నీతూ నర్సు(ఫైల్)
నెల్లూరు(బారకాసు): కేరళ నర్సు అనుమానాస్పదంగా మృతి చెందింది. నెల్లూరులోని జీజీహెచ్ ఉన్నతాధికారులు ఓ అసోసియేట్ ప్రొఫెసర్‌ను పోస్టుమార్టం నిమిత్తం నియమించారు. సదరు ప్రొఫెసర్ అక్కడికి వెళ్లేలోపే విధుల్లోలేని మరో అసోసియేట్ ప్రాఫెసర్ పోస్టుమార్టం గదికి చేరుకుని మృతదేహంపై ఉన్న దస్తులు తొలగించి శుభ్రం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోస్టుమార్టానికి కేటాయించిన అసోసియేట్ ప్రొఫెసర్ నిర్ఘాంతపోయారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్లితే.. కేరళ రాష్ట్రానికి చెందిన నీతూ హైదరాబాద్ నగరంలోని ఓ ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తోంది.
ఆమెకు గతంలో నెల్లూరు నగరం కుక్కలగుంటలో ప్రైవేటు క్లినిక్ నిర్వహిస్తున్న డాక్టర్ దినేష్‌తో పరిచయం ఏర్పడింది. రెండేళ్లుగా వారిద్దరూ స్నేహితులుగా ఉంటున్నారు. ఈ క్రమంలో నీతూ ఈ నెల 1వ తేదీన నెల్లూరుకు వచ్చి దినేష్‌ను కలిసింది. ఆరోజు ఆమె అతనితోనే ఉంది. ఏం జరిగిందో ఏమో తెలియదుకానీ రెండో తేదీ నీతూ అనారోగ్యానికి గురైంది. దీంతో దినేష్ ఆమెను చికిత్స నిమిత్తం సింహపురి హాస్పిటల్లో చేర్పించి బాధిత తల్లిదండ్రులకు సమాచారం అందించారు. నీతూ తల్లిదండ్రలు ఈ నెల 3వ తేదీన నెల్లూరుకు చేరుకుని హాస్పిటల్‌కు వెళ్లిచూడగా అప్పటికే నీతూ మృతి చెందింది. దీంతో వారు చిన్నబజారులోని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు 4వ తేదీన అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు.
పోస్టుమార్టంలో ఏం జరిగిందంటే..
ఆ రోజున పోస్టుమార్టం విధుల్లో ఫోరెన్సిక్ అసోసియేట్ ప్రొఫెసర్ బి.నాగేంద్ర ప్రసాద్ ఉన్నారు. కొన్ని శవాలకు పోస్టుమార్టం నిర్వహించిన తరువాత ఆయన కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని నీతూ మృతదేహానికి పోస్టుమార్టం చేయాల్సి ఉంది. ఈ వ్యవధిలో విధుల్లో లేని ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శశికాంత్ మార్చరీ గదికి చేరుకున్నాడు. పోస్టుమార్టం సమయంలో ఫోరెన్సిక్ నిపుణులకు సహాయకుడిగా విధులు నిర్వహించే తోటిని పిలిచి ఫ్రీజర్ లో ఉన్న నీతూ మృతదేహాన్ని బయటకు తీసి దుస్తులు తొలగించి వాటిని తగలబెట్టారు. అనంతరం శవాన్ని నీటితో శుభ్రం చేశారు. ఈ నేపథ్యంలో నీతూ మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించేందుకు ఫోరెన్సిక్ అసోసియేట్ ప్రొఫెసర్ నాగేంద్రప్రసాద్ మార్చురీ గదికి వచ్చి నిర్ఘాంత పోయారు.
పోలీసులు అప్పగించిన మృతదేహం యథావిధిగా లేకపోవడంతో తోటిని ఏం జరిగిందని నిలదీశారు. డాక్టర్ శశికాంత్ ఆదేశాల మేరకు మృతదేహంపై దుస్తులు తొలగించి శుభ్రం చేసినట్లు తోటి పేర్కొన్నారు. ఇది చట్టవిరుద్ధమని పోస్టుమార్టం తాను నిర్వహించబోనని నాగేంద్ర పోస్టుమార్టం పత్రాలపై లిఖిత పూర్వకంగా రాశారు. శశికాంత్‌నే పోస్టుమార్టం నిర్వహించాలని కోరగా అందుకు ససేమిరా అని శశికాంత్ అక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే అప్పటికే సమయం గడిచిపోతుండడంతో నీతూ తల్లిదండ్రులు త్వరితగతిన పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని అప్పగించాలని నాగేంద్ర ప్రసాద్‌పై ఒత్తిడితెచ్చారు. దీంతో ఆయన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బాధిత తల్లిదండ్రులకు అప్పగించారు.
శశికాంత్ నిర్వాకంపై ఫిర్యాదు...
విధుల్లో లేని సమయంలో మార్చురీలోకి ప్రవేశించిన ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శశికాంత్ నడిపిన వ్యవహారంపై ఫోరెన్సిక్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌కు ఇటీవల లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. శశికాంత్ చట్టవ్యతిరేకంగా, అనైతికంగా వ్యవహరించారని ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
నీతూ నెల్లూరు ఎందుకొచ్చింది..
హైదరాబాద్‌లో పని చేస్తున్న నీతూ నెల్లూరుకు ఎందుకు వచ్చింది. ఆమెను డాక్టర్ దినేష్ ఎక్కడకు తీసుకెళ్లారు. దినేష్‌తో ఆమెకు ఉన్న సంబంధాలు ఏంటి. ఒక రోజు పాటు ఎక్కడున్నారు. నీతూ అనారోగ్యానికి ఎందుకు గురయ్యారు. సింహపురి ఆస్పత్రికి తరలించే సమయానికి ఆమె çపరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆమె మరణం వెనుక ఉన్న సందేహాలు. వీటిని చేధించేందుకు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇదిలా ఉంటే నీతూ గత కొంతకాలంగా లుకేమియా వ్యాధితో బాధపడుతోందని సమాచారం.
ఫిర్యాదును పరిశీలించాలి
నీతూ పోస్టుమార్టం విషయంపై ఫిర్యాదును చూడలేదు. ఫిర్యాదు నాకు వచ్చుంటే పరిశీలించాలి. నేను కొద్ది రోజుల క్రితమే ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌గా బాధ్యతలు చేపట్టాను. ప్రస్తుతం బిజీగా ఉన్నాను. పరిశీలించిన తరువాత ఏ విషయం అనేది చెబుతాను. – డాక్టర్ నిర్మల, ఇన్‌చార్జి ప్రిన్సిపల్, ఏసీఎస్సార్ ప్రభుత్వ వైద్యకళాశాల
Comments
Please login to add a commentAdd a comment