‘కాలు’ తీసి చూస్తే కరెన్సీ | Ninety Six Thousand Rupees Find in Beggar Artificial Leg Karnataka | Sakshi
Sakshi News home page

‘కాలు’ తీసి చూస్తే కరెన్సీ

Published Fri, Jan 4 2019 9:04 AM | Last Updated on Fri, Jan 4 2019 9:31 AM

Ninety Six Thousand Rupees Find in Beggar Artificial Leg Karnataka - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరులోని కంటోన్మెంట్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో పడి ఉన్న గుర్తు తెలియని మృతదేహాన్ని అక్కడి హై గ్రౌండ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని తరలించే సమయంలో అతని కృత్రిమ కాలు బరువుగా అనిపించడంతో తీసి చూడగా అందులో రూ.96,780 నగదు లభించింది. అతడి వివరాలు ఆరా తీయగా అతడి పేరు షరీఫ్‌ సాబ్‌గాను, స్వస్థలం హైదరాబాద్‌ అని బయటపడింది. నగదుతో పాటు మృతదేహాన్ని అప్పగించేందుకు షరీఫ్‌ సంబంధీకుల వివరాలు ఆరా తీస్తున్నట్లు హౌ గ్రౌండ్‌ ఠాణా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ గాడేగ్‌ గురువారం ‘సాక్షి’కి తెలిపారు. మృతదేహంతో పాటు లభించిన కరెన్సీ ఫొటోలను ఆయన మీడియాకు విడుదల చేశారు.

దాదాపు 15 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ నుంచి వెళ్లిన షరీఫ్‌ సాబ్‌ (75) బెంగళూరులో స్థిరపడ్డాడు. కంటోన్మెంట్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఫుట్‌పాత్‌పై చిన్న గుడిసె వేసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. కొన్నాళ్లు చిన్నా చితకా పనులు చేసినా ఆపై భిక్షాటనే వృత్తిగా మార్చుకున్నాడు. కాగా 12 ఏళ్ల క్రితం గాంగ్రిన్‌ కారణంగా షరీఫ్‌ కుడికాలు తొలగించి ఆ స్థానంలో కృత్రిమ కాలును ఏర్పాటు చేశారు. స్థానికులకు షరీఫ్‌ సాబ్‌గా సుపరిచితుడైన ఈ వృద్ధుడు తాను బిచ్చమెత్తుకోగా వచ్చిన డబ్బులో ఖర్చులు పోను మిగిలింది తన కృత్రిమ కాలులోనే దాచుకునే వాడు. మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు కంటోన్మెంట్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని పబ్లిక్‌ టాయ్‌లెట్‌కు వెళ్లిన అతను అక్కడే హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. దీంతో అతడిని  పరిశీలించిన రైల్వే పోలీసులు చనిపోయినట్లు నిర్థారించి హై గ్రౌండ్‌ ఠాణాకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న ఎస్సై గాడ్గ్కే మృతదేహాన్ని శివాజీ నగర్‌లోని బౌరే ప్రభుత్వం ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అతడి కృత్రిమ కాలు బరువుగా ఉండటాన్ని గుర్తించిన అతను స్థానికుల సాయంతో కాలును తీసి చూడగా... అందులో కరెన్సీ బయటపడింది. లెక్కించగా... 42 రూ.500 నోట్లు, 470 రూ.100 నోట్లు, 20 రూ.200 నోట్లు, 215 రూ.50 నోట్లు, 430 రూ.20 నోట్లు, 528 రూ.10 నోట్లతో పాటు కొంత చిల్లరతో కలిపి మొత్తం రూ.96,780 లెక్కతేలింది. ఈ నగదును స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని బౌరే ఆస్పత్రిలో భద్రపరిచారు. షరీఫ్‌ తరచూ బౌరే ఆస్పత్రితో పాటు అక్కడి విక్టోరియా ఆస్పత్రికీ వెళ్లి వైద్యం చేయించుకునే వాడని తేలింది. దీంతో గాడ్గే్క ఆ రెండు ఆస్పత్రుల్లోనూ ఆరా తీయగా కొందరు సిబ్బంది, రోగులు షరీఫ్‌ను గుర్తించారు. తాను హైదరాబాద్‌కు చెందిన వాడినంటూ తమతో చెప్పే వాడని వారు పోలీసులకు తెలిపారు. అక్కడ ఉండే తన సోదరి సైతం కొన్నాళ్ల క్రితం చనిపోయిందని తమకు చెప్పాడని వివరించారు.

ఈ విషయంపై గాడ్గ్కే ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడుతూ... ‘అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి ప్రస్తుతం మృతదేహానికి పంచనామా నిర్వహించి బౌరే ఆస్పత్రిలో భద్రపరిచాం. మరో వారం రోజుల పాటు సంబంధీకుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తాం. ఆ గడువు పూర్తయిన తర్వాత చట్ట పరమైన ఫార్మాలిటీస్‌ పూర్తి చేసి పోస్టుమార్టం నిర్వహిస్తాం. ఆపై మృతదేహాన్ని మున్సిపాలిటీ అధికారుల సాయంతో ఖననం చేయాలని భావించాం. అయితే స్థానిక మైనార్టీ పెద్దలు కొందరు తమకు కలిసి ఓ ప్రతిపాదన చేశారు. షరీఫ్‌ కుటుంబీకుల కోసం తామూ ప్రయత్నిస్తామని... ఆచూకీ లభించని నేపథ్యంలో పోస్టుమార్టం పరీక్షల తర్వాత మృతదేహాన్ని తమకు అప్పగించాలని కోరారు. మతాచారాల ప్రకారం తామే ఖననం పూర్తి చేస్తామని, స్వాధీనమైన నగదు మాత్రం ప్రభుత్వానికి అందించాలని సూచించారు’ అని అన్నారు. షరీఫ్‌ సాబ్‌ కుటుంబీకులు, బంధువులు, సంబంధీకులు ఎవరైనా హైదరాబాద్‌లో ఉంటే బెంగళూరులో ని హై గ్రౌండ్‌ పోలీసులను సంప్రదించాలని కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement