కాదేదీ కల్తీకి అనర్హం! | Oil Adulteration In Guntur | Sakshi
Sakshi News home page

కాదేదీ కల్తీకి అనర్హం!

Published Tue, Aug 7 2018 1:23 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

Oil Adulteration In Guntur - Sakshi

మంగళగిరిలో విజిలెన్స్‌ దాడుల్లో పట్టుబడిన కల్తీ నెయ్యి, నూనె సీసాలు (ఫైల్‌)

సాక్షి, అమరావతి బ్యూరో: కల్తీలకు కాదేదీ అనర్హం అన్నచందంగా జిల్లాలో కొందరు వ్యాపారులు చెలరేగుతున్నారు. ప్రతి వస్తువునూ కల్తీచేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. కూరలో వేసే కారం నుంచి నూనె వరకు, నెయ్యి నుంచి టీపొడి వరకు, ఆఖరికి పాలు, పెరుగు, మిఠాయిలు, పండ్ల వరకు ప్రతి ఒక్కదానినీ కల్తీమయం చేస్తున్నారు. ఏకంగా జంతువుల కొవ్వు, మాంసం వ్యర్థాలతో నూనెతీసి, దానిని విక్రయిస్తున్న ఘటన గుంటూరులో ఆదివారం వెలుగుచూసింది. ఇలా ప్రతి వస్తువునూ కల్తీ చేస్తుండటంతో ఏది కొనాలో ఏది కొనకూడదో, ఏది తింటే ఆరోగ్యం దెబ్బతింటుందో అన్న భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

సంచలనం రేకెత్తించిన కల్తీ కారం
రెండేళ్ల క్రితం గుంటూరులో కల్తీ కారం జిల్లాలో సంచలనం రేకెత్తించింది. పలు మిల్లులు, గోదాముల్లో భారీ స్థాయిలో కల్తీకారం, మిరపకాయల తొడేలతో చేసిన కారం పట్టుబడింది. అప్పట్లో విజిలెన్స్, జిల్లాస్థాయి అధికారులు హడావుడి చేశారు. ప్రత్యేక బృందాలతో తనిఖీ చేసి శాంపిల్స్‌ను తీశారు. 97 శాంపిల్స్‌ తీయగా వాటికి సంబంధించి 16 కేసులు కోర్టులో నడుస్తున్నాయి. మరో 45 కేసులు జేసీ కోర్టులో ఉన్నాయి. 12 కేసులకు సంబంధించి అధికారులు జరిమానాలతో సరిపెట్టారు. ఈ కల్తీ వ్యవహారంలో ఓ అధికారి పార్టీ నేత పంచాయితీలు జరిపి పెద్ద మొత్తంలో డబ్బులు దండుకొని కేసును కోల్డ్‌స్టోరేజీలపైకి నెట్టినట్లు ఆరోపణలు వినిపించాయి. గత ఏడాది ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ పుష్పరాజ్‌ గుంటూరులో దాడులు చేసినప్పుడు మళ్లీ కల్తీకారం పట్టుబడింది. అధికారులు ఎంతగా హడావుడి చేసినా కల్తీకారం తయారీకి అడ్డుకట్టపడలేదన్న వాస్తవం ఈ ఘటనతో వెల్లడైంది.

నెయ్యి, నూనె కల్తీతో ఆందోళన
జిల్లాలో విజిలెన్స్‌ దాడుల్లో కల్తీ నెయ్యి, నూనెలు పలుమార్లు పట్టుబడ్డాయి. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. తాము వాడుతున్న నూనెలు మంచివేనా అన్న అనుమానం వారిని పీడిస్తోంది. పండ్లు,టీపొడి, ఊరగాయలు, చికెన్, మటన్, ఇలా ప్రతి వస్తువులో కల్తీ జరుగుతోందని అధికారులు గుర్తిస్తున్నారు. దీంతో ప్రజలు ఏ వస్తువును కొనా లన్నా ఆందోళన చెందుతున్నారు. చివరకు హోటళ్లు, దాబాల్లో సైతం కల్తీ వస్తువులతో ఆహార పదార్థాలు తయారు చేస్తుండటంతో ప్రజారో గ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రధానంగా హోటళ్లు, ప్రైవేటు హాస్టళ్లు, ప్రభుత్వ హాస్టళ్లకు కల్తీవస్తువులు సరఫరా చేస్తుండటంతో విద్యార్థులు, హోటళ్లలో భోజనం చేసేవారు అనారోగ్యం పాలవుతున్నారు.

