లక్నో : మానవత్వం మంట కలిసిందనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. తోటి వ్యక్తి ప్రాణం పోతుంటే కాపాడాల్సింది పోయి అదేమి పట్టించుకోకుండా ఘటనను మొత్తం కెమెరాలో బంధించిన విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కస్‌గంజ్ ప్రాంతానికి చెందిన 69 ఏళ్ల వృద్దురాలిని ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న తుపాకీతో పాయింట్ బ్లాక్‌లో రేంజ్‌లో రెండు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడినుంచి వెళ్లిపోయాడు. అతను విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతుంటే చుట్టుపక్కల వాళ్లు చోద్యం చూస్తున్నారే తప్ప ఒక్కరు కూడా ఆమెను కాపాడడానికి ముందుకు రాలేదు. పైగా ఒక వ్యక్తి తన బిల్డింగ్ టెర్రస్ మీదకు ఎక్కి ఈ ఘటనను మొత్తం తన మెబైల్ ఫోన్‌లో బంధించాడు.
ఆ వీడియోలో వృద్దురాలి తలకు పాయింట్ బ్లాక్ రేంజ్‌లో గన్ పెట్టి కాల్చినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అంతేగాక మొదటి తూటాకు ఆమె గాయపడి ఇంట్లోకి పారిపోవడానికి ప్రయత్నించనందుకు మరోసారి కాల్పులు జరపడంతో అక్కడిక్కడే కుప్పకూలింది. ఆమెను కాల్చిన అనంతరం నిందితుడు పారిపోయాకా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వృద్దురాలి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అనంతరం ఫోన్‌లో ఉన్న వీడియో ఆధారంగా నిందితున్ని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. అతను పేరు మోను అని, అయితే వృద్దురాలిని ఎందుకు చంపాడన్నది మాత్రం తెలియాల్సి ఉందని పోలీసులు స్పష్టం చేశారు. అయితే నిందితునికి ఆశ్రయం ఇచ్చిన వ్యక్తితో పాటు తోటి వ్యక్తి ప్రాణాలు పోతుంటే కాపాడాల్సింది పోయి వీడియో తీసిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment