హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో శిశువు కిడ్నాప్ వదంతులు కలకలం రేపాయి. శిశువు పుట్టిన వెంటనే తనను డిశ్చార్జ్ చేయమంటే వైద్యులు అంగీకరించక పోవడంతో ఆమె తన బంధువులతో కలసి పాపను దొంగతనంగా తరలించేందుకు యత్నించడం కొంతసేపు ఆస్పత్రిలో గందరగోళం సృష్టించింది. మౌలాలీకి చెందిన జ్యోతి(23) నాలుగు రోజుల క్రితం ప్రసవం కోసం గాంధీ ఆస్పత్రిలో చేరింది. ఈనెల 18న ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆస్పత్రిలో సేవలు చేసేందుకు ఎవరూ లేరని, సాధారణ ప్రసవం కావడంతో తనను డిశ్చార్జ్ చేయమని జ్యోతి వైద్యులను కోరింది. శిశువు ఆరోగ్యపరిస్థితి దృష్ట్యా వైద్యులు నిరాకరించారు. దీంతో సిబ్బందికి తెలీకుండా వార్డు నుంచి శిశువును ఇంటికి తరలించేందుకు తోటికోడలు సరోజ, బంధువు అంజలిల సాయం కోరింది. వారు శనివారం ఉదయం 11 గంటల సమయంలో వార్డులోకి వచ్చి శిశువుతో బయట పడే ప్రయత్నం చేశారు. కొద్దిసమయం తర్వాత జ్యోతి ఆస్పత్రి బయటకు వెళ్లింది.
అయితే శిశువును సెల్లార్ ద్వారం నుంచి బయటకు తీసుకెళ్లేందుకు జ్యోతి బంధువులు చేసిన ప్రయత్నం గుర్తించిన సెక్యూరిటీసిబ్బంది అనుమానంతో ఆమెను అడ్డగించారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకుని పోలీస్ అవుట్‌పోస్టుకు తీసుకువచ్చారు. పోలీసులు, ఆస్పత్రి అధికారులు గట్టిగా నిలదీయడంతో జరిగిన విషయం వారు వివరించారు. ఆస్పత్రి బయట ఉన్న బాలింత జ్యోతిని వార్డులోకి రప్పించి ఆరా తీయడంతో తన ఇంటివద్ద పరిస్థితుల కారణంగా డిశ్చార్జ్ కోరానని వైద్యులు నిరాకరించడంతో శిశువును దొంగతనంగా ఇంటికి తరలించేందుకు యత్నించామని తెలిపింది. పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు శిశువుతోపాటు జ్యోతిని వార్డు సిబ్బందికి అప్పగించారు. సరోజ, అంజలిలను గట్టిగా హెచ్చరించి పంపేశారు. అయితే ఇదంతా శిశువు కిడ్నాప్ ఉదంతంగా ప్రచారం అవ్వడంతో ఆస్పత్రిలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. చివరికి వదంతులకు తెరపడింది.
Comments
Please login to add a commentAdd a comment