి విక్రయించే అవకాశాలు లేకపోలేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాలు పని చేయకపోవడంతోనే.. కిడ్నాప్ వివరాలు తెలుసుకునేందుకు ఎస్పీ రిమ్స్‌లోని వార్డుల్లో తిరిగారు. ముందుగా సీసీ కెమెరాల పనితీరును తెలుసుకునేందుకు సీసీటీవీ గదిలో కెమెరాల రికార్డులు పరిశీలించారు. ఏయే వార్డులో సీసీ కెమెరాలు ఉన్నాయో.. వాటి పనితీరు ఎలా ఉందని రిమ్స్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శిశువు కిడ్నాప్‌కు గురైన వార్డును సందర్శించారు. బాధితులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు. శిశువును ఎత్తుకెళ్లిన రూట్లను పరిశీలించారు. రేడియాలజీ విభాగం నుంచి బయట గేటు వరకు వెళ్లారు. కిడ్నాపైన వార్డు నుంచి బయట గేటు వరకు ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేకపోవడంతో కిడ్నాపర్లకు పని సులువైందని గుర్తించారు. భద్రతా సిబ్బందిపై చర్యలు శిశువు కిడ్నాప్ సమయంలో విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. సెక్యూరిటీ గార్డు అలర్ట్‌గా లేకపోవడంతోనే ఇలా జరిగిందని రిమ్స్ డైరెక్టర్ అశోక్‌కు తెలిపారు. త్వరలో సెక్యూరిటీ గార్డులతోపాటు మిగతా సిబ్బందితో డీఎస్పీ, డైరెక్టర్లు సమావేశమై భద్రతాపరమైన విషయాలపై చర్చించాలని ఎస్పీ పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఇందు కోసం పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు. -
అబద్ధాన్ని నిజం చేసేందుకే..
విజయవాడ(లబ్బీపేట) : విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో మగ శిశువు అపహరణ కేసులో నిందితులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. శిశువును అపహరించిన కొండవీటి నాగమల్లేశ్వరి(27)తోపాటు ఆమెకు సహకరించిన ఉద్యోగులు పీడియాట్రిక్ విభాగంలో రికార్డు అసిస్టెంట్ ఆర్. శ్రీను, సెక్యూరిటీ గార్డులు ముఖర్జీ, కన్నయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. తన భర్తకు చెప్పిన అబద్ధాన్ని నిజం చేసేందుకు నాగమల్లేశ్వరి ఆ శిశువును అపహరించినట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. నిందితురాలి నేపథ్యం ఇదీ.... అవనిగడ్డకు చెందిన కొండవీటి నాగమల్లేశ్వరి(27) పదో తరగతి వరకు చదువుకుంది. తన బావ వీరబాబును వివాహం చేసుకుంది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన అనంతరం భర్తతో మనస్పర్థలు రావడంతో విడిపోయింది. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఆమె బంధువుల ఇంటికి వెళ్లి అక్కడ ఒక టైలరింగ్ షాపులో పనిచేసింది. ఆ సమయంలో రాకేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అతనితో నాలుగేళ్లు కలిసి ఉంది. అనంతరం రాకేష్ మరొక మహిళను వివాహం చేసుకోవడంతో నాగమల్లేశ్వరి తిరిగి అవనిగడ్డకు చేరుకుని టైలరింగ్ పని చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటోంది. ఈ క్రమంలో ఉల్లిపాలేనికి చెందిన మద్దా జ్యోతి స్వర్ణరాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో 2015 మేలో అతడిని వివాహం చేసుకుంది. స్వర్ణరాజుకు గతంలో తనకు వివాహం జరిగిన విషయాన్ని నాగమల్లేశ్వరి చెప్పలేదు. తనకు పిల్లలు పుట్టరనే విషయం రాజుకు తెలిస్తే వదిలేస్తాడని, భావించి గర్భం వచ్చినట్లుగా రాజును నమ్మించింది. తాను బాత్రూమ్లో కాలుజారి పడటంతో గర్భసంచి కిందకు జారిందని, అందుకే కడుపు ఎత్తుగా లేదని నమ్మబలికింది. ఈ తరుణంలో ఎవరైనా అనాథ శిశువును తెచ్చుకుని తనకు పుట్టిన బిడ్డగా చూపించి భర్త రాజును నమ్మించాలనే ఉద్దేశంతో మగశిశువుల కోసం చాలాచోట్ల ప్రయత్నించింది. చెన్నై వెళ్లి ఆపరేషన్ చేయించుకుంటానని చెప్పి.. తనకు తొమ్మిదో నెల రావడంతో చెన్నై వెళ్లి ఆపరేషన్ చేయించుకుంటానని చెప్పిన నాగమల్లేశ్వరి ఇంటి నుంచి జూలై 11న బయలుదేరి వెళ్లింది. అక్కడ మగశిశువు కోసం ప్రయత్నించినా దొరకలేదు. అనంతరం రైల్వే స్టేషన్‌లోని వెయిటింగ్ హాలులో పెట్టిన ఒక సోనీ మొబైల్ ఫోన్ తస్కరించి ఈ నెల 13న సాయంత్రం విజయవాడ రైల్వేస్టేçÙన్కు వచ్చింది. అక్కడి నుంచి పాత ప్రభుత్వాస్పత్రికి చేరుకుని మగశిశువు కోసం ఆరా తీసింది. అక్కడ పరిచయం అయిన రికార్డు అసిస్టెంట్ శ్రీను(51) అనే వ్యక్తిని తన మాయమాటలతో లోబరుచుకుని, తనకు మగశిశువు కావాల చెప్పడంతోశ్రీను అంగీకరించాడు. చాణుక్య సాఫ్టవేర్ ద్వారా... చాణుక్య సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి కేసు మిస్టరీ చేధించారు. డీసీపీ కె.పాల్రాజు కేసును పర్యవేక్షించారు. కేసులో నిందితురాలుగా ఉన్న నాగమల్లేశ్వరిపై గతంలో ఒక పోలీస్ కేసు ఉంది. ఆమె మరొకరిపై ఫిర్యాదు చేసింది. ఆ రెండు వివరాలను చాణుక్య సాఫ్ట్వేర్ ద్వారా తెలుసుకుని ఆమెను విచారించటంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. చాణుక్య సాఫ్ట్‌వేర్‌లో 1.30 కోట్ల క్రైం రికార్డులు ఉన్నాయి. ప్రతి ఫిర్యాదు మొదలుకుని షీటు వరకు అన్నింటిని 2001 నుంచి పోలీస్ శాఖ డిజిటలైజేషన్ చేసింది. ఈ సాఫ్ట్‌వేర్‌లో మనం వ్యక్తి పేరు ఎంటర్ చేస్తే అతనికి సంబంధించిన సమగ్ర చరిత్ర వస్తుంది. శిశువు అపహరణ ఇలా.. ఈ నెల 14న ఉదయం 9 గంటలకు నాగమల్లేశ్వరి పాత ఆస్పత్రికి వచ్చి రికార్డు అసిస్టెంట్ శ్రీనును కలిసింది. అతని సహాయంలో సెక్యూరిటీ గార్డులు ముఖర్జీ, కన్నయ్యలను దాటి ఎస్ఎన్సీయూలోకి వెళ్లింది. అక్కడ స్టెప్ డౌన్ బ్లాక్‌లోకి వెళ్లారు. అక్కడ ఐతా కల్యాణి అనే మహిళ వద్ద ఐదు రోజుల శిశువును చూపించి శ్రీను బయటకు వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి సుమారు 10.30 నుంచి 11 గంటల మధ్య నాగమల్లేశ్వరి చాకచక్యంగా శ్రీను చూపించిన శిశువును అపహరించుకుని వెళ్లింది. బయటకు వచ్చి ఆటోలో రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అక్కడి నుంచి తెనాలి వెళ్లి భర్తను కలిసి ఇంటికి వెళ్లిపోయింది. శ్రీనుతో నాగమల్లేశ్వరి సన్నిహితంగా ఉండటం వల్ల అతనికి తెలిసిన మహిళ అనుకుని ఇద్దరు సెక్యూరిటీ గార్డులు తమ విధులను వదిలిపెట్టి వేరే పనిలో నిమగ్నమవడంతో శిశువు అపహరణకు పరోక్షంగా కారణమయ్యారని సీపీ తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్æపోలీస్ కమిషనర్ హరికుమార్‌తోపాటు, డీసీపీ పాల్‌రాజ్, ఏసీపీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. సిబ్బంది సస్పెన్షన్ : శిశువు అపహరణ కేసులో నిందితులుగా ఉన్న రికార్డు అసిస్టెంట్ శ్రీనును సిద్ధార్థ వైద్య కళాశాల అధికారులు గురువారం రాత్రి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఇద్దరు కాంట్రాక్టు సెక్యురిటీ గార్డులను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. -
శిశువు అపహరణ కేసులో ఐదుగురి అరెస్ట్
విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెజవాడ పాత ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు అపహరణ కేసులో అయిదుగురిని అరెస్ట్ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఆయన గురువారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రధాన నిందితురాలు గంగు మల్లేశ్వరితో పాటు ఆమె భర్త రాజు, ఆస్పత్రి రికార్డు అసిస్టెంట్ శ్రీను, సెక్యూరిటీ సిబ్బంది ముఖర్జీ, కన్నయ్యలను అరెస్ట్ చేసినట్లు వివరించారు. కాగా కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం తుంగలవారిపాలేనికి చెందిన గంగు నాగమల్లేశ్వరి గత గురువారం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువును అపహరించిన విషయం తెలిసిందే. -
పోలీసులకు కామినేని ప్రశంసలు
విజయవాడ: పాత ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు కిడ్నాప్ కేసును పోలీసులు 36 గంటల్లో ఛేదించారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఆయన శనివారం ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం కామినేని మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తల్లి ఒడికి చేరిన బాబు ఆరోగ్యం బాగానే ఉందన్నారు. ఈ కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని కామినేని స్పష్టం చేశారు. కిడ్నాప్ ఘటనలో ఆస్పత్రి సిబ్బంది ప్రమేయం ఉంటే వారిని ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగిస్తామని చెప్పారు. కేసు ఛేదనలో పోలీసుల పాత్ర అమోఘమని మంత్రి ప్రశంసించారు. అన్ని ప్రభుత్ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. మరోవైపు విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ శిశువు కిడ్నాప్ కేసులో అనేక ఆరోపణలు వస్తున్నాయని, పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామన్నారు. డబ్బులకు బాబును అమ్మారన్న కోణంలో కూడా విచారణ జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కేసులో ప్రజలు తమకు పూర్తిగా సహకరించారని సీపీ పేర్కొన్నారు. చదవండి.... (బెజవాడ శిశువు మిస్సింగ్ కథ సుఖాంతం) -
బెజవాడ శిశువు మిస్సింగ్ కథ సుఖాంతం
విజయవాడ: పాత ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు కిడ్నాప్ ఉదంతంలో మూడు రోజుల ఉత్కంఠకు తెర పడింది. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన బెజవాడ శిశువు కిడ్నాప్ కథ సుఖాంతమైంది. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో గురువారం అపహరణకు గురైన శిశువు ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. నిందితురాలు కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం తుంగలవారిపాలేనికి చెందిన గంగు నాగమల్లేశ్వరిగా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే బిడ్డను అపహరించిన నాగమల్లేశ్వరికి గతంలో వివాహమైంది. భర్తతో వివాదాల కారణంగా విడిగా ఉంటున్న ఆమె ఏడాది క్రితం కగ్గావారిపాలేనికి చెందిన రాజును రెండో పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ అవనిగడ్డ వెంకటేశ్వర ధియేటర్ రోడ్డులో నివాసముంటున్నారు. వీరికి సంతానం లేరు. అయితే ఇంటి నుంచి శిశువు ఏడుపు వినిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో అసలు విషయం బట్టబయలైంది. డీఎస్పీ ఖాదర్ బాషా నేతృత్వంలో అవనిగడ్డ సీఐ మూర్తి రాత్రి పదిన్నర సమయంలో నాగమల్లేశ్వరి ఇంటికి వెళ్లారు. మహిళను,శిశువును పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. వారి ఫోటో తీసి విజయవాడ కమిషనరేట్‌కు ఫోన్లో పంపించారు. శిశువు తమ బిడ్డేనని తల్లిదండ్రులు సుబ్రమణ్యం,కళ్యాణి గుర్తించారు. ఈ మేరకు ఎస్పీకి సమాచారమందించిన పోలీసులు పసికందును విజయవాడకు తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం శిశువును తల్లి ఒడికి చేర్చారు. బిడ్డను సురక్షితంగా తీసుకొచ్చిన పోలీసులకు,సహకరించిన మీడియాకు తల్లిదండ్రులు, బంధువులు కన్నీటితో కృతజ్ఞతలు చెప్పారు. -
బెజవాడ శిశువు మిస్సింగ్ కథ సుఖాంతం