ఫుడ్‌ కంట్రోల్‌ శాఖలో సిబ్బంది కొరత
కల్తీ వస్తువులను నియంత్రించాల్సిన ఫుడ్‌ కంట్రోల్‌ శాఖ అధికారులు సిబ్బంది కొరతతో సతమతమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఫుడ్‌ కంట్రోలర్‌తో పాటు మరో ముగ్గురు సిబ్బంది మాత్రమే ఉండటంతో వారు కల్తీలను నియంత్రించలేకపోతున్నారు. విజిలెన్స్, పోలీసు అధికారులు పట్టుకున్నప్పుడు హాజరై శాంపిల్స్‌ తీసి కేసులు నమోదు చేసేందుకు మాత్రమే పరిమితమవుతున్నారు. జిల్లాలో తీసిన శాంపిల్స్‌ నాణ్యతా ప్రమాణాల పరిశీలన కోసం తెలంగాణకు పంపిస్తున్నారు. శాంపిల్స్‌ పరీక్షించి నివేదికలు వచ్చేం దుకు జాప్యం జరగడంతో అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారు. జిల్లాలో 2017 జనవరి నుంచి డిసెంబర్‌ వరకు ఫుడ్‌ కంట్రోల్‌ అధికారులు అన్నిరకాల ఆహార పదార్థాల్లో 449 శాంపిల్స్‌ తీశారు. 97 శాంపిల్స్‌ సురక్షతం (అన్‌సేఫ్‌/ సబ్‌స్టాండెడ్‌) అని పరీక్షల్లో తేలడం గమనార్హం. వీటిలో 14 కేసులు  నూనెలకుసంబంధించిన కేసులు ఉన్నాయి. 37అన్‌సేఫ్, 19 సబ్‌ స్టాండెడ్, 46 మిస్‌బ్రాండ్‌ వస్తువులుగా తేలాయి. వీటికి సంబంధించి కొన్ని కేసులు కోర్టులో నడుస్తుండగా, కొన్ని జాయింట్‌ కలెక్టర్‌ కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. గత జూలైలో మంగళగిరిలో పట్టుబడిన కల్తీ నెయ్యి, ఆదివారం గుంటూరులో పట్టుబడిన జంతు కొవ్వుల నూనె వ్యవహారం సంచలనం రేకెత్తించాయి. ఫుడ్‌ కంట్రోల్‌ అధికారులు నెలకు 30 నుంచి 40 శాంపిల్స్‌ తీయాల్సి ఉంది. అయితే ఈ శాంపిల్స్‌ తీసేందుకు వారికి వాహన సదుపాయం, సహాయ సిబ్బంది లేకపోవడంతోచట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం

జిల్లా వ్యాప్తంగా అన్నిరకాల ఆహార ఉత్పత్తులకు సంబంధించి శాంపిల్స్‌ తీస్తున్నాం. పరీక్షల్లో అన్‌సేఫ్‌ అని తేలితే క్రిమినల్‌ కేసులు నమోదు చేసి కోర్టులో పెడుతున్నాం. మిస్‌బ్రాండ్, సబ్‌స్టాండెడ్‌ వస్తే జేసీ కోర్టుకు నివేదిస్తున్నాం. ఈ ఏడాది కల్తీ నూనెలకు సంబంధించి 14 శాంపిల్స్‌ పరీక్షలు మిస్‌బ్రాండ్‌గా తేలాయి. హోటళ్లు, నూనె, కారం మిల్లులు, పండ్ల వ్యాపారం, నీరు, పాలు తదితర ఉత్పత్తుల సరఫరా చేసేవారిపై నిఘా పెంచాం. కల్తీల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం.    – షేక్‌ గౌస్‌మొహిద్దీన్, అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